ఎదురుతిరిగితే ఈడీ ఎంటర్ అవుతుందా?

Update: 2022-06-27 10:30 GMT
మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన ముఖ్య‌నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ, ఆ పార్టీ సామ్నా ప‌త్రిక ఎడిట‌ర్ సంజ‌య్ రౌత్ పై ఎన‌ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) మ‌రోసారి పంజా విసిరింది. మ‌నీ లాండ‌రింగ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రుకావాల‌ని జూన్ 27న సోమ‌వారం నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఇప్ప‌టికే ఆయ‌న‌ను ఈడీ ఒక‌సారి విచారించిస సంగ‌తి తెలిసిందే. అప్పుడు సంజ‌య్ రౌత్ తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం విప‌క్ష నేత‌ల‌పై క‌క్ష క‌ట్టింద‌ని.. త‌న దారికి రానివారిని వేధిస్తోంద‌ని విమ‌ర్శించారు. ఇందుకు కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ‌ల‌ను దుర్వినియోగం చేస్తోంద‌ని మండిప‌డ్డారు.

త‌న ఆస్తులు స్వాధీనం చేసుకున్నా, కూల్చినా, త‌న‌ను చంపినా బీజేపీ చెప్పిన‌ట్టు చేయ‌న‌ని నాడు సంజ‌య్ రౌత్ హుంక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి చుక్క‌లు చూపిస్తున్న నేప‌థ్యంలో సంజ‌య్ రౌత్ మ‌రోసారి కీల‌కంగా మారారు.

రెబ‌ల్ ఎమ్మెల్యేలు వెంట‌నే అసోం నుంచి ముంబై వ‌చ్చి ముఖ్య‌మంత్రి ఉద్ధ‌వ్ ఠాక్రేకు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని హెచ్చ‌రించారు. లేదంటే ఎమ్మెల్యే ప‌ద‌వులు, మంత్రి ప‌దవులు రెండూ ఉండ‌వ‌ని రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. మ‌రోవైపు రెబ‌ల్ ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాల‌యాల‌పైకి శివ‌సేన కార్య‌క‌ర్త‌ల‌ను ఉసిగొల్పింది ఆయ‌నేనని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఈడీ సంజ‌య్ రౌత్ కు షాకిచ్చింది. వెంట‌నే విచార‌ణ‌కు రావాల‌ని నోటీసులు ఇచ్చింది.

జూన్ 28న మంగళవారం తమ ఎదుట హాజరు కావాలని ఈడీ తానిచ్చిన నోటీసుల్లో స్ప‌ష్టం చేసింది. పాత్రా చావ్ల్‌ భూ కుంభకోణం కేసుకు సంబంధించి.. 1,034 కోట్ల గోల్‌మాల్ చేసిన‌ట్టు సంజ‌య్ రౌత్‌పై ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కేసుకు సంబంధించి గ‌త ఏప్రిల్‌లో సంజయ్‌ రౌత్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

తాజాగా త‌న‌కు ఈడీ నోటీసుల జారీపై సంజ‌య్ రౌత్ ఘాటుగా స్పందించారు. విచార‌ణ కోసమే కాదు, అవ‌స‌ర‌మైతే జైలుకు వెళ్ల‌డానికి కూడా తాను సిద్ధ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు. తానెవ‌రికీ భ‌య‌ప‌డే ప్ర‌శ్నే లేద‌ని తేల్చి చెప్పారు. ఇదిలా వుండ‌గా సంజ‌య్ రౌత్‌కు ఈడీ నోటీసుల‌పై తిరుగుబాటు నాయ‌కుడు ఏక్‌నాథ్ షిండే త‌న‌యుడు వెట‌కారం ప్ర‌ద‌ర్శించారు. ఈడీ నోటీసుల నేపథ్యంలో సంజయ్‌ రౌత్‌కు నా శుభాకాంక్షలు అంటూ వ్యంగ్యాన్ని ప్ర‌క‌టించారు.

ముంబైలోని ఈడీ కార్యాలయంలో సంజయ్ రౌత్‌ను విచారించే అవకాశం ఉంది. ఇక, శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే క్యాంపులో ఉద్దవ్ ఠాక్రే నెంబ‌ర్ టూగా ఉన్న సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో సంజయ్ రౌత్‌కు ఈడీ నోటీసులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. ఈడీ చర్యపై ఉద్దవ్ మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News