బిగ్ రిలీఫ్.. కరోనాకు మందు కనిపెట్టేశారట

Update: 2020-04-01 17:01 GMT
ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్న కరోనా వైరస్ కు సంబంధించిన రోజుకో కొత్త వార్త వింటున్న మనం క్షణక్షణం భయంభయంగానే కదులుతున్నాం. దాదాపుగా ప్రపంచంలోని మెజారిటీ దేశాలన్నీ లాక్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. కరోనా వైరస్ కు దూరంగా ఉండటం మినహా... ప్రస్తుతానికి మందులేవీ లేవన్న వార్తల నేపథ్యంలో బుధవారం వచ్చిన ఓ వార్త మాత్రం భారీ ఊరటనిచ్చిందని మాత్రం చెప్పక తప్పదు. అదేంటంటే... కరోనా వైరస్ ను చంపేసే మందును శాస్త్రవేత్తలు కనిపెట్టేశారట. అంతా అనుకున్నట్టుగానే జరిగితే... సెప్టెంబర్ లోనే ఈ మందు మనకు అందుబాటులోకి వస్తుందట. అయినా ఇంతటి కీలక వార్తను వినిపించిన శాస్త్రవేత్త ఎవరు? ఏ దేశానికి చెందిన వారంటారా?... కరోనాతో అల్లాడిపోతున్న అగ్రరాజ్యం అమెరికాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ జాకబ్ గ్లాన్ విల్లె బృందం ఈ మందును కనిపెట్టిందట.

ఆ వివరాల్లోకి వెళితే...  కరోనా వైరస్‌ బాధితులను రక్షించేందుకు మందు కనిపెట్టామని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన డాక్టర్‌ జాకబ్‌ గ్లాన్‌విల్లె బుధవారం సంచలన ప్రకటన చేశారు. సార్స్‌ వైరస్‌ ను నిర్వీర్యం చేసేందుకు ఉపయోగించిన ‘యాంటీ బాడీస్‌’నే ఉపయోగించి తన బృందం కరోనా వైరస్‌ పై విజయం సాధించిందని ‘డిస్ట్రిబ్యూటెడ్‌ బయో’ ల్యాబ్‌కు సీఈవోగా వ్యహరిస్తున్న జాకబ్ చెప్పారు. ఐదుగురుతో కూడిన తన బృందం ఐదు యాంటీ బాడీలను తీసుకొని లోతుగా పరీక్షలు నిర్వహించినట్టు వెల్లడించారు. సార్స్‌ను నిర్వీర్యం చేసే యాంటీ బాడీస్‌ తోనే తమ ప్రయోగం ఫలించిందని జాకబ్‌ వివరించారు.

మానవుడి శరీరంలోని కరోనా వైరస్... ఎస్‌–ప్రొటీన్‌ కణాల ద్వారా ప్రవేశిస్తుందని, తాము ఉపయోగించిన యాంటీ బాడీస్ - ఎస్‌–ప్రొటీన్‌ ను నిర్వీర్యం చేయడం ద్వారా కరోనా వైరస్‌ ను నాశనం చేసిందని జాకబ్‌ తెలిపారు. తాము కనిపెట్టిన మందును మనుషులపై క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకొన్న తర్వాత అందుబాటులోకి తీసుకువస్తామని ఆయన చెప్పారు. అంతా అనుకున్నట్టు జరిగితే... సెప్టెంబర్‌ నెలలో తమ మందు అందుబాటులోకి రావచ్చని ఆయన చెప్పారు. ఆ దిశగా ప్రయత్నాలను తాము ముమ్మరం చేశామని... మరో రెండు లాబొరేటరీల సాయంతో తాము చేసిన ప్రయోగ ఫలితాలను నిర్ధారించుకుంటున్నామని కూడా జాకబ్  తెలిపారు. జాకబ్‌ బృందం చెబుతున్నట్లుగా వారి ప్రయోగం ఫలిస్తే కరోనా మహమ్మారి నుంచి ప్రపంచ మానవాళికి రక్షణ లభించినట్టేనని చెప్పక తప్పదు.
Tags:    

Similar News