ధావన్ కథ ముగిసే.. టెస్టుల్లో మెరిసి.. టి20ల్లో నిలిచి.. వన్డేలకు సారథిగా ఎదిగి.. అన్నిటికీ దూరం

Update: 2022-12-29 00:30 GMT
టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టేనా..? నిన్నటివరకు వన్డే కెప్టెన్ గా ఉన్న అతడికి ఇప్పుడు వన్డే జట్టులోనే చోటు దక్కకపోవడం దీనినే సూచిస్తోందా..? ఇక ఐపీఎల్ లో మెరిస్తే తప్ప, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మళ్లీ టీమిండియాలో కనిపించడా..? భారత్ లో జరిగే 2023 వన్డే ప్రపంచ కప్ ఆడి కెరీర్ కు గుడ్ బై చెబుదామనుకున్నధావన్ కల అర్థంతరంగా ముగిసిపోనుందా..?పరిస్థితులు చూస్తుంటే, వచ్చే నెలలో శ్రీలంకతో జరగబోయే వన్డే సిరీస్ కు ధావన్ ను పక్కనపెట్టడం చూస్తుంటే ఇదే నిజమనిపిస్తోంది.

ధనాధన్ గా వచ్చి.. విశాఖ పట్నంలోనే అరంగేట్రం 2003 అండర్ 19 ప్రపంచ కప్ జట్టు సభ్యుడైన ధావన్ ఆ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. 84.16 సగటుతో 505 పరుగులు చేశాడు. అయితే, ఆ తర్వాత రంజీల్లో ప్రతిభచాటలేకపోవడంతో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం ఆలస్యమైంది. 2008, 09 ఐపీఎల్ సీజన్లలో చక్కగా రాణించి తన సత్తా ఏమిటో చూపాడు. అనంతరం 2010 అక్టోబరులో విశాఖ పట్నంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. కానీ, మరో మూడేళ్లు అతడు నిలకడగా జట్టులో లేడు.

చివరకు 2013లో ఇదే ఆస్ట్రేలియాపై టెస్టు మ్యాచ్ ద్వారా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో సునామీలా విరుచుకుపడి ఏకంగా 187 (174 బంతుల్లో) పరుగులు చేయడం ధావన్ అంతర్జాతీయ కెరీర్ ను మలుపుతిప్పింది. అప్పటికి.. తన ఢిల్లీ జట్టు సహచరులు సెహ్వాగ్, గంభీర్ దూరమైన పరిస్థితుల్లో ధావన్ స్థానం స్థిరపడిపోయింది. ఇక అదే ఏడాది ఇంగ్లండ్ లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీని టీమిండియా గెలవడంలో ధావన్ పాత్ర కీలకం. తొలి రెండు మ్యాచ్ ల్లో సెంచరీలు బాదిన ధావన్ జట్టులో ఆత్మవిశ్వాసం నింపాడు.

పెద్ద టోర్నీల్లో చెలరేగుతాడు మిగతా సిరీస్ లు ఎలా ఆడినా.. పెద్ద టోర్నీలు అంటే మాత్రం ధావన్ చెలరేగుతాడు. 2013 చాంపియన్స ట్రోఫీ, 2015 వన్డే ప్రపంచ కప్ (412 పరుగులు), 2019 వన్డే ప్రపంచ కప్ తొలి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై సెంచరీ.. ఇలా పెద్ద టోర్నీల్లో ధావన్ ముద్రం సుస్పష్టం.

అయితే, 2018 త్వరాత ధావన్ టెస్టుల్లో నిలకడ లేమితో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత క్రమంగా టి20లకూ దూరమయ్యాడు. కానీ, వన్డేల్లో ధావన్ అవసరాన్ని గుర్తించి ఇంత కాలం కొనసాగించారు. ఇటీవలి న్యూజిలాండ్ పర్యటనకు అతడిని కెప్టెన్ చేశారు. కానీ, ఆరు మ్యాచ్ ల్లో ఒక్కటే (72) అర్ధ సెంచరీ చేశాడు. బంగ్లాపై మూడు వన్డేల్లో సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యాడు. దీంతో వేటు పడింది.

2023 ప్రపంచకప్‌ ఆడి కెరీర్‌ ముగిద్దామనుకున్న అతడికి నిరాశ తప్పలేదు. లంకతో సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంతో ధావన్‌ కెరీర్‌ దాదాపు ముగిసినట్లే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇషాన్ కిషన్ దెబ్బ ధావన్ కు యువ ఓపెనర్ ఇషాన్ కిషన దెబ్బ తగిలింది. బంగ్లాదేశ్ తో మూడో వన్డేలో కిషన్ ఏకంగా డబుల్ సెంచరీ బాది సీనియర్ కు పొగబెట్టాడు. అందులోనూ ధావన్ లానే కిషన్ కూడా ఎడమచేతివాటమే. యువకుడు, మెరుగైన స్ట్రోక్ ప్లేయర్ కూడా. దీంతో ధావన్ కు ఉద్వాసన తప్పలేదు. ఇప్పుడిక ధావన్ వన్డేల్లోకి తిరిగి రావాలంటే ఢిల్లీ జట్టు తరఫున రంజీల్లో అద్భుతంగా రాణించాల్సి ఉంటుంది. ధావన్ తన కెరీర్ లో 167 వన్డేలాడి 6,793 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News