ఆన్ లైన్ ఖాతాదారుల‌కు ఎస్ బీఐ గుడ్ న్యూస్‌!

Update: 2017-07-13 13:57 GMT
పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌రం కేంద్ర ప్ర‌భుత్వం ఆన్ లైన్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే, ఆన్‌ లైన్ లో న‌గ‌దు బ‌దిలీ చార్జీల‌ను మాత్రం త‌గ్గించ‌క‌పోవ‌డంతో ఎక్కువమంది ప్ర‌జ‌లు న‌గ‌దు లావాదేవీల వైపే మొగ్గు చూపారు. ఈ నేప‌థ్యంలో ఆన్‌ లైన్ ఖాతాదారుల‌కు ఎస్ బీఐ బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇక‌నుంచి ఆన్‌ లైన్‌ చెల్లింపులపై 75శాతం ఛార్జీలు తగ్గిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

ఎస్‌ బీఐ ఆన్‌ లైన్‌ లో నగదు బదిలీ సేవలపై ఛార్జీలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఈఎఫ్‌టీ), రియల్‌ టైం గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్టీజీఎస్‌) ఛార్జీలను 75శాతం తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. తగ్గించిన ఈ రుసుములు జులై 15 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది. తగ్గించిన ఈ ఛార్జీలు ఇంటర్నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ ద్వారా లావాదేవీలు జరిపిన వారికి మాత్రమే వర్తిస్తాయని ఎస్ బీఐ స్పష్టం చేసింది.

ఆన్‌లైన్‌ ఖాతాదారులపై ఇటీవలే ఎస్‌బీఐ జీఎస్టీ ఛార్జీల భారం మోపిన సంగ‌తి తెలిసిందే. ఐఎంపీఎస్‌ ద్వారా రూ.1000 వరకు నగదు బదిలీపై ఎలాంటి ఛార్జీలు ఉండబోవని ఎస్టీఐ తెలిపింది. అలాగే రూ. 1001 నుంచి 1,00,000 లోపు నగదు బదిలీలపై జీఎస్టీ కింద రూ.5లు, 1,00,001 నుంచి రూ.2,00,000 వరకు రూ.15లు వసూలు చేస్తున్నట్టు ఎస్‌బీఐ వెల్లడించింది.  

మ‌రోవైపు, ఎన్‌ఈఎఫ్‌టీ లావాదేవీలకు రూ.10 వేల వరకు రూ. 2లకు బదులుగా ఇకపై రూ.1 వసూలు చేయనున్నారు. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు ట్రాన్స్‌ ఫర్‌ పై ప్రస్తుతం రూ.4కు బదులుగా రూ.2లు వసూలు చేయనున్నారు. రూ. లక్ష నుంచి రూ.2లక్షల మధ్య రూ.12లకు బదులుగా ఇకపై రూ.3లు మాత్రమే ఛార్జి పడనుంది.

ఆర్‌ టీజీఎస్‌ లావాదేవీలకు రూ.2లక్షల నుంచి 5లక్షల వరకు రూ. 20కు బదులుగా రూ.2 వసూలు చేస్తారు. అలాగే రూ. 5లక్షలకు పైబడిన లావాదేవీలకు రూ.40కు బదులు రూ.10లు మాత్రమే వసూలు చేయనున్నారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ సరికొత్త నిర్ణయం తోడ్పడుతుందని బ్యాంకు వ‌ర్గాలు భావిస్తున్నాయి.
Tags:    

Similar News