సోము సార్‌.. కొత్త రాగంతో పాత పాట‌!!

Update: 2023-02-03 09:40 GMT
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. ఎప్పుడు మాట్లాడినా.. ఎక్క‌డ మాట్లాడినా ఏదో ఒక వింత ఉండే ఉంటుంది. తాజాగా ఆయ‌న మ‌రోసారి  ఏపీలో ఎన్నిక‌ల పొత్తుల‌పై కామెంట్లు చేశారు. అయితే.. గ‌తంలో చెప్పిందే మ‌రోసారి చెప్పారు. వ‌చ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీల‌తో కలిసి వెళ్లే ప్రసక్తే లేదని సోమువీర్రాజు వెల్లడించారు. జనంతో వస్తే జనసేన తోనే వచ్చే ఎన్నికల్లో తమ పొత్తు ఉంటుందని సోము స‌ర్‌స్పష్టంగా చెప్పారు. కుటుంబ పార్టీలతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని నొక్కి వ‌క్కాణించారు.

అయితే.. ఒక‌వైపు.. జ‌న‌సేన టీడీపీ వైపు చూస్తోంది. తాను ఒంట‌రిగా వెళ్లి వీర‌మ‌ర‌ణం పొంద‌లేన‌ని.. ప‌వ‌న్ ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. దీంతో ఏపీలో టీడీపీ-జ‌న‌సేన పొత్తు ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, జ‌న సేన‌తోనే ఉన్నామ‌ని చెబుతున్న బీజేపీని కూడా క‌లుపుకొని వెళ్లాల‌ని ప‌వ‌న్ భావిస్తున్నారు. కానీ, బీజేపీ పెద్ద‌లు మాత్రం ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తుంటే.. సోము స‌ర్ మాత్రం.. క‌రాఖండీగా తేల్చి చెబుతున్నారు.

2019 ఎన్నికల తర్వాత రెండు పార్టీలు జ‌న‌సేన‌-బీజేపీలు కలిసి పోయాయి. రాజ‌ధాని ఉద్య‌మంలోనూ క‌లిసి పాల్గొన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా సంయుక్తంగా ముందుకు వెళ్తామని ఆ పార్టీ నేతలు అప్పట్లో ప్రకటించారు.

అయితే ఇటీవల రెండు పార్టీల తీరు ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఉంది. బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందా లేదా అన్న చర్చ నడుస్తోంది.

పవన్ కళ్యాణ్ వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో పొత్తులు ఉంటాయని ఒకసారి.. బీజేపీతో కలిసి పనిచేస్తామని మరోసారి చెబుతున్నారు.

దీంతో రెండు పార్టీల మధ్య దూరం పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. ఇటీవల జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో జనసేన అంశం ప్రస్తావనకు రాలేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు మాత్రం పవన్‌ తమతోనే ఉన్నారని అంటున్నారు. ఆయ‌నే కాదు.. విష్ణు స‌హా.. ప‌లువురు నాయ‌కులు కూడా ఇదే విష‌యం చెబుతున్నారు. అయితే.. క్లారిటీ లేని కాపురంలో క‌ల‌హాలు లేక‌పోయినా.. మ‌న‌సులు మాత్రం క‌ల‌వ‌డం లేద‌నేదివాస్త‌వం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News