లైట్ అయినప్పుడు ర్యాంకుల లెక్క ఎందుకో?

Update: 2016-04-21 06:25 GMT
తెలుగు తమ్ముళ్లకు పెద్ద కష్టమే వచ్చి పడింది. మంత్రి పదవుల్లో ఉన్నా.. స్కూలు పిల్లల మాదిరి ర్యాంకుల లెక్కలు తీయటం వారికి చిరాగ్గా మారింది. ఏపీ మంత్రుల పని తీరు మీద ర్యాంకుల మదింపు చేపట్టటం.. వాటి వివరాలు బయటకు పొక్కటంతో వాటికి వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఇది ఇబ్బందికరంగా మారుతోంది. ఏపీ రాజధాని పనుల విషయంలో చురుగ్గా వ్యవహరిస్తూ పనులు చేస్తున్నారన్న పేరున్న మంత్రి నారాయణ జాబితాలో చివరన ఉండటం పలువురిని ఆశ్చర్యపోయేలా చేసింది.

ఇక.. అసెంబ్లీ సమావేశాల సమయంలోనూ.. ఏపీ సర్కారు విధానపరమైన నిర్ణయాల్లో కీలకభూమిక పోషించే యనమల రామకృష్ణుడు సైతం ర్యాంకుల జాబితాలో చివరన ఉన్నారు. ఇలా సీనియర్ మంత్రులంతా ర్యాంకుల్లో వెనుకబడి పోయిన నేపథ్యంలో.. ఎందుకిలా? అనే దానికి సమాధానం చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. చిరాకు పుట్టిస్తున్న ర్యాంకుల గోల నుంచి తప్పించుకునే క్రమంలో వారు చేస్తున్న వ్యాఖ్యలు కొత్త చర్చకు తావిస్తున్నాయి.

ర్యాంకుల గురించి మాట్లాడిన మంత్రి నారాయణ.. పార్టీకి చెందిన వారు ఇచ్చిన ర్యాంకులని.. తాను ఎలా పని చేస్తున్నది అందరూ చూస్తున్నారని వివరణ ఇచ్చుకున్నారు. ర్యాంకులకు సానుకూలంగా ఉన్న అంశాల్ని తీసుకొని పనితీరును మరింత మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి నారాయణ ఎంత కష్టపడతారన్న విషయాన్ని మిగిలిన మంత్రులు సర్ది చెప్పటం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి.

నారాయణ పని తీరుకు కాంప్లిమెంట్లు ఇస్తూ మంత్రులు పత్తిపాటి పుల్లారావు.. శిద్దా రాఘవరావులు కవర్ చేసే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే.. ఈ ర్యాంకుల్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రే చెప్పినట్లుగా మంత్రి శిద్దా రాఘవరావు చెప్పటం విశేషం. మరి.. ర్యాంకుల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేనప్పుడు ర్యాంకుల్ని లెక్కేయాల్సిన అవసరం ఏమిటన్నది ఏపీ విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ర్యాంకుల యవ్వారం ఏపీ తమ్ముళ్లకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News