సంచలనం : రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

Update: 2023-03-20 17:55 GMT
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజీ కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సోమవారం పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం సంచలనమైంది.

సాధారణంగా కేసులో ప్రమేయం ఉన్న వ్యక్తులు, నిందితులకు నోటీసులు ఇచ్చి విచారిస్తారు. కానీ ప్రతిపక్ష నేతలకు ఇలా ఇవ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం సంచలనంగా మారింది.

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్ నెలకొంది. రాజకీయ నేతలపై సిట్ ఫోకస్ చేసింది. ఇప్పటికే ఈ కేసులో కీలకంగా భావిస్తున్న ఇద్దరు ఉద్యోగులతోపాటు పాటుగా సహకరించిన వారిని సిట్ విచారిస్తోంది.

ఈకేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేసింది.  ఈ కేసులో హైకోర్టులోనూ ఈ వ్యవహారంపై పిటీషన్ దాఖలైంది. ప్రభుత్వం తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని.. పారదర్శకంగా వ్యవహరిస్తామని చెబుతోంది.

పేపర్ లీకేజీలో ఐటీ మంత్రి కె.టి.రామారావు వ్యక్తిగత సహాయకుడు తిరుపతి హస్తం కూడా ఉందని, గత ఏడాది అక్టోబర్‌లో టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో సిరిసిల్ల పరిధిలోని గ్రామాల్లో వందల మంది అభ్యర్థులు వందకు పైగా మార్కులు తెచ్చుకున్నారని రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. .

ఈ ఆరోపణలపై సిట్ సీరియస్ గా స్పందించింది. పేపర్ లీకేజీకి సంబంధించిన సమాచారం, ఆధారాలు తెలియజేయాల్సిందిగా రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. తాను చేస్తున్న ఆరోపణలకు సంబంధించి సరైన ఆధారాలు అందించాలని కోరారు. ఇతర రాజకీయ నాయకులకు కూడా ఇదే తరహాలో నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
      


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News