బాబును గిల్లుతున్న బీజేపీ అగ్ర‌నేత‌

Update: 2015-09-17 10:34 GMT
బీజేపీ-టీడీపీ...జాతీయ స్థాయిలో, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిత్ర‌ప‌క్ష పార్టీలు. ఇరు పార్టీల‌కు చెందిన కేంద్రంలోని నాయ‌కులు బాగానే ఉంటున్న రాష్ర్ట నేత‌ల్లోనే కీచులాట జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేరు ప్ర‌ముఖంగా చెప్పుకోవ‌చ్చు. గ‌తంలో ప‌ట్టిసీమ‌పై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరును వీర్రాజు త‌ప్పుప‌ట్టిన  సంగ‌తి తెలిసిందే. ఇపుడు రాయ‌ల‌సీమ సెంటిమెంట్‌ తో బాబును గిల్లుతున్నారు.

న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించేలా చంద్ర‌బాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీర్రాజు సూచించారు. లేకుంటే ప్రత్యేక రాయలసీమ వాదన తెరపైకి వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. వికేంద్రీకృత అభివృద్ధి లేకనే తెలంగాణ ఉద్యమం వచ్చి, విభజన అనివార్యమైందనేది మరచిపోరాదన్నారు. చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేప‌డుతున్న అనేక కార్య‌క్ర‌మాల‌ను కోస్తాంధ్ర‌కే ప‌రిమితం అయిపోయాయ‌న్నారు. దీంతో సీమ‌లో అసంతృప్తి ప్రారంభ‌మైంద‌ని తెలిపారు. అందుకే రాయలసీమతోపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో నెలకొన్న వెనుకబాటు తనాన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వం సంపదను అన్ని జిల్లాలకు సమానంగా కేటాయించాలని సీఎం చంద్రబాబును కోరారు. హంద్రీనీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులను పూర్తి చేస్తే రాయలసీమ కరువు తీరుతుందని ఆయ‌న‌ సూచించారు. 150 టిఎంసిల గోదావరి, కృష్ణా మిగులు జలాలను రాయలసీమకు కేటాయించి కరువు నివారణ చర్యలు తీసుకోవాలని కోరారు.

తెలుగుదేశం ప్ర‌భుత్వానికి స‌మ‌యానుకూలంగా సూచ‌న‌లు ఇస్తున్న‌ట్లే ఇస్తూ...కొత్త సెంటిమెంట్‌ ను రాజేస్తున్న వీర్రాజు ప్ర‌క‌ట‌న‌లు మిత్ర‌పక్షాల మైత్రిపై ప్ర‌భావం చూపుతాయోమోన‌ని ఇరు పార్టీల నాయ‌కులు మ‌థ‌న‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News