హోదా కోసం పోరాటం వృథా అంటున్న వీర్రాజు

Update: 2017-01-28 08:13 GMT
ముక్కు సూటిగా మాట్లాడ‌టానికి పెట్టింది పేర‌యిన బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మ‌రోమారు అఏద రీతిలో రియాక్ట‌య్యారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ విశాఖ‌లోని ఆర్కే బీచ్‌ లో కొవ్వొత్తుల ప్ర‌ద‌ర్శ‌న‌ - ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ అరెస్టు - హోదా క‌ల్పించాల్సిందేనంటూ జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ అల్టిమేటం జారీ చేసిన నేప‌థ్యంలో వీర్రాజు మీడియాతో మాట్లాడారు. ఎన్ని పోరాటాలు చేసినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదని స్ప‌ష్టం చేశారు. వాస్త‌వ ప‌రిస్థితులు అర్థం చేసుకోలేని వారు, ఉద్దేశ‌పూర్వ‌క రాజ‌కీయాలు చేసే వారు మాత్ర‌మే ఈ విధంగా రోడ్డెక్కుతున్నార‌ని వీర్రాజు వ్యాఖ్యానించారు.

ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ప్రత్యేక హోదా కావాలని తొలుత బీజేపీ మాత్రమే కోరిందని వీర్రాజు గుర్తు చేశారు. ఆనాడు క‌లిసి రాని పార్టీలు ఇప్పుడు రోడ్డెక్క‌డం త‌మ ప్ర‌చారం కోస‌మేన‌ని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు వస్తాయన్న ప్రచారం చేస్తున్నారని ఇది నిజ‌మైన‌ది కాద‌ని వీర్రాజు అన్నారు. హోదా సంజీవని కాదని తెలిపారు. గ‌తంలో రూపొందించిన నిబంధ‌న‌లు, ఏపీకి ప్రత్యేక హోదా కేటాయించేందుకు త‌గిన అర్హ‌త‌లు లేక‌పోవడంతోనే కేంద్ర వెన‌క్కు త‌గ్గింద‌ని అన్నారు. అదే స‌మ‌యంలో స్పెష‌ల్ స్టేట‌స్ వచ్చే అవకాశం లేకపోవడంతో రాష్ట్రాన్ని ఆదుకునే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించిందని వీర్రాజు చెప్పారు. ఈ ప్యాకేజీ ద్వారా హోదాతో స‌మానంగా ఏపీని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు.  తమిళనాడులో జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకొని ప్రత్యేక హోదా కోసం పోరాడటం సరికాదని వీర్రాజు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News