బ్యాంకు పేరు ప‌లికినా ఛార్జ్ చేసేయ్ ఎస్‌ బీఐ!

Update: 2017-04-19 04:09 GMT
బ్యాంకు పేరు గుర్తుకు వ‌స్తేనే భ‌య‌ప‌డేట‌ట్లు చేస్తోంది భార‌త ప్ర‌భుత్వ రంగ బ్యాంక్‌.. భార‌తీయ స్టేట్ బ్యాంక్‌. పెద్ద‌నోట్ల ర‌ద్దు అనంత‌రం.. డిజిట‌ల్ మ‌నీని మ‌రింత‌గా ప్రోత్స‌హించేందుకు.. ఈ-పేమెంట్ల‌ను మ‌రింత‌గా ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం విప‌రీతంగా ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌భుత్వ విధానాల్ని అమ‌లు ప‌రుస్తున్నామ‌న్న పేరుతో.. వీలు చిక్కిన ప్ర‌తిచోటా ఛార్జీల పేరిట బాదేస్తున్నాయి బ్యాంకులు. ప్రైవేటు బ్యాంకుల‌కు ఏ మాత్రం తీసిపోని రీతిలో వ్య‌వ‌హ‌రిస్తోంది ఎస్‌ బీఐ. ఇప్ప‌టికే ప‌లు సేవ‌ల‌కు ఛార్జీల‌ను ప్ర‌క‌టించి విమ‌ర్శ‌లు మూట‌గ‌ట్టుకున్న బ్యాంక్‌.. తాజాగా మ‌రో భారం మోపేందుకు సిద్ద‌మైంది.

ఎస్‌బీఐ కార్డు వినియోగించే వారు.. రూ.2వేలు అంత‌క‌న్నా త‌క్కువ మొత్తాన్ని చెక్కు రూపంలో చెల్లిస్తే.. ఏకంగా రూ.100ను రుసుము రూపంలో వ‌సూలు చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ నిర్ణ‌యాన్ని ఈ నెల ఒక‌టో తేదీ నుంచి అమ‌ల్లోకి తెచ్చేసిన‌ట్లుగా పేర్కొంది ఎస్‌ బీఐ. అదే స‌మ‌యంలో రూ.2వేల కంటే ఎక్కువ చెల్లింపుల విష‌యంలో మాత్రం ఎలాంటి రుసుములు వ‌సూలు చేయ‌మ‌ని చెబుతోంది.

త‌మ ఖాతాదారుల్లో 90 శాతం మంది నాన్ చెక్ రూపంలో చెల్లింపులు జ‌రుపుతున్నార‌ని.. చిన్న మొత్తాల‌కు సంబంధించి చెక్కులు వ‌స్తున్నాయ‌ని ఎస్‌ బీఐ కార్డు సీఈవో విజ‌య్ జ‌సూజా వెల్ల‌డించారు. చిన్న మొత్తాల‌కు సంబంధించి వ‌స్తున్న చెక్కుల కార‌ణంగా త‌మ‌కు ఇబ్బందిక‌రంగా ఉంద‌ని.. అందుకే డిజిట‌ల్ ప‌ద్ద‌తిలో చెల్లింపులు జ‌రిపేలా ప్రోత్స‌హిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. ఆ పేరుతో ఇష్టారాజ్యంగా వినియోగ‌దారుల మీద వడ్డ‌న‌ల వేయ‌టం ఎస్‌ బీఐకి అల‌వాటుగా మారింది.

తాజా కార్డు పేమెంట్ల మీద రూ.100 ఛార్జీ కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తుంద‌ని చెబుతున్నారు. చూస్తుంటే.. త‌మ బ్యాంకు పేరును అదే ప‌నిగా ప‌లికితే ఛార్జ్ వేయ‌టం మిన‌హా మిగిలిన అన్నింటికి ఛార్జీలు వేస్తుంద‌న్న ఆగ్ర‌హాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. ప్ర‌భుత్వ రంగ బ్యాంకు అయి ఉండి కూడా.. ఛార్జీల పేరుతో భారీగా వ‌డ్డిస్తున్న వ‌డ్డింపులు ఎస్‌ బీఐ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీస్తున్నాయ‌ని చెప్ప‌క తప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News