అమెరికాలో అలాంటి పరిస్థితి.. 40ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడేనట

Update: 2022-06-12 08:30 GMT
కొవిడ్ ఇచ్చిన షాక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి. ఇలాంటివేళ.. మరో ఉపద్రవం పొంచి ఉందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నిపుణుల అంచనా ప్రకారం.. మరో మహా ముప్పు ప్రపంచం మీద పడటానికి రంగం సిద్ధమవుతుందన్న మాట వినిపిస్తోంది. దీనికి తగ్గట్లే అగ్రరాజ్యమైన అమెరికాలో చోటుచేసుకుంటున్న పరిణామాలే నిదర్శనమని చెబుతున్నారు. కొన్ని దశాబ్దాల క్రితం చైనా.. రష్యాలోని కమ్యునిస్టులకు జలుబు చేస్తే.. భారత్ లోని వామపక్ష వాదులకు ముక్కులు కారేవని జోక్ చేసేశారు. గ్లోబలైజేషన్ పుణ్యమా అని.. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా.. దాని ప్రభావం అందరి మీదా పడే పరిస్థితి.

అందునా అగ్రరాజ్యమైన అమెరికాకు జబ్బు చేస్తే.. మిగిలిన ప్రపంచం వణికే పరిస్థితి. ఇప్పుడు అలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయని చెప్పాలి. గడిచిన నాలుగు దశాబ్దాల (అంటే 40 ఏళ్లు) వ్యవధిలో ఎప్పుడూ లేనంత ఎక్కువగా గ్యాస్.. ఆహార పదార్ధాల ధరల పెరిగిపోతున్న పరిస్థితి. దీంతో.. అమెరికాలో ద్రవ్యోల్బణం నలభై ఏళ్ల గరిష్ఠానికి చేరుకున్నట్లు చెబుతున్నారు. మేలో ధరలు 8.6 శాతం పెరిగినట్లుగా తాజాగా విడుదలైన అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

1981 తర్వాత ధరలు ఇంత భారీ ఎత్తున పెరగటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. వడ్డీరేట్ల పెంపు అంశంలో ఫెడరల్ రిజర్వు మరింత కఠినంగా వ్యవహరిస్తుందన్న మాట వినిపిస్తోంది. ధరల పెరుగుదల ప్రతి అంశంలోనూ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని.. కొత్త కార్లు.. పాతవాటితో పాటు రెస్టారెంట్ల బిల్లులు.. విమాన టికెట్లు.. ఇలా ప్రతి రంగంలోనూ ధరల పోటు స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు.

రష్యా - ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు కొట్టొచ్చినట్లుగా కనిపించినట్లు చెబుతున్నారు. నిపుణుల అంచనాలు నిజమై.. ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను మరింత వేగంగా పెంచే పరిస్థితి ఉందని.. అదే జరిగితే రుణాల భారం పెరిగి ఆర్థిక మాంద్యానికి దారి తీస్తుందంటున్నారు. అదే జరిగితే.. ఉద్యోగాల మీద ప్రభావం పడుతుంది. దాని తదనంతర పరిణామాల్లో భాగంగా మన దేశంలోని ఐటీ ఉద్యోగుల మీదా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. సో.. రానున్న రోజులు మరింత గడ్డువన్న విషయాన్ని అమెరికాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు. బీకేర్ ఫుల్.
Tags:    

Similar News