పెట్రో వాతలపై మోడీకి సోనియమ్మ రాసిన లేఖలో ఏముంది?

Update: 2021-02-22 04:54 GMT
గతంలో లీటరుకు రూపాయి పెట్రోల్.. డీజిల్ ధరలు పెరిగితే.. యావత్ దేశం ఆగమాగమైపోయేది. అలాంటిది ఇప్పుడు రూపాయి కాదు కదా.. లీటరుకు పది రూపాయిలు చొప్పున పెరిగినా చాలామంది పట్టించుకోని పరిస్థితి. ఎందుకిలా? అంటే.. పెరిగే పెట్రోల్.. డీజిల్ ధరలతో సైన్యానికి అదనపు నిధులు సమకూరుస్తారని కొందరు.. ఆయుధాల్ని కొనుగోలు చేస్తున్నారని మరికొందరు చేసే అతి వాదనల్ని నమ్మేసి.. నిజమేనని అనుకునే పరిస్థితి. ఒకవేళ.. అదే నిజమైతే.. ఆ విషయాన్ని అధికారికంగా మోడీ సర్కారు ప్రకటన చేస్తే సరిపోతుంది కదా?

లీటరు పెట్రోల్ ధర వంద రూపాయిలకు దగ్గరకు వచ్చేసిన వేళ.. దేశ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో రోజుకు  లీటరు పెట్రోల్ ధర పెరిగితే.. ఐదు నుంచి పది పైసలు పెరగటమే గొప్ప అన్నట్లు ఉండేది. అంతలోనే తగ్గేది కూడా. కానీ.. ఇటీవల కాలంలో అదే పనిగా పెరగటం.. అది కూడా ముప్ఫై.. నలభై పైసలకు తగ్గకుండా పెరగుతున్న తీరు పలువురికి ఆందోళనకు గురి చేస్తోంది. ఇంతకాలం పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంత పెరిగినా పట్టించుకోనట్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ.. తాజాగా ప్రధాని మోడీకి ఒక లేఖ రాశారు. పెట్రోల్.. డీజిల్ ధరల పెంపుపై ఆమె ఆందోళన వ్యక్తంచేవారు.

మితిమీరిన ఎక్సైజ్ డ్యూటీని విధించటంలో ప్రభుత్వం అమితోత్సాహాన్ని ప్రదర్శిస్తోందన్నారు. పెట్రోల్.. డీజిల్ ధరలు పెరగటం కారణంగా పేద.. మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఏకరువు పెట్టారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా.. పెట్రోల్.. డీజిల్ ధరలు నిరంతరం పెరగటాన్ని ఆమె తప్పు పట్టారు. కరోనా కారణంగా దిగజారిన ఆర్థిక వ్యవస్థతో ఒకవైపు ఉద్యోగాలు తగ్గిపోతున్నాయని.. కుటుంబ ఆదాయాలు.. వేతనాలు తగ్గుతుండటంతో మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఇలాంటివేళ.. భారీ పన్ను వడ్డింపుతో సగటుజీవి నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. సోనియమ్మ రాసే ఇలాంటి లేఖలు మోడీ సర్కారు మూడ్ ను మారుస్తాయంటారా?
Tags:    

Similar News