బండి, రేవంత్ గురించి ఢిల్లీ పెద్ద‌ల‌కు తెలిస్తే...

Update: 2022-05-28 17:30 GMT
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాద‌యాత్ర‌కు ఒకింత బ్రేక్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్న‌ప్ప‌టికీ ఆన్‌లైన్ లో ష‌ర్మిల త‌న వైఖ‌రిని వినిపిస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై వైఎస్ షర్మిల సంచలన వాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్, ఒక దొంగ అంటూ ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు. రెడ్డి సమాజానికి అధికారం ఇవ్వాలని... నాయకత్వం కట్టబెట్టాలని, ఇతర కులాలు న్యాయకత్వానికి పనికి రావ‌ని రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే అధిష్టానం ఆయ‌న్ను మందలించలేదు...సస్పెండ్ చేయలేదు స‌రిక‌దా కనీసం చర్యలు కూడా తీసుకోలేద‌ని ష‌ర్మిల విస్మ‌యం వ్య‌క్తం చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ కాంగ్రెస్ పార్టీ కి అధ్యక్షుడు గా ఉన్నారని ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు.

వైఎస్సార్ తోనే రాష్ట్రం లో అటు కేంద్రం లో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిందని రేవంత్ రెడ్డి నిజం ఒప్పుకొన్నార‌ని ష‌ర్మిల అన్నారు. వైఎస్సార్ ఏనాడూ కూడా ఒక కులం ఎక్కువ...ఒక కులం తక్కువ అని చూడలేదని ఆమె తెలిపారు. ప్రజలకు సేవ చేయాల‌న్న తపన నాయ‌కులు క‌లిగి ఉండాలి కానీ  కులం ప‌ట్టింపులు కాద‌ని ష‌ర్మిల అన్నారు. కాంగ్రెస్ కుల రాజకీయాలు చేస్తుంటే..బీజేపీ మత రాజకీయాలు చేస్తోంద‌ని ష‌ర్మిల ఆరోపించారు.

మసీదులు కూలగొడతామ‌ని, శవాలు ఉంటే ముస్లీంలవి అంట..శివుడు ఉంటే హిందువులవి అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతుంటే చర్యలు ఏవ‌ని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ''ఇది ప్రజాస్వామ్యమా .. రాచరికమా? పిచ్చోడి చేతిలో రాయి... బండి సంజయ్ చేతిలో బీజేపీ పార్టీ రెండు ఒకటే. మతాలను అడ్డం పెట్టుకొని నీచ రాజకీయాలు చేస్తున్నారు.

ప్రజలు శాంతిగా ఉండటం మీకు ఇష్టం లేదా? రక్తం ఏరులై పారాలా..ప్రజలు కొట్టుకొని చావాలా? ప్రధాని కూడా చూసి చూడనట్లు ఉన్నారు. ముస్లీం లకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ లు రద్దు చేస్తాం అని చెప్తున్నారు.

4 శాతం రిజర్వేషన్ లు తొలగించడం మోడీ కాదు కదా... అమిత్ షా వల్ల కూడా కాదు. '' అంటూ ష‌ర్మిల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ అవినీతి ఆధారాలు ఉన్నాయని చెప్తున్న బీజేపీ నేత‌లు అవినీతి ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదు అని ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News