ఏలూరు ఎపిసోడ్ లో కొత్త ట్విస్టు.. వణికించేలా నివేదిక వివరాలు

Update: 2020-12-12 08:14 GMT
సంచలనంగా మారిన ఏలూరు ఉదంతం ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టిస్తోంది. అప్పటివరకు బాగుండి.. అప్పటికప్పుడు తీవ్ర అనారోగ్యానికి గురి కావటం.. ఆసుపత్రి పాలు కావటం తెలిసిందే. ఎందుకిలా జరుగుతోందన్న దానిపై స్పష్టత రాలేదు. దీంతో తీవ్రమైన ఆందోళన వ్యక్తమైంది. ఎట్టకేలకు రాష్ట్ర.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు రంగంలోకి దిగి.. అంతుచిక్కని ఈ అనారోగ్యం మీద పరిశోధనలు.. అధ్యయనాలు నిర్వహించాయి. పద్నాలుగు సంస్థలు దీని సంగతి తేల్చే అంశం మీద ఫోకస్ పెట్టాయి.

ఇప్పటివరకు 611 మంది అస్వస్థతకు గురి కాగా.. అందులో 569 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఐదు కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నారు. ఇలాంటివేళ.. ఏలూరులోని బాధిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పరిశోధనలు జరుపుతున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా కొత్త విషయం వెలుగు చూసింది. అన్నంలో పాదరసం ఛాయలు కనిపించటంతో పాటు.. కూరగాయల్లో పురుగుమందు అవశేషాలు కనిపించినట్లుగా సీసీఎంబీ స్పష్టమైన రిపోర్టు ఇచ్చింది. ఎయిమ్స్ ఇచ్చిన రెండో నివేదికల్లో బాధితుల్లో సీసం ఎక్కువగా ఉన్నట్లుగా పేర్కొంది.

ఏలూరులో వింత అనారోగ్యం వెనుక సీసం.. నికెల్ ప్రభావం అత్యధికంగా ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ అంశంపై పరిశోధనలు చేస్తున్న సంస్థల్లో చాలావరకు దీనికి బలం చేకూరేలా నివేదికల్ని ఇస్తున్నాయి. అయితే.. అన్నంలో పాదరసం ఛాయలు కనిపించటం మాత్రం ఆందోళన కలిగిస్తున్న అంశంగా చెప్పాలి. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్ సంస్థ కొత్త విషయాన్ని గుర్తించింది.

ఏలూరు ప్రాంతంలోని వారు ఎక్కువగా సోనామసూరి రకం బియ్యాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఆ తర్వాత స్వర్ణ.. రేషన్ బియ్యాన్ని వాడతారు. ఇప్పుడు అన్నంలో పాదరసం ఛాయలు కనిపించటంతో పాటు.. అది ఏ రకం బియ్యంలో ఉందన్న విషయం ఇప్పుడు సందేహంగా మారింది. దీనికి సమాధానం వెతికేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దడ పుట్టిస్తున్న ఈ అనారోగ్యం మొత్తం మధ్యతరగతి.. దిగువ మధ్యతరగతి వారు నివసించే ప్రాంతాల్లోని వారే కావటం గమనార్హం. దీంతో.. వారు వాడే నీటిలోకాలుష్యం ఏమైనా చోటు చేసుకుందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ అంశం మీద కూడా పరిశోధన సంస్థలు అధ్యయనం చేస్తున్నాయి. అన్నంలో సీసం.. కూరగాయల్లో విష రసాయనాలకు కారణం ఏమిటన్న అంశంపై స్పష్టత వస్తే.. ఈ అనారోగ్య ఫజిల్ వీడిపోయే అవకాశం ఉందని చెప్పొచ్చు.
Tags:    

Similar News