అక్కడ మోడీ.. ఇక్కడ జగన్...సేం డైలాగ్ .. .సేం స్లోగన్ .!

Update: 2023-06-26 11:09 GMT
దేశంలోనూ రాష్ట్రంలోనూ వచ్చే ఏడాది ఎన్నికలు రాబోతున్నాయి. లోక్ సభకు 2024 మేలో ఎన్నికలు జరుగుతాయి. అదే సమయంలో ఏపీలో కూడా అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. ఏపీలో అయితే జగన్ని ఓడించడానికి విపక్షాలు కూటమి కట్టనున్నాయి. అందరూ ఏకం కావాలి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అంటూ పవన్ కళ్యాణ్ రెండేళ్ళుగా చెబుతూనే ఉన్నారు.

అది కార్యరూపం దాల్చేలాగే ఉంది. ఇక జగన్ కానీ ఆయన పార్టీ మంత్రులు కానీ ఒక్కటే చెబుతున్నారు మేము సింగిల్ గానే వస్తామని, విపక్షాలను తోడేళ్ళ గుంపుతో పోల్చుతూ విమర్శలు పదునెక్కిస్తున్నారు. అంతా కలసి వస్తున్నారు అంటేనే మా బలం ఏంటో తెలుస్తోంది కదా అని కూడా హాట్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కేంద్రంలో చూస్తే యాంటీ మోడీ కూటమికి రంగం సిద్ధం అవుతోంది. పాట్నాలో తొలి భేటీ జరిగింది. రెండవ మీటింగ్ కూడా తొందరలో సిమ్లాలో  జరగనుంది. పాట్నాలో జరిగిన భేటీ మీద బీజేపీ విమర్శలు ఎక్కు పెడుతోంది. అవి అచ్చం ఏపీలో వైసీపీ చేస్తున్న మాదిరిగానే ఉండడం విశేషం.

ఎవరెన్ని కూటములు కట్టినా మళ్లీ మోడీ గెలవడం ఖాయమని బీజేపీ మంత్రులు చెబుతున్నారు. అమిత్ షా అయితే మాకు మూడు వందలకు తగ్గకుండా సీట్లు వస్తాయని కూడా చెప్పుకొచ్చారు. మరో వైపు పాట్నా మీటింగ్ జరుగుతున్న వేళ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అయితే విపక్షాల మీద సెటైర్లు వేశారు.

మీరంతా కలిసారు అంటే మోడీని ఒంటరిగా ఎదుర్కోలేమని చెప్పడమే కదా. మా ప్రభుత్వం మోడీ మా పార్టీ అంత బలంగా ఉందని చెప్పినందుకు థాంక్స్ అని సెటైర్లు వేశారు. లేటెస్ట్ గా ఆమె మరో సారి విపక్షాల మీద విరుచుకుని పడ్డారు. సిం హమే సింగిల్ గా వస్తుందని, తోడేళ్ళు గుంపులుగా  వస్తాయని.

ఈ డైలాగు ఏపీలో చాలా కాలంగా విని విని అరిగిపోయిందే. వైసీపీ దీన్ని బాగా వాడేస్తోంది. ఇపుడు ఆ డైలాగ్ ని బీజేపీ వారూ వాడేస్తున్నారు.తోడేళ్లు వేటకు వెళ్లినప్పుడు గుంపులుగా బయటకు వెళ్తాయి. కానీ తోడేళ్లు సింహాన్ని వేటాడడం అసాధ్యం. తల్లులు, అక్కాచెల్లెళ్ల ఆశీర్వాదం ఉన్న మోడీ లాంటి  సింహాన్ని తోడేళ్లు ఎలా వేటాడతాయి" అని స్మృతి ఇరానీ ప్రశ్నించడం విశేషం.

అవినీతిపరులు సిద్ధాంతాలు లేని వారు అంతా ఒక్క చోట కలవాలని చూస్తున్నారు. అందరూ ఒక్క మోడీ మీద దాడిని యత్నిస్తున్నారు అని ఆమె అంటున్నారు. మొత్తానికి ఏపీలో వైసీపీ కేంద్రంలో బీజేపీ ఒక డైలాగ్ ని వాడేస్తున్నాయి. అక్కడ మోడీ సింహం అని సింగిల్ గానే వస్తారని బీజేపీ వారు అంటున్నరు. విపక్షాలను తోడేళ్ళ గుంపుతో పోలుస్తున్నాయి. ఇక్కడ జగన్ సింహం అని వైసీపీ అంటోంది.

మరి ఈ సింహం వర్సెస్ తోడేళ్ల ఫైట్ లో అక్కడా ఇక్కడా గెలిచేది ఎవరు, దేశానికి ఎవరు ప్రధాని ఏపీకి ఎవరు సీఎం అన్నది 2024లో ప్రజలే తేలుస్తారు. ఏది ఏమైనా మోడీ జగన్ ఒకే స్లోగన్ తో ముందుకు రావడం విశేషంగానే చూడాలని అంటున్నారు.

Similar News