కీలక నియోజకవర్గం టికెట్‌ కోసం టీడీపీ నుంచి ఆరుగురు పోటీ!

Update: 2023-01-27 05:00 GMT
కృష్ణా జిల్లా గన్నవరంలో వల్లభనేని వంశీ ఎమ్మెల్యేగా ఉన్నారు .గత ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన వంశీ ప్రస్తుతం వైఎస్సార్సీపీతో అంటకాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున వంశీనే పోటీ చేసే అవకాశం ఉంది. అయితే ఆయన గెలిచే అవకాశాలు లేవని అంటున్నారు. ఓవైపు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ చైర్మన్‌ యార్లగడ్డ వెంకట్రావు, మరోవైపు వైఎస్‌ఆర్సీపీ పొలిటికల్‌ అడ్వైజరీ బోర్డు సభ్యుడు, దివంగత సీఎం వైఎస్సార్‌ సన్నిహితుడు దుట్టా రామచంద్రరావులు వల్లభనేని వంశీపై తీవ్ర అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు.

గన్నవరం తెలుగుదేశం పార్టీకి బలమైన కోట. వల్లభనేని వంశీ 2014, 2019లో టీడీపీ నుంచి గెలిచిన తర్వాత పార్టీని వీడి వైఎస్సార్‌ కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి టీడీపీ టికెట్‌ కోసం కనీసం అరడజను మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

పారిశ్రామికవేత్త పుట్టగుంట సతీష్‌కు టికెట్‌ ఇవ్వాలని టీడీపీ తొలుత భావించినా సతీష్‌ పెద్దగా ఆసక్తి చూపలేదు. ప్రస్తుతం గన్నవరం ఇంచార్జిగా బచ్చుల అర్జునుడు ఉన్నారు. కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా, ఎమ్మెల్సీగా ఆయన పనిచేశారు. అయితే అర్జునుడు మృదు స్వభావి, ఆర్థికంగా కూడా అంత బలవంతుడు కాదని అంటున్నారు. కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడంపై చంద్రబాబు ఆలోచిస్తున్నారని చెబుతున్నారు.

ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్‌ మోహన్‌ రావు, ఆయన భార్య, జిల్లా పరిషత్‌ మాజీ చైరపర్సన్‌ గద్దె అనురాధ పేర్లు కూడా కొంతకాలంగా వినిపించాయి.

అలాగే మైలవరం వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ టీడీపీలో చేరితే అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వైసీపీ తరపున వల్లభనేని వంశీ బరిలోకి దిగడం ఖాయం కాబట్టి ఆయనను ఎదుర్కోవడానికి కావాల్సిన సామాజిక బలం, ఆర్థిక బలం కూడా కృష్ణప్రసాద్‌ కు ఉన్నాయి.

అలాగే టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్న పట్టాభి పేరు కూడా గన్నవరం నుంచి పోటీ చేసేవారి జాబితాలో ఉంది. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లే ని పట్టాభి ఎంతవరకు వంశీని ఎదుర్కోగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇలా కనీసం అరడజను మంది పేర్లు ప్రచారంలో ఉన్నా గన్నవరం అభ్యర్థిపై చంద్రబాబు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. వల్లభనేని వంశీ బలమైన అభ్యర్థి కావడంతో ముందుగానే అభ్యర్థిని ఖరారు చేయాలని అంటున్నారు. నియోజకవర్గమంతా చొచ్చుకుపోవడానికి, ప్రచారాన్ని ఉధృతం చేయడానికి ముందే అభ్యర్థిని ఖరారు చేయాలని చంద్రబాబుకు టీడీపీ వర్గాలు సూచిస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News