ఒకరిని వేలెత్తి చూపించే వేళ.. వారి మాదిరి తాము తప్పు చేయమని చెప్పటం చూశాం. అందరిలా వ్యవహరిస్తే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు అవుతారు చెప్పండి?
ఓపక్క తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ.. ఆయనపై ఒక రేంజ్ లో విరుచుకుపడిన కేసీఆర్.. ఆయన మాటల్ని తీవ్రంగా తప్పు పట్టారు. తనను పదే పదే జైల్లో వేస్తామంటూ బండి సంజయ్ చేసే మాటల్ని ప్రస్తావిస్తూ.. తీవ్ర ఆగ్రహావేశాల్ని ప్రదర్శించారు.
‘తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి సదువొస్తదో రాదో నాకు తెల్వదు. ఆయనతో మాట్లాడించి వాళ్ల ఇజ్జత్ తీసుకునే బదులు ఇంగొకరితో మాట్లాడించడం బెటర్. నన్ను జైళ్ల ఏస్తరంట అన్న మాట వింటే నవ్వొస్తుంది. దమ్మున్న మొగోడు ముంగలికి రావాలె జైళ్ల ఎయ్యనీకె.
మేం మీలేక దొంగలం కాదు.. లంగలం కాదు. మమ్ములను ఏసుడు ఏమో గాని మిమ్ములను ఏసుడు ఖాయం’ అంటూ ఫైర్ అయిన కేసీఆర్ తీరు చూస్తే.. ఆశ్చర్యపోవాల్సిందే.
ఓపక్క బండి సంజయ్ మాటల్ని వేలెత్తి చూపిస్తూనే.. మరోవైపు ఆయన కంటే దారుణమైన భాషలో బీజేపీపై తిట్ల దండకాన్ని ప్రయోగించిన కేసీఆర్ ‘లంగలం’ భాష వాడకుంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. బండి సంజయ్ భాషను.. ఆయన మాటల్ని పలువురు తప్పు పట్టటం తెలిసిందే.
తనకు కోపం వస్తే.. తనను తాను కంట్రోల్ చేసుకోకుండా ఉండటమేకాదు.. తన మాటల్ని కూడా ఇష్టారాజ్యంగా ప్రయోగించే కేసీఆర్.. మరోసారి తన రుద్ర రూపాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన భాష కాస్త మర్యాదగా ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.