కేసీఆర్ న‌మ్మ‌క‌స్తుడైన స్నేహితుడేనా?

Update: 2018-08-28 03:55 GMT
స్నేహానికి సారూప్య‌త‌లున్న మైండ్ సెట్ చాలా అవ‌స‌రం. అందుకేనేమో.. ఒకే త‌ర‌హా మైండ్ సెట్ ఉన్న ప్ర‌ధాని మోడీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ల మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డ‌ట‌మే కాదు.. కొత్త దిశ‌గా అడుగులు వేస్తోంది. మోడీ ముందు కోర్కెల చిట్టా పెట్టి.. రోజుల వ్య‌వ‌ధిలో ఢిల్లీలో కూర్చొని.. ప‌ని పూర్తి చేసుకురావ‌టం ఇప్ప‌టివ‌ర‌కూ ఎవ‌రికీ సాధ్యం కాలేదు. ఆ కొర‌త‌ను తీరుస్తూ.. తాజాగా కేసీఆర్ ఆ ప‌నిలో పూర్తిగా స‌క్సెస్ అయ్యార‌ని చెప్పాలి.

మోడీ లాంటి నేత‌ను ఒప్పించ‌టం చిన్న విష‌యం కాదు. త‌న ప్ర‌యోజ‌నాల‌కు మాత్ర‌మే  పెద్ద‌పీట వేసే ఆయ‌న‌.. మిగిలిన‌వేమీ అస్స‌లు ప‌ట్టించుకోరు. అలాంటి ఆయ‌న కేసీఆర్‌ను న‌మ్మ‌కంలోకి తీసుకోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి. మోడీని కేసీఆర్ ఎలా క‌న్వీన్స్ చేశార‌న్న‌ది ఇప్పుడు కొత్త చ‌ర్చ‌కు తెర తీసింది.

ముంద‌స్తు మోజులో ఉన్న కేసీఆర్‌.. ఎట్ట‌కేల‌కు మోడీని ఒప్పించ‌ట‌మే కాదు.. తెలంగాణ‌కు భారీ తాయిలాలు పొందటం.. తాను ఢిల్లీకి తీసుకెళ్లిన కోర్కెల చిట్టాను దాదాపుగా పూర్తి చేసుకొని రావ‌టం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రికి భారీ విజ‌యంగా చెప్పాలి.

దేశానికి కాంగ్రెస్‌.. బీజేపీలు చేసిందేమీ లేద‌ని.. వీరిద్ద‌రికి ప్ర‌త్యామ్నాయంగా ఒక కూట‌మిని ఏర్పాటు చేస్తాన‌ని చెప్పి.. అందులో భాగంగా కొద్ది మంది అధినేత‌ల్ని క‌లిసిన కేసీఆర్ ను ప్ర‌ధాని మోడీ న‌మ్మారా? అన్న‌ది ఒక ప్ర‌శ్న‌. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు ఒక‌రికొక‌రు స‌హ‌క‌రించుకునేలా ఇరువురి మ‌ధ్య ఒప్పందం జ‌రిగింద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. అంటే.. ఇక ఇద్ద‌రు ర‌హ‌స్య స్నేహితులైన‌ట్లుగా చెప్పాలి.

మ‌రి.. స్నేహంలో న‌మ్మ‌కం చాలా అవ‌స‌రం. మ‌రి.. ఇద్ద‌రి మ‌ధ్య ఈ న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు ఉంది? ఇంత‌కీ.. ఈ ఇరువురి స్నేహం ఏ దిశ‌గా ప‌య‌నిస్తుంది?  ప్ర‌ధాని మోడీకి సీఎం కేసీఆర్ న‌మ్మ‌క‌స్తుడైన స్నేహితుడు అవుతాడా? అన్న‌ది మ‌రో ప్ర‌శ్న‌.
 
ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఈ ఇరువురి గ‌త చ‌రిత్ర‌ను చూస్తే.. అవ‌స‌రానికి వాడేసుకోవ‌టంలో ఘ‌న‌మైన ట్రాక్ రికార్డు క‌నిపిస్తుంది. అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎంత‌కైనా వంగిపోయి.. ఆ త‌ర్వాత చుక్క‌లు చూపించే త‌త్త్వం ఇద్ద‌రిలోనూ ట‌న్నులు.. ట‌న్నులు క‌నిపించే ప‌రిస్థితి. మొద‌ట‌గా మోడీ సంగ‌తి చూద్దాం. ఈ రోజున ఆయ‌న ఉన్న స్థాయికి కార‌ణం ఆయ‌న సొంత తెలివి ఒక ఎత్తు అయితే.. ఆయ‌న్ను త‌న శిష్యుడిగా న‌మ్మి అండ‌గా నిలిచిన బీజేపీ పెద్దాయ‌న అద్వానీ అన్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. మ‌రి..త‌న‌ను ఈ  స్థాయికి తీసుకొచ్చిన అద్వానీకి మోడీ చేసిందేమిటో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌లో  బాబును స్నేహితుడిగా చెప్పుకుంటూ.. ప‌వ‌న్ ను వెంట పెట్టుకొని ఏపీలో పర్య‌టించిన మోడీ.. ఆంధ్రోళ్ల‌కు త‌న‌కు తానుగా చాలానే హామీలు ఇచ్చారు. తాను కానీ ప్ర‌ధాని అయితే ఏపీ రూపురేఖ‌ల్ని మార్చేస్తాన‌ని ఘ‌నంగా ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఏమైందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇలా త‌న‌ను న‌మ్ముకున్న వాళ్ల విష‌యంలో మోడీ ఎలా వ్య‌వ‌హ‌రించారో అర్థ‌మ‌వుతుంది.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ సంగ‌తికి వ‌ద్దాం. మిగిలిన ముచ్చ‌ట్ల‌ను ప‌క్క‌న పెడ‌దాం. తెలంగాణ రాష్ట్రం ఇస్తే చాలు.. మీరేం చెబితే అది చేస్తా.. నా జీవిత కాల కోరిక తెలంగాణ‌. దాన్ని తీరిస్తే అంత‌కు మించి కావాల్సిందేముంది? ప‌ద‌వులు నాకు ముఖ్యం కాదు. నా జీవితానికి తెలంగాణ సాధ‌న ఒక ల‌క్ష్యం. ఆ క‌ల నెర‌వేరితే చాలు.. ఇంకేం అక్క‌ర్లేద‌న్న మాట‌నే కాదు.. తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ ను సైతం కాంగ్రెస్‌లో క‌లిపేస్తాన‌న్న హామీ నాటి కాంగ్రెస్ చీఫ్ సోనియాకుఇవ్వ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. తీరా తెలంగాణ ఇచ్చాక ఏమైందో చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. అంతేనా.. తెలంగాణను సాధించ‌ట‌మే త‌న ల‌క్ష్య‌మే త‌ప్పించి.. ప‌ద‌వులు చేప‌ట్ట‌టం త‌న తీరు కాద‌ని కేసీఆర్ అదే ప‌నిగా చెప్ప‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు.

ఇచ్చిన మాట మీద కేసీఆర్ నిల‌బ‌డ‌తాడు. మెడ కోసినా.. ఇచ్చిన మాట నుంచి వెన‌క్కి త‌గ్గ‌డు. మ‌న క‌ల‌ల తెలంగాణ రాష్ట్రంలో మొద‌టి ముఖ్య‌మంత్రి ద‌ళితుడు. ఈ దేశానికి స‌రికొత్త మార్గ‌ద‌ర్శ‌నం చేసేలా చేయ‌టమే నా ల‌క్ష్యం. అందుకు తెలంగాణ క‌ల‌ను అంద‌రూ సాకారం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న కేసీఆర్‌.. తెలంగాణ రాష్ట్ర సాధ‌న త‌ర్వాత ఏం చేశారో అంద‌రికి తెలిసిందే.

ఇలా చూసిన‌ప్పుడు మోడీ.. కేసీఆర్ ఇద్ద‌రిలోనూ చాలానే సారూప్య‌త‌లు క‌నిపిస్తాయి. మ‌రి.. ఇరువురి మ‌ధ్య మిత్ర‌త్వం అంటే.. అదెలా ఉంటుందో ఊహించ‌టం క‌ష్ట‌మైన వ్య‌వ‌హారం ఎంత మాత్రం కాదు. ఒకేత‌ర‌హా రాజ‌కీయాలు చేసే ఇరువురు అధినేత‌ల మ‌ధ్య స్నేహం ఎలా ఉంటుందన్న‌ది రానున్న రోజుల్లో అంద‌రి అనుభ‌వంలోకి రానున్నద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News