ఉత్తరాంధ్రా భూములు కాకులెత్తుకెళ్ళాయా...నిజాలు చెప్పేదెవరు...?

Update: 2022-11-29 13:30 GMT
ఉత్తరాంధ్రా ఒక అద్భుతమైన ప్రాంతం. అమాయకమైన ప్రాంతం కూడా. ఒకనాడు రాజకీయాలు ఇక్కడ వారే చేసేవారు. వారే ఎంపీలు, ఎమ్మెల్యేలుగా ఉండేవారు. అయితే కాలక్రమంలో విశాఖ అభివృద్ధి చెందడం కాస్మోపాలిటన్ కల్చర్ రావడంతో ఇతర ప్రాంతాల నుంచి వెల్లువలా వచ్చిన వారు వ్యాపార ఉపాధి రంగాల పేరిట విశాఖలో స్థిరపడ్డారు. వారే  కాస్తా బలపడ్డాక తదనంతర కాలంలో రాజకీయాలు చేయడానికి రెడీ అయ్యారు.

వారికి అలా అవకాశాలు తెలుగుదేశం పార్టీ నుంచి మొదట లభించక అదే వైఖరిని ధోరణిని మిగిలిన పార్టీలు సక్సెస్ మంత్రగా భావించి అనుసరించాయి. ఈ క్రమంలో ఉత్తరాంధ్రా లో రాజకీయ అధికారం చాలా దశాబ్దాలుగా స్థానికేతరుల చేతుల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో ఉత్తరాంధ్రా మీద పెత్తనం కూడా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారు చేస్తూ పోయారు.

ఈ క్రమంలో ఉత్తరాంధ్రా వనరుల మీద కూడా స్థానికేతరుల పెత్తనం పెరిగింది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇపుడు చూస్తే కొంతమంది నాన్ లోకల్ నాయకులతో కలసి స్థానికులు కూడా చేస్తున్న దాష్టికం మూలంగా భూ కబ్జాలు పెద్ద ఎత్తున పెరిగిపోయాయి అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకనాడు విశాఖ చుట్టుపక్కల వందల వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉంటే ఈ రోజుకు కనీసం అభివృద్ధి కోసం కూడా ప్రభుత్వ భూములు లేవు అన్న మాట వినిపిస్తోంది.

మరి ఈ భూములు అన్నీ ఏమయ్యాయి అన్నది కీలకమైన మౌలికమైన ప్రశ్న. వీటిని కాకులు ఎత్తుకెళ్ళాయా అని కూడా ఎకసెక్కంగా అనే వారు అంటున్నారు. అదే విధంగా చూస్తే 2014లో హుదూద్ తుఫాన్ వచ్చినపుడు భూమి రికార్డులు అన్నీ పోయాయని కూడా ప్రచారం చేసిన మహానుభావులు ఉన్నారు. ఈ  క్రమంలో సర్కార్ భూములు అన్నీ కబ్జా జరిగినట్లుగా చెబుతూ అప్పట్లో అంటే టీడీపీ ఏలుబడిలో వైసీపీ బీజేపీ సహా వామపక్షాలు ఆందోళనలు పెద్ద ఎత్తున చేశాయి.

దాని పర్యవసానంగా నాటి టీడీపీ ప్రభుత్వం సిట్ ని ఏర్పాటు చేసింది. ఆ నివేదిక ఏమైందో తెలియదు కానీ వైసీపీ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చాకా మరో సిట్ ని వేసింది. మరి ఈ సిట్ నివేదిక కూడా ఏమైందో ఎవరికీ తెలియడంలేదు. ఇపుడు చూస్తే కేవలం ప్రభుత్వ భూములే కాదు, ప్రైవేట్ భూములు, దేవదాయ శాఖకు చెందిన భూములు, వివిధ ప్రభుత్వ శాఖలు ఉంచుకున్న మిగులు భూములు అన్నీ కూడా కబ్జాల పరం అయ్యాయి. ఇక సామాన్యులకు మూడా భూముల విషయంలో రక్షణ లేకుండా పోయింది అని అంటున్నారు.

ఇంకో వైపు స్వాతంత్ర సమరయోధులకు ఉదారంగా ప్రభుత్వాలు ఇచ్చిన భూములు దేశం కోసం త్యాగాలు చేసి ప్రాణాలు పోగొట్టుకున్న సైనిక కుటుంబాలకు ఇచ్చిన భూములు కూడా హాం ఫట్ అయ్యాయని అంటున్నారు. వీటి మీద తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని సీబీఐ విచారణ లేదా సిట్తింగ్ జడ్జి తో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసారు. అది కూడా వైఎస్సార్ సీఎం గా ఉండగా అంటే 2004 నుంచి ఇప్పటిదాకా గడచిన రెండు దశాబ్దాల కాలంలో ఉత్తరాంధ్రా భూములు ఎన్ని వందల వేల ఎకరాలు కబ్జాలకు గురి అయ్యాయన్న గుట్టుని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

ఆయన కోరిన విషయం పక్కన పెడితే తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా భూ కబ్జాలలో అందరి హస్తం ఉంది అని అంటున్నారు. వారూ వీరూ తేడా లేకుండా అందిన కాడికి అందుకున్న వారే ఘనాపాఠీలుగా ఉన్నారు. మరి ఈ విషయంలో సీబీఐ విచారణ లేదా మరోటి అయినా వేయిస్తే తప్ప వాస్తవాలు బయటపడవు అన్నది మేధావుల మాటగా కూడా ఉంది. కానీ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని సీబీఐ విచారణ జరిపించాలి అని అంటున్నారు. సోము వీర్రాజు కూడా చిత్తశుద్ధి ఉంటే ఒక లేఖ ప్రభుత్వానికి రాసి ఊరుకోకుండా కేంద్రంలో ఉన్నది తమ సర్కారే కాబట్టి  తామే సీబీఐ విచారణ జరిపిస్తే గడచిన రెండు మూడు దశాబ్దాలుగా ఉత్తరాంధ్రాలో జరిగిన భూ కబ్జా బాగోతాలు అన్నీ బయటకు వస్తాయని అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News