మోదీతోనే తానంటున్న కొర‌క‌రాని కొయ్య‌!

Update: 2019-02-04 08:56 GMT
మ‌న‌దేశంలో ఎవ‌రి అండ‌దండ‌లూ లేకుండా స్వ‌శ‌క్తితో ఉన్న‌త స్థానాల‌కు ఎదిగిన మ‌హిళ‌ల సంఖ్య కాస్త త‌క్కువే. వారిని వేళ్ల‌పై లెక్క‌పెట్ట‌వ‌చ్చు. అలాంటి వాళ్ల‌లో ఒక‌రు స్మృతి ఇరానీ. కుటుంబ స‌భ్యులు వ‌ద్ద‌ని మొత్తుకుంటున్నా ప‌ట్టిన ప‌ట్టు విడ‌వ‌కుండా ఆమె గ్లామ‌ర్ రంగంలోకి అడుగుపెట్టారు. త‌న‌ను తాను నిరూపించుకున్నారు. ఆపై రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. కేంద్ర‌మంత్రి స్థాయికి ఎదిగారు.

అద్భుత వాక్చాతుర్యం స్మృతి ఇరానీ సొంతం. త‌న మాట‌ల‌తో చాలాసార్లు పార్ల‌మెంటు స‌మావేశాల్లో ఆమె ప్ర‌కంప‌న‌లు సృష్టించారు. ప్ర‌తిప‌క్షాల‌కు చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఎవ‌రికీ వెర‌వ‌ని నేత‌గా ఆమెకు పేరుంది. కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్క‌డానికీ అదే మ‌న‌స్త‌త్వం ఖాయ‌మైంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని మిగ‌తా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌రిస్థితి ఎలా ఉన్నా.. అమేథీ - రాయ్ బ‌రేలీ మాత్రం కాంగ్రెస్ కు పెట్ట‌ని కోట‌లు. రాయ్ బ‌రేలీ సోనియా గాందీ స్థానం. అమేథీ రాహుల్ నియోజ‌క‌వ‌ర్గం. 2009 ఎన్నిక‌ల్లో అమేథీలో రాహుల్ ను ఢీకొట్టే నేత కోసం బీజేపీ అన్వేషిస్తుండ‌గా తానున్నానంటూ ముందుకొచ్చారు స్మృతి. నాటి ఎన్నిక‌ల్లో ఆమె గెల‌వ‌లేక‌పోయినా.. రాహుల్ కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించారు. ఓట‌మి భ‌యం పుట్టించారు. ఆయ‌న మెజారిటీని బాగా త‌గ్గించారు. దీంతో అబ్బుర‌ప‌డిన బీజేపీ అగ్ర నాయ‌క‌త్వం స్మృతికి రాజ్య‌స‌భ స్థానం ఇచ్చి కేంద్ర మంత్రివ‌ర్గంలో స్థానం క‌ల్పించింది.

ప్ర‌స్తుతం కేంద్ర జౌళిశాఖ మంత్రిగా ఉన్న స్మృతి తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మోదీ రాజ‌కీయాలను వీడితే తాను కూడా నిష్క్ర‌మిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. పుణెలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో స్మృతి మాట్లాడారు. ప్ర‌ధాన‌మంత్రి స్థానంలో మిమ్మ‌ల్ని ఎప్పుడు చూడొచ్చు అని ఓ ప్రేక్ష‌కుడు ప్ర‌శ్నించ‌గా ఆమె బ‌దులిస్తూ.. త‌న‌ను ఆ స్థానంలో ఎప్పుడూ చూడలేర‌న్నారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌ పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పనిచేయడం త‌న‌ అదృష్టంగా భావిస్తున్నాన‌ని చెప్పారు. ప్రస్తుతం ప్రధానిగా  ఉన్న మోదీ రాజకీయాల నుంచి తప్పుకున్న రోజే తాను కూడా రాజకీయాల నుంచి విరమిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

మోదీ మిన‌హా మరొకరి నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక‌పోవ‌డం వ‌ల్లే అలాంటి నిర్ణ‌యం తీసుకున్నారా అంటూ ఎదురైన ప్ర‌శ్న‌కు స్మృతి బ‌దులిస్తూ.. గ‌త 18 ఏళ్లుగా తాను రాజ్ నాథ్ సింగ్‌ - నితిన్ గ‌డ్క‌రీ వంటి నేత‌ల నాయ‌క‌త్వంలో ప‌నిచేసిన సంగ‌తిని గుర్తుచేశారు. వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అమేథీ స్థానంలో తాను బ‌రిలో దిగాలా వ‌ద్దా అన్న సంగ‌తిని పార్టీ నాయ‌క‌త్వ‌మే నిర్ణ‌యిస్తుంద‌ని స్మృతి చెప్పారు.


Tags:    

Similar News