ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసిన సారు ఇప్పుడేం చేస్తారు?

Update: 2019-10-06 06:17 GMT
తొలి బంతికే ఆల్ అవుట్ చేయాలనుకోవటానికి మించిన అత్యాశ ఇంకేమైనా ఉంటుందా? ఆట మొదలు కాగానే.. పూర్తి కావాలన్న తొందర మొదటికే మోసాన్ని తీసుకొస్తుంది. సుదీర్ఘకాలం ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్ లాంటి నేత.. పాత రోజుల్ని మర్చిపోయారా? ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు.. ఆందోళన చేసే వారి ముందుండే ఆప్షన్ల గురించి ఆలోచించటం మానేశారా? ఏంటి? ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె నోటీసు ఇచ్చి.. పండుగ వేళ.. ప్రభుత్వానికి షాకిచ్చేలా ప్లాన్ చేస్తే.. వారిని దారికి తెచ్చుకునే విషయంలో కేసీఆర్ వేస్తున్న తప్పటడుగులు ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తీసుకురావటమే కాదు.. సర్కారు ఇమేజ్ డ్యామేజ్ అవుతున్న పరిస్థితి.

హక్కుల సాధన కోసం పోరాటాలే ఊపిరిగా.. ఉద్యమాలే జీవితంగా గడిపిన కేసీఆర్ లాంటి ఉద్యమ నేత రాష్ట్రానికి సీఎంగా ఉన్న వేళ.. వేరే వారు ఉద్యమాలు చేస్తున్నప్పుడు.. వారెందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలన్న అంశంపై రోటీన్ కు భిన్నంగా ఆలోచించాల్సిన అవసరం తాజా పరిణామాలు చూస్తే.. అర్థం కాక మానదు.

తాను చెప్పినట్లుగా సమ్మె విరమించకపోతే.. ఎస్మా చట్టాన్ని ఉపయోగించి.. ఉద్యోగాలు తీస్తానంటూ డెడ్ లైన్లు పెట్టటం ఎంత డేంజర్ అన్న విషయం కేసీఆర్ కు ఇప్పటికైనా అర్థమై ఉంటుంది. శనివారం సాయంత్రం ఆరు గంటల లోపు ఎవరైతే పనికి వస్తారో.. వారు మాత్రమే ఉద్యోగాల్లో ఉంటారని.. మిగిలిన వారిని తీసి పారేస్తామన్న పెద్ద మాటను చాలా సింఫుల్ గా చెప్పేసిన కేసీఆర్ తీరు సంచలనంగా మారటమే కాదు.. ఆర్టీసీ కార్మికుల్లో ఎక్కడా లేనంత పట్టుదల వచ్చింది.

ఉద్యమాలతో ఉక్కిరిబిక్కిరి చేసి.. కేంద్రం కొమ్ములు వంచిన కేసీఆర్ లాంటి నేత.. రాష్ట్రాధినేతగా ఉన్నప్పుడు న్యాయమైన డిమాండ్ల సాధనను అధికారబలంతో తొక్కేస్తానంటే ఎందుకు ఊరుకోవాలన్న పట్టుదల ఆర్టీసీ ఉద్యోగుల్లో పెరిగింది. దీని ఫలితంగానే 49,860 మంది కార్మికులు పని చేస్తుంటే ప్రభుత్వానికి భయపడి పనిలోకి వచ్చింది కేవలం 155 మందేనంటే పరిస్థితి ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

ఎస్మా బూచితో భయపెట్టాలని చూసిన కేసీఆర్ కు షాకిచ్చేలా ఆర్టీసీ నేతలు కొత్త ఎత్తులు వేశారు. విపక్ష నేతల్ని కలిసిన వారు.. వారి మద్దతును కోరారు. ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్న పార్టీలు అందుకు ఓకే అనటమే కాదు.. రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

ఒకవైపు పండుగ.. మరోవైపుహుజూర్ నగర్ ఉప ఎన్నికల వేళ.. ఆర్టీసీ సమ్మె విషయంలో తెగే వరకూ లాగితే ప్రభుత్వానికే నష్టమన్న మాట ఇప్పుడు వినిపిస్తోంది. అందుకే.. తొందరపడి ఫైనల్ వార్నింగ్ ఇచ్చేసిన కేసీఆర్.. చర్చల తలుపుల్ని తానే మూసేశారు. ఇప్పుడు ఓపెన్ చేయాలంటే.. ఆయన తన మాటను వెనక్కి తీసుకోవటమే కాదు.. వెనక్కి తగ్గానన్న సందేశాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇలాంటివి అవసరమా కేసీఆర్?
Tags:    

Similar News