బాబు బండారం బీజేపీ దగ్గర ఉందా...?

Update: 2023-06-21 14:31 GMT
చంద్రబాబు బండారం ఏంటి, ఆయన లోగుట్టు ఉందా. అది ఏమిటి అన్నది ఇపుడు అందరి మదినీ దొలిచేస్తోంది. అసలు ఎందుకు ఈ డిస్కషన్ అంటే చంద్రబాబు బండారం బయటపెడతామని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేశారు. బాబు గురించి చాలా చెబుతామని అంటున్నారు.

మరి బాబు బండారం బీజేపీ దగ్గర ఉంటే ఇంతకాలం ఎందుకు ఆగారు, ఇపుడే ఎందుకు బయటపెట్టాలనుకుంటున్నారు అంటే అక్కడే మ్యాటర్ ఉంది. చంద్రబాబు తాజాగా ప్రత్యేక హోదా నినాదాన్ని ఎత్తుకున్నారుట. దాంతో సోము వీర్రాజుకు మండుకొస్తోంది. ప్రత్యేక హోదా అన్నది ముగిసిన అధ్యాయం అని బీజేపీ పెద్దలు పదే పదే చెబుతూ వచ్చారు.

ఒకనాడు ఏపీకి సీఎం గా ఉన్న చంద్రబాబు కూడా అదేమీ సంజీవిని కాదు కదా అన్నట్లుగా మాట్లాడారు, ఇపుడు మళ్లీ ఆయనే ప్రత్యేక హోదా అన్నది ఇవ్వాలని అంటున్నారు. దాంతో నీ సంగతి బయటపెడతామని సోము చెబుతున్నారు. ఇది పూర్తిగా బాబు రెండు విధానాలకు నిదర్శనం అని అంటున్నారు.

ఒకనాడు ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని ఇదే చంద్రబాబు అనలేదా అని సోము వీర్రాజు ప్రశ్నిస్తున్నారు. ఇపుడు మళ్లీ ఆయనే హోదా కావాలని సభలు పెట్టడం ఏంటి అని ఆయన మండిపడ్డారు. ఈ రకంగా రెండు నాల్కల ధోరణితో బాబు వెళ్లడాన్ని ఆయన ఖండించారు.

అదే పనిగా కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమని, బాబు బండారం కూడా తమ వద్ద ఉందని, దాన్ని బయటపెడతామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ పెద్దలను అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ తరచూ కలుస్తున్నారన్న విషయాన్ని కూడా ఆయన బయటపెట్టారు.

అంటే బీజేపీతో పొత్తు కావాలని ఒక వైపు కోరుకుంటూ మరోవైపు మాత్రం బీజేపీకి ఏపీలో నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని ఎలా అనగలుగుతున్నారని సోము వీర్రాజు ప్రశ్నించారు. మేమే కావాలని మా చుట్టూ తిరుగుతూ మా మీదనే ఆరోపణలు చేస్తారా అని సోముమండి పోయారు.

దీన్ని బట్టి చూస్తే బీజేపీ టీడీపీకి ఎక్కడైనా తేడా కొడుతోందా అన్న చర్చలు వస్తున్నాయి. ఈ మధ్యన చంద్రబాబు  బీజేపీని కొన్ని డిమాండ్లు చేస్తున్నారు, జగన్ సర్కార్ మీద చర్యలు తీసుకోమంటున్నారు. అదే విధంగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు. వీటిని చూస్తూంటే బీజేపీతో పొత్తుల మీద టీడీపీ షరతులు పెడుతోందా లేక సుముఖంగా లేదా అసలు పొత్తులకే సుముఖంగా లేదా అన్న చర్చ కూడా వస్తోంది.

ఏది ఏమైనా బాబు బండారం మా దగ్గర ఉంది అని బీజేపీ నేతలు అంటున్నారు అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. చూడాలి మరి కమలంతో చంద్రబాబుది కలహ వినోదమో, లేక అసలైన  సమరమో కొద్ది రోజులలో తేలనుంది అంటున్నారు.

Similar News