ఇక కరెంట్ కావాలంటే .. ముందే చెల్లించాల్సిందే !

Update: 2021-08-27 14:30 GMT
తెలంగాణ రాష్ట్రంలో సరఫరా, పంపిణీ, బిల్లింగ్‌ నష్టాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఇక పై  ఇచ్చే కొత్త కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి ఛైర్మన్‌ టి.శ్రీరంగారావు వెల్లడించారు. సెల్‌ఫోన్‌ రీచార్జుల తరహాలో విద్యుత్‌ కోసం ముందే డబ్బులు చెల్లించి రీచార్జి చేసుకుంటేనే కరెంట్ వాడుకోగలం. దీన్ని మొదటగా ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ, సిరిసిల్ల కో–ఆపరేటివ్‌ ఎలక్ట్రిక్‌ సప్లై సొసైటీ పరిధిలో ప్రారంభించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు, కొత్తగా ఇచ్చే అన్ని విద్యుత్‌ కనెక్షన్లకు ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లను వినియోగంలోకి తీసుకురానున్నారు.

దీని పై ఇప్పటికే కసరత్తులు పూర్తికాగా , త్వరలోనే దీనిపై ఉత్తర్వులు అమలైయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా నష్టాల్లో ఉన్న డిస్కంలను ఆర్థికంగా పునర్వ్యవస్థీకరించేందుకు కేంద్రం ఇటీవల కొత్త పథకాన్ని తీసుకువచ్చింది.‘సాంకేతిక, వాణిజ్యపర విద్యుత్‌ నష్టాలు   15 శాతం కన్నా ఎక్కువ ఉన్న విద్యుత్‌ డివిజన్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పారిశ్రామిక, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు అందరికీ 2023 డిసెంబర్‌ నాటికి ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు బిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గడువులోగా స్మార్ట్‌ మీటర్లు బిగిస్తే.. వాటి వ్యయంలో 15 శాతాన్ని ప్రోత్సాహకంగా ఇస్తామని పేర్కొంది. ఈ పథకం అమలుపై వివిధ రాష్ట్రాల ఈఆర్సీలతో కేంద్ర విద్యుత్‌ మంత్రి ఆర్‌కే సింగ్‌ గురువారం సమావేశం నిర్వహించారు.

ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేయాలని డిస్కంలను ఆదేశిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఈఆర్సీలకు సూచించారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వాల సమ్మతి అవసరం లేదని తెలిపారు. గడువులోగా మీటర్ల ఏర్పాటు పూర్తికాకుంటే ప్రోత్సాహకాన్ని చెల్లించబోమని స్పష్టం చేశారు. టీఎస్‌ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 2023 డిసెంబర్‌ నాటికి వీటన్నింటి ఏర్పాటు పూర్తి చేయాల్సి ఉంది. ఇక 15 శాతంకన్నా తక్కువ విద్యుత్‌ నష్టాలున్న దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌) పరిధిలో 2025 మార్చి నాటికి స్మార్ట్‌ మీటర్లు, డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ ఫార్మర్లకు ఏఎంఆర్‌ మీటర్లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్‌ కు రూ.900కు మించకుండా, అలాగే డీటీఆర్, ఫీడర్ల మీటర్లకు సంబంధించి 15 శాతం వరకు కేంద్రం ప్రోత్సాహకంగా ఇవ్వనుంది. మొత్తంగా దేశ వ్యాప్తంగా మీటర్ల ఏర్పాటు కోసం కేంద్రం రూ.97,631 కోట్లను కేటాయించింది.  

ప్రీపెయిడ్‌ స్మార్ట్‌ మీటర్లు ఒకసారి బిగిస్తే ఆ తర్వాత మొబైల్ నెంబర్ కి రీఛార్జ్ చేసినట్టే పవర్ మీటర్ కి కూడా రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే కరెంట్ వారికి సరఫరా అవుతుంది.  రీచార్జి మొత్తం అయిపోయినా.. కొంత అదనపు గడువు/విద్యుత్‌ ఇస్తారు. తర్వాత ఆటోమేటిగ్గా సరఫరా నిలిచిపోతుంది. మళ్లీ రీచార్జి చేసుకున్నాకే సరఫరా అవుతుంది. ఇది మారుమూల గ్రామాల్లో నివశించే చదువులేని కొందరికి కష్టమే అని చెప్పాలి.
Tags:    

Similar News