త్వ‌ర‌లో ఏపీలో ఎవ‌రూ ఊహించ‌ని సీన్లు: సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

Update: 2022-08-22 07:35 GMT
బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో సినిమా సీన్ల‌ను మించిన సీన్లు చోటు చేసుకున్నాయ‌ని హాట్ కామెంట్స్ చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఏపీలో ప‌రిణామాలు మార‌బోతున్నాయ‌న్నారు. ఏపీ విష‌యంలో బీజేపీ అధిష్టానం అత్యంత‌ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతోంద‌ని వ్యాఖ్యానించారు. బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణ‌యాల‌తో అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోవ‌డం ఖాయ‌మ‌న్నారు. ఈ రాజ‌కీయ ప‌రిణామాలు ఎలా జ‌రిగియోన‌నే విష‌యం కూడా ఎవ‌రికీ అర్థం కాద‌న్నారు.

ఏపీలో వైఎస్సార్సీపీని గ‌ద్దె దించేది బీజేపీయేన‌ని సోము వీర్రాజు తెలిపారు. ఎవ‌రికీ భ‌య‌ప‌డ‌ని జ‌గ‌న్ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి మాత్రం భ‌య‌ప‌డ‌తార‌ని బాంబు పేల్చారు. అంత‌ర్వేదిలో ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ర‌థం ద‌గ్ధ‌మైతే బీజేపీ ఒత్తిడితోనే రాష్ట్ర ప్ర‌భుత్వం దిగివ‌చ్చింద‌న్నారు. వైఎస్సార్సీపీని వ‌ణికించిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయేన‌ని వెల్ల‌డించారు. ఏపీలో విగ్ర‌హాల‌ను, ర‌థాల‌ను ధ్వంసం చేస్తే బీజేపీయే పోరాటం చేసింద‌ని తెలిపారు. రామ తీర్థం నుంచి కపిల తీర్థం వరకు తాము యాత్ర చేస్తామంటేనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం వెన‌క్కి త‌గ్గింద‌ని సోము వీర్రాజు గుర్తు చేశారు.

త్వ‌ర‌లో బీజేపీ ఆధ్వ‌ర్యంలో రాయ‌ల‌సీమ యాత్ర‌ కూడా చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామని సోము వీర్రాజు తెలిపారు. నిర్వాసితులు పోల‌వ‌రంలో కాద‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా నిర్వాసితులు ఉన్నారని చెప్పారు.

ఏపీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తుంది ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ మాత్రమేనని సోము వీర్రాజు తెలిపారు. ఈ విష‌యంలో దమ్ముంటే చర్చకు రావాలని జ‌గ‌న్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. పేదలకు ఉచిత బియ్యం ఇవ్వకుండా సీఎం జగన్ ఆపేశారని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. బీజేపీ రంగంలోకి దిగగానే రెండో కోటా ఇచ్చారని మండిప‌డ్డారు.

కాగా సోము వీర్రాజు తాజా వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్ల‌లో చ‌ర్చ జ‌రుగుతోంది. తెలంగాణ‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ కావ‌డం.. ఏపీలోనూ సినిమా సీన్ల‌ను మించిన సీన్లు జ‌రుగుతాయ‌ని సోము వీర్రాజు హింట్ ఇవ్వ‌డం అనేక అనుమానాల‌కు తావిస్తోందంటున్నారు.

బీజేపీ-జ‌న‌సేన కూట‌మి త‌ర‌ఫున ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను ప్ర‌క‌టిస్తారేమోన‌ని చర్చ సాగుతోంది. లేదా ప్ర‌ముఖ సినీ న‌టుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవిని బీజేపీలోకి ఆహ్వానిస్తారా అనే దానిపై నెటిజ‌న్ల‌లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. అదేవిధంగా అవినీతిని ఏమాత్రం స‌హించేది లేదంటూ ఆగ‌స్టు 15న ఢిల్లీలోని ఎర్రకోట ప్ర‌సంగంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెప్పిన నేప‌థ్యంలో ఏపీ సీఎం జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేసి మ‌ళ్లీ జైలుకు పంపుతార‌ని ఇలా నెటిజ‌న్ల‌లో ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
Tags:    

Similar News