ముద్రగడ పవన్ లది ఆ బంధమట !

Update: 2023-06-24 20:41 GMT
బీజేపీలో సోము వీర్రాజు మాటలకు అర్ధాలు చాలానే ఉంటాయని అంటారు. ఆయన పొత్తులు లేవు అంటారు జనంతోనే పొత్తు అంటారు. మరో వైపు జనసేనతో పొత్తు ఉంది అంటారు. ఇపుడు మిత్రుడు కాని మిత్రుడు పవన్ గురించి ఆయన జనసేన గురించి వారాహి యాత్ర గురించి సోము వీర్రాజు కామెంట్స్ చేడయమే స్పెషల్ గా చూడాలి.

గోదావరి జిల్లాలలో ముద్రగడ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఒక్క లెక్కన డైలాగ్ వార్ సాగుతోంది. వారాహి యాత్ర పవన్ ఏమి చెప్పారు అన్న దాని కంటే కూడా ఇపుడు ముద్రగడ పవన్ ల మధ్య మాటలు సవాళ్ళే హైలెట్ అవుతునాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య సీన్ లోకి వచ్చారు.

ఈ మొత్తం వ్యవహారంలో పవన్ని కుల నాయకుడిగా చూపించే ప్రయత్నం ఏదో జరుగుతోందని, అయితే పవన్ అందరి వాడు, అన్ని కులాల వారూ అంటూ జోగయ్య స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఇక బీజేపీ నేత సోము వీర్రాజు కూడా ముద్రగడ పవన్ ల గురించి ఏమన్నారు అంటే ఇద్దరిదీ రాజకీయ సమరం అని. ఇద్దరిదీ రాజకీయ బంధం అని.

అంతే తప్ప దానిని కుల వివాదంగా చూడాల్సిన పని లేదని స్టేట్మెంట్ ఇచ్చారు. ఇక తాను అన్న మాటలకు ఆయన వివరణ ఇస్తూ ముద్రగడ రాజకీయాల్లో ఉన్నారు, పవన్ కూడా ఉన్నారు. కాబట్టి ఇద్దరు నేతల మధ్య రాజకీయ ముచ్చటగానే దీన్ని చూడాలని సూత్రీకరించారు.

కానీ పవన్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన పార్టీ ఒకటి ఉంది. ముద్రగడ రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నారు. ఆయన కాపు ఉద్యమాన్ని నడిపారు. ఇపుడు చూస్తే దాన్ని కూడా ఆయన పక్కన పెట్టారు. ఒక విధంగా ఆయన మాజీ మంత్రి విశ్రాంత రాజకీయ నేతగానే చూడాలి. అలాంటి ముద్రగడను రాజకీయ నేతగా వీర్రాజు మార్చేశారు.

అందుకే ఆయన మాటలకు అర్ధాలు వేరు అని అనేది అంటున్నారు. ముద్రగడ మీద పవన్ ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడం, దానికి ముద్రగడ ఘాటుగా రియాక్ట్ కావడం రెండు లేఖలు రాయడం చకచకా జరిగిపోయాయి. ఆ లేఖలలో కూడా ముద్రగడ పవన్ని ఎక్కడా జనసేన అధినేత అని కూడా అనలేదు. సినీ నటుడు అనే సంభోదించారు.

ఇక కాపులకు మీరు ఎంత మేలు చేశారో ఏమిటో చెప్పండి అని డిమాండ్ చేశారు. కాపు నేత వంగవీటి రంగాను కూడా ముందుకు తెచ్చి మరీ ఆనాటి వివాదాలలో బాధితులకు ఏమి సాయం చేశారు అని అన్నారు. దాని కంటే ముందు పవన్ కూడా కాపులను భావోద్వేగాలతో రెచ్చగొట్టి కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారు అని విమర్శించారు.

మరి ఈ ఇద్దరి మాటలలో రాజకీయం ఎక్కడ ఉందని, కాపుల ప్రస్థావనే ఉంది కదా అని అంటున్నారు. అయితే కాపు వర్సెస్ కాపు అన్నది గోదావరి జిల్లాలలో ముదిరితే తప్పుడు సంకేతం వెళ్ళి అసలుకే ఎసరు వస్తుందని అంతా భావించడంతోనే కొంత సర్దుబాటు చేసే విధంగా కాపు నేతలు అలా రియాక్ట్ అవుతున్నారని అంటున్నారు. అందుకే జనసేన దోస్త్ అయిన బీజేపీ, దాని ప్రెసిడెంట్ కాపు అయిన సోము వీర్రాజు కూడా ఇది రాజకీయమే అని తేల్చేశారు అని అంటున్నారు.

Similar News