చిన్న‌మ్మ మేన‌ల్లుడు ఢిల్లీలో చ‌క్రం తిప్పనున్నాడు

Update: 2017-03-06 07:45 GMT
ఇప్పటికే పార్టీని తన గుప్పెట్లో పెట్టుకున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శ‌శిక‌ళ మ‌రింతగా త‌న ప‌ట్టు బిగిస్తున్నారు. త‌న మేన‌ల్లుడు, పార్టీ ఉప‌ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అయిన‌ టీటీవీ దినకరన్ ద్వారా ప్రభుత్వ పాలనపై కూడా పట్టు సాధించనున్నారు. ఆ దిశగా ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు కేంద్రంగా పావులు కదిపారు. తద్వారా ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, తన వర్గానికి చెందిన లోక్‌సభ సభ్యులను తన కనుసన్నల్లో ఉంచుకునేలా ప్రయత్నించనున్నారు. ఇందుకోసం టీటీవీ దినకరన్‌ ను కేబినెట్‌ హోదాలో ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈమేరకు జైలులో ఉన్న ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఆదేశించినట్టు సమాచారం.

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్ళిన విషయం తెల్సిందే. దీంతో పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్‌ను నియమించారు. ఇదిలావుండగా, జైలులో ఉన్న శశికళను మంత్రులు కేఏ సెంగోట్టయ్యన్‌ - దిండిగల్‌ శ్రీనివాసన్ - కామరాజ్‌ - సెల్లూరు కే రాజు కలిశారు. ఆ సమయంలో పలు కీలకాంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో భాగంగా ఢిల్లీలో కేంద్ర రాష్ట్రాల మధ్య ప్రత్యేక ప్రతినిధిగా టీటీవీ దినకరన్‌ ను నియమించాలన్న ప్రతిపాదన రాగా, దీనికి శశికళ ఆమోదం తెలిపినట్టు సమాచారం. వారు అనుకున్న ప్రకారం అన్ని జరిగితే టీటీవీ దినకరన్‌ను కేబినె‌ట్‌ హోదాలో ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా నియమితులు కానున్నారు.

ప్రత్యేక ప్రతినిధిగా టీటీవీ దినకరన్ నియమితులైతే ఆయన ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌ను ఉపయోగించుకోవచ్చు. అక్కడే బస చేయవచ్చు. ఒక కార్యా లయాన్ని కూడా ఏర్పాటు చేసుకుని, కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే వివిధ రకాల కార్యకలాపాలను, చర్చలను పర్యవేక్షించవచ్చు. అంతేకాకుండా, రాష్ట్ర మంత్రులపై నిఘా పెట్టవచ్చు. తన వర్గానికి చెందిన లోక్‌సభ సభ్యులతో కలిసి రాష్ట్రాభివృద్ధికి చర్యలు చేపట్టవచ్చు. దీంతోపాటుగా రాష్ట్ర సచివాలయంలో కూడా ఒక కార్యాలయాన్ని కేటాయించే అవకాశం ఉంది. అలాగే, ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన అధికారికంగా కేబినెట్‌ మంత్రి హోదాలో పాల్గొనవచ్చు. ఇప్పుడు కేవలం పార్టీ కార్యకలాపాల్లోనే పాల్గొంటున్నారు. అందుకే శశికళ వ్యూహాత్మకంగా దినకరన్ ను ప్రత్యేక ప్రతినిధిగా నియమించేందుకు నిర్ణయించినట్టు త‌మిళ‌నాడు వ‌ర్గాలు అంటున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News