శిల్పా కాన్ఫిడెన్స్‌ తో టీడీపీ వ‌ణికిపోతోందా?

Update: 2017-08-20 11:58 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో విజ‌యం ఏ ప‌క్ష‌మో తేలిపోయిన‌ట్లుగా ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన సంకేతాలు వెలువ‌డుతున్నాయి. నిన్న‌టికి నిన్న నంద్యాల ప్ర‌చారానికి వ‌చ్చే ముందు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు ముందు ఓ జాతీయ మీడియా సంస్థ ఈ ఎన్నిక‌లపై నిర్వ‌హించిన ఓ స‌ర్వేను పెట్టింద‌ట‌. ఆ స‌ర్వేను పూర్తిగా ప‌రిశీలించిన చంద్ర‌బాబు స‌ర్వేను ఏమాత్రం త‌ప్పుబ‌ట్ట‌డానికి కూడా సాహ‌సించ‌లేద‌న్న వాద‌న వినిపిస్తోంది. స‌ర్వేలోని అన్ని అంశాల‌ను కూలంక‌షంగా ప‌రిశీలించిన ఆయ‌న స్వ‌య‌కృతాప‌రాధం వ‌ల్లే నంద్యాల బైపోల్స్‌ లో ఓడిపోతున్నామ‌న్న భావ‌న‌కు వ‌చ్చి... ఇక త‌ప్ప‌ద‌న్న‌ట్లుగా ఆయ‌న నంద్యాల బ‌య‌లుదేరిన‌ట్లు కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.

నిన్న మొత్తం రోడ్ షోతోనే నంద్యాల‌ను చుట్టేసిన చంద్రబాబు... నేడు కూడా నంద్యాల‌లో ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో బాబు నంద్యాల‌లో ఉన్న స‌మ‌యంలోనే  విప‌క్ష పార్టీ వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డి మీడియాతో ముచ్చ‌టించిన సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఉప ఎన్నికలో త‌న గెలుపు ఖాయ‌మైపోయింద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. విజ‌యం త‌న‌దేన‌ని తేలిపోయింద‌ని, అయితే మెజారిటీపై మాత్రమే తేలాల్సి ఉంద‌ని కూడా ఆయ‌న న‌ర్మ‌గ‌ర్భంగానే కీల‌క వ్యాఖ్య‌లు చేశార‌ట‌. అయినా ఏ పార్టీ అభ్య‌ర్థి అయినా... ఎన్నిక‌ల్లో త‌న‌దే విజ‌య‌మ‌ని చెబుతారు క‌దా... శిల్పా ప్ర‌క‌ట‌న‌లో ఆస‌క్తిక‌రమైన అంశ‌మేమిట‌న్న విష‌యానికి వ‌స్తే... తొలి రోజు నుంచి ప్ర‌చారం నిర్వ‌హిస్తూ వస్తున్న శిల్పా... నేడు మాట్లాడిన త‌ర‌హాలో ఏనాడూ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేద‌ట‌. మీడియాతో మాట్లాడుతున్న సంద‌ర్భంగానూ ఆయ‌న ముఖంలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్ప‌ష్టం గానే క‌నిపించాయ‌న్న‌ది మీడియా ప్ర‌తినిధుల మాట‌గా వినిపిస్తోంది.

ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌లైన తొలినాళ్ల‌లో నంద్యాల ఓట‌ర్లు టీడీపీ వైపే ఉన్నార‌ట‌. అయితే ఆ పార్టీ నేత‌ల వ‌రుస త‌ప్పిదాలు, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి... నంద్యాల‌లో ప్ర‌తి ఓట‌రును క‌లుస్తూ ముందుకు సాగిన వైనం టీడీపీకి దెబ్బకొట్టేశాయ‌న్న మాట వినిపిస్తోంది. ఓ వైపు బాబు స‌ర్కారు పాల‌న‌పై నిప్పులు చెరుగుతూ జ‌గ‌న్ ప్ర‌చారం చేస్తే... జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌నే ప‌ట్టుకుని టీడీపీ నేత‌లు జ‌గ‌న్ ను విమ‌ర్శించ‌డంపైనే దృష్టి సారించారు. అంటే.. వారు కూడా జ‌గ‌న్‌ కు  - ఆయ‌న పార్టీ అభ్య‌ర్థికి ప‌రోక్షంగా ప్ర‌చారం చేసిపెట్టార‌న్న మాట‌. మారిన ప‌రిస్థితుల‌న్నీ అర్థ‌మైపోయిన నేప‌థ్యంలో గెలుపు త‌న‌దేన‌ని శిల్పా ధీమాగా చెప్ప‌గ‌లిగార‌న్న విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.
Tags:    

Similar News