సింగర్ సిద్ధూ పోస్టుమార్టం రిపోర్టు చూస్తే.. హత్య ఎంత కిరాతకమో అర్థమవుతుంది

Update: 2022-05-31 13:01 GMT
శ వ్యాప్తంగా షాకింగ్ గా మారిన పంజాబ్ సింగర్ కమ్ ర్యాపర్ కమ్ కాంగ్రెస్ పార్టీ నేత సిద్ధూ మూసేవాలానను ఆదివారం దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. పలు వివాదాస్పద అంశాల్లో సింగర్ పేరు వినిపించేది. పలు భూవివాదాలతో పాటు కేసులతోనూ ఆయన పాత్ర ఉండేది. పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వం ప్రముఖులకు ఇచ్చే సెక్యురిటీని కుదించటం వల్లే అతని హత్య జరిగిందని తొలుత భావించినా.. ఆ తర్వాత వచ్చిన వివరాలు చూస్తే మాత్రం అతని నిర్లక్ష్యం కూడా అతని ప్రాణాల్ని తీసినట్లుగా చెప్పాలి.

గతంలో అతనికి నలుగురు చొప్పున ఉండే గన్ మెన్లను ఇద్దరికి కుదిరించారు. హత్య జరిగిన రోజున ఆయన తనతో పాటు గన్ మెన్లను తీసుకోకుండా వెళ్లారు. అప్పటికి ఆయన గన్ మెన్లను తీసుకెళ్లకపోవటంతో ఆయన తండ్రి హెచ్చరించినా వినలేదన్న మాట వినిపిస్తోంది. ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే అతను దారుణంగా హత్యకు గురయ్యారు. ఇతడి హత్య దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. సిద్దూ డెడ్ బాడీకి వైద్యులు పోస్టు మార్టం నిర్వహించారు.

ఈ సందర్భంగా షాకింగ్ అంశాలు వెలుగు చూశాయి. అతడి శరీరంలో మొత్తం 24 తూటాలు దూసుకెళ్లినట్లుగా వైద్యులు పేర్కొన్నారు. మొత్తం 24 బుల్లెట్లను సిద్దూ శరీరం నుంచి బయటకు వెలికి తీశారు. దీన్ని చూస్తే.. అతన్ని చంపే విషయంలో అతడి ప్రత్యర్థులు ఎంత కచ్ఛితంగా ఉన్నారన్నది అర్థమవుతుంది. అతడ్నిఎట్టి పరిస్థితుల్లో చంపేయాలన్న లక్ష్యంతో కాల్పులు జరిపినట్లుగా చెబుతున్నారు.

ఇక.. సిద్దూను చంపింది తామేనని లారెన్స్ బిష్ణోయ్ ముఠా ప్రకటించిన సంగతి తెలిసిందే. సిద్దూను హత్య చేసిన వారు పారిపోవటం.. వారిని పట్టుకునేందుకు పంజాబ్ పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పోలీసులు ఉత్తరాఖండ్ లో ఒక అనుమానితుడ్ని అరెస్టు చేశారు. డెహ్రాడూన్ కొండల్లో సాగుతున్న హేమకుండ్ సాహిబ్ పవిత్ర యాత్రలోని భక్తులతో కలిసిపోయిన నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేయగా.. అతడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన నిందితుల్ని సైతం ఉత్తరాఖండ్ లో అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తే హత్యకు అసలు కారణం తెలుస్తుందని చెబుతున్నారు.
Tags:    

Similar News