టీకొట్టు చాటింగ్‌ లాంటి ప్రసంగమా ఇది!

Update: 2016-08-28 07:31 GMT
పవన్‌ కల్యాణ్‌ ప్రసంగం గురించి సోషల్‌ మీడియా ఒకవైపు రాష్ట్రంలోని పవనిజం యూత్‌ మరొకవైపు ఎలాగైనా మాట్లాడుకుంటూ ఉండవచ్చు గాక.. కానీ కాస్త సీరియస్‌గా వ్యవహారాలను పట్టించుకునే రకానికి చెందిన యువత, వ్యక్తుల్లో మాత్రం.. అసంతృప్తిగానే ఉంది. ఇన్నాళ్లకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నమోసాన్ని, వంచనను ఇంత సూటిగా స్పష్టంగా నిలదీయడానికి, అరిచి మరీ ప్రశ్నించడానికి ఒకడొచ్చినందుకు చాలా సంతోషం. కానీ.. అతనికి అసలు సమస్య మీద, దాని తాలూకు మూలాల మీద తనకే సరైన అవగాహన లేదే అని వారు విచారిస్తున్నారు. ప్రత్యేకహోదా గురించి ఫైట్‌ వరకు ఓకే, కానీ దాని గురించి పూర్తి అవగాహన పవన్‌ కల్యాణ్‌కే ఉన్నట్లు కనిపించలేదంటున్నారు.

మూడంచెల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడానికి పిలుపు ఇచ్చే ఒక పార్టీ అధ్యక్షుడు ఎంత నిర్మాణాత్మకంగా మాట్లాడాలో పవన్‌ ప్రసంగం అలా సాగలేదని అంటున్నారు. తిట్టడం సూటిగానే ఉంది సంతోషమే, కానీ టీకొట్టు వద్ద కుర్రాళ్లు తిట్టినట్లుగా ఉందే తప్ప.. తన పార్టీ సేనలకు ఏం అవగాహన కల్పిస్తున్నారో తెలియడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. తన పోరాటం మూడు అంచెలలో ఏం జరుగుతుంది అనే సంగతులను మాత్రమే పవన్ ఈ సభలో వివరించారు.

పవన్‌.. హోదా విషయంలో మోసం జరిగిందని, పోరాడుతానని అన్నారు. అయితే.. హోదా అంటే ఏమిటో అది వస్తే రాష్ట్రానికి జరిగే లాభం ఏమిటో, కేంద్రం అది ఇవ్వకుండా నిధులు మాత్రం ఇస్తే జరిగే నష్టం ఏమిటో.. పవన్‌ వివరించి చెప్పి ఉండాల్సింది. అలా చెబితే.. ఆయన అనుచరులైన యువతరానికి కూడా.. తాము ఎందుకు పోరాడాలో.. ఒక స్పష్టమైన లక్ష్యం ఏర్పడేది. ప్రత్యేకహోదా వచ్చినట్లయితే... ప్రధానంగా పరిశ్రమలకు అనేక పన్ను రాయితీలు లభిస్తాయి, సాధారణంగా పరిశ్రమలకు భారీ మొత్తంలో ఉండే విద్యుత్తు చార్జీలను 50 శాతమే వసూలు చేస్తారు. పరిశ్రమలకు విధించే అన్ని రకాల కమర్షియల్ ట్యాక్సులనుంచి వారికి మినహాయింపు లభిస్తుంది. అందుకే ఈ హోదా వస్తే.. ఇక ఎవ్వరూ ఎవ్వరినీ బతిమాలవలసిన అవసరం లేదు. చంద్రబాబునాయుడు ప్రత్యేక విమానాలు వేసుకుని విదేశాలకు వెళ్లి.. అక్కడి పారిశ్రామిక వేత్తలను దేబిరించాల్సిన అవసరం ఉండదు. ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలే ఎగబడి మరీ ఇక్కడకు వస్తారు. ప్రత్యేకించి తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న ఏపీ రాష్ట్రం యొక్క బలం అది.

ఇలాంటి వివరాలు కొన్ని పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో చెప్పి ఉంటే.. అది ఆయన అభిమానులైన యువతకు ఎంతో స్ఫూర్తి ఇచ్చి ఉండేదని అందరూ అనుకుంటున్నారు. దీనివల్ల ఉద్యమానికి బలం చేకూరేది. అలా కాకుండా.. నేను చెప్పాను గనుక మీరు పోరాడండి.. అన్నట్లుగా పవన్‌ ప్రసంగం సాగి ఉండాల్సింది కాదు. ప్రత్యేకహోదాతో ఏం ప్రయోజనాలు ఉంటాయో, ఎలా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయో.. పరిశ్రమలో హోదా ద్వారా మాత్రమే ఎందుకు పెద్దసంఖ్యలో వస్తాయో ఏ వివరాన్ని కూడా పవన్‌ కల్యాణ్‌ చెప్పలేకపోయారు. మరి ఇలాంటి ప్రసంగం పట్ల టీకొట్టు చాటింగ్‌లా ఉన్నదనే విమర్శ రాకుండా ఉంటుందా?
Tags:    

Similar News