మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము నియామకంతో ఆ పార్టీకేనా ప్రయోజనం?

Update: 2023-01-25 14:00 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో బీజేపీ సైతం మంచి ఫలితాలు సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే జనసేన పార్టీతో బీజేపీకి పొత్తు ఉంది. అయితే జనసేనతో పొత్తు విషయంలో ఆ పార్టీ అంటముట్టనట్టు వ్యవహరిస్తోందని అంటున్నారు. జనసేనాని పవన్‌ కల్యాణ్‌ టీడీపీకి దగ్గరవుతుండటం వల్లే బీజేపీ కూడా తన వ్యూహం మార్చుకుందని అంటున్నారు.

ఒక దశలో ఏపీలో వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, వామపక్షాలు ఒక కూటమిగా; వైసీపీ, బీజేపీ కలిసి ఒక కూటమిగా పోటీ చేస్తాయని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు అడపదడపా జగన్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే తప్ప గట్టిగా ఏ విషయంలోనూ పోరాడింది లేదని అంటున్నారు. వైసీపీ అధిష్టానం మనసెరిగి సోము వీర్రాజు నడుచుకుంటున్నారని సొంత పార్టీ బీజేపీలోనే కొంతమంది నేతలు ఆయనపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో సోము వీర్రాజుకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఆయన వ్యవహారం నచ్చకే పార్టీని వీడే ప్రయత్నాల్లో ఉన్నారని అంటున్నారు. సోము వీర్రాజు వ్యవహార శైలిపై కన్నా లక్ష్మీనారాయణ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

కాగా ఇటీవల బీజేపీ జిల్లా అధ్యక్షులను సోము వీర్రాజు మార్చారు. అయితే వీరంతా సోము అనుచరులేనని.. గతంలో పార్టీ కోసం వీరు చేసిందేమీ లేదని బీజేపీ నేతలే విమర్శిస్తున్నారు. అధిష్టానానికి కూడా తెలియకుండా.. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జికి కూడా తెలియకుండా సోము వీర్రాజు జిల్లా అధ్యక్షుల నియామకాలు చేశారనే విమర్శలు ఉన్నాయి.

ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికల వరకు సోము వీర్రాజునే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటించారు. అంటే 2024 ఎన్నికల వరకు సోము వీర్రాజే బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా ఉంటారు.

మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌తో సంబంధాలను పునరుద్ధరించడానికి సోము వీర్రాజు ఎటువంటి ప్రయత్నాలు చేయకపోవడంపై ప్రధాని నరేంద్ర మోడీ అసంతృప్తితో ఉన్నట్టు గతంలో వార్తలు వచ్చాయి. సోము వీర్రాజు వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని బీజేపీలోనే ఒక వర్గం ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రధానమంత్రిని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చినప్పుడు వీర్రాజును మోదీ గుర్తించలేదని, తనను తాను పరిచయం చేసుకోవాలని ప్రధాని కోరినట్లు కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించిన సంగతి తెలిసిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News