బాబు ఢిల్లీ మాట.. ఓటుకు నోటు బాట..

Update: 2018-10-30 05:04 GMT
ఈ ప్రాపంచకంలో అంత గొప్ప ఇంగిలీసు మాట్లాడే మొనగాడున్నడట్రా.. అని ఓ సినిమాలో విలన్ అనేస్తాడు.. అబ్బే ఆ యాస - భాస మనకు రాదబ్బాయ్.. అంటూ పక్కనుండే ఆర్టిస్ట్ బదులిస్తాడు.. నిజమే.. ఎవరి యాస వారిది.. శ్రీకాకుళం భాష ఒకరకంగా ఉంటుంది. కరీంనగర్ అచ్చ తెలంగాణ ఘాటుగా ఉచ్చరిస్తుంది. రాయలసీమ పౌరుషాల భాష భీకరంగా వినిపిస్తుంది. నెల్లూరు సాగతీత మాటలు అలరిస్తాయి. ఇలా ఎవరియాస వారిది. కానీ మన సీఎం చంద్రబాబు గారి మాటలు మాత్రం ఎవరూ కాపీ కొట్లలేరు. ఆయన ఇంగ్లీష్ భాష పఠిమను ఒక్కసారి వింటే వచ్చే జన్మలో కూడా ఇది బాబు గారి గొంతు అని ఇట్టి గుర్తుపట్టిపోతారు..

‘వాట్ ఐయామ్ సేయింగ్’.. ‘వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్’ అనే బాబు ఇంగ్లీష్ ఊత పదాలు జనసామన్యంలో ఎప్పటి నుంచో వైరల్.. ఆయన సీఎంగా గద్దెనెక్కాక పలుమార్లు జాతీయ మీడియాతో మాట్లాడుతూ ఇవే పదాలను వల్లెవేస్తుంటాడు.. అందుకే ‘వాట్ ఐయామ్ సేయింగ్’ అంటే అది బాబు గారే అన్న ముద్ర పడిపోయింది. బ్రీఫ్ డీ మీ అనే పదం కూడా వాడేస్తుంటారు బాబు గారు.

ఇదంతా ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మోడీ తీరును చంద్రబాబు ఎండగట్టారు. అదంతా వేరే విషయం. కానీ చంద్రబాబు మాట్లాడిన మాటలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు ఔత్సాహిక నెటిజన్లు బాబు ఢిల్లీలో మాట్లాడిన మాటలను - ఓటుకు నోటు కేసులో ఆడియోలో మాట్లాడిన మాటలను కట్ చేసి వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో వదిలేశారు. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.

ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎమ్మెల్సీలను రూ.50లక్షలకు బేరమాడి అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఆ సమయంలో ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ ను ప్రలోభాలకు గురిచేస్తూ మాట్లాడిన ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అది అచ్చం చంద్రబాబు గొంతును పోలి ఉందని కామెంట్లు వచ్చాయి.   ఎమెల్సీ స్టీఫెన్ సన్ తో మాట్లాడిన ఆడియోలో ‘వాట్ ఆల్ దే స్పోక్ విల్ హానర్’ అంటూ పలు ఇంగ్లీష్ ఊతపదాలు వాడారు. ఆ వాయిస్ తనది కాదంటూ చాలా సార్లు చంద్రబాబు  చెప్పుకొచ్చారు. ఎవరో మిమిక్రీ చేశారన్నారు. అదంతా విచారణలో తేలుతుంది. ఇప్పుడే ఆరోపణలు చేయలేం.

కానీ ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో అవే పదాలు రిపీట్ కావడంతో ఇది బాబు వాయిసే అని నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఓటుకు నోటు మాట్లాడిందే బాబే అంటూ తెగ షేర్లు చేస్తున్నారు. అచ్చుగుద్దినట్లు అలానే ఉన్న బాబు మాటలు చూసి ఎలా తప్పించుకుంటావ్ బాబూ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
   

Tags:    

Similar News