రాహుల్ కోసం సోనియా బాట‌లు

Update: 2021-10-04 06:30 GMT
అఖిల భార‌త కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షుడి రాహుల్ గాంధీకి తిరుగు లేకుండా ఉండేందుకు ఆయ‌న త‌ల్లి పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు చేస్తున్నారా? రాహుల్ నాయ‌క‌త్వాన్ని విమ‌ర్శించే సీనియ‌ర్ నాయ‌కుల‌కు నెమ్మ‌దిగా ప‌క్క‌న‌పెడుతూ.. తోడుగా నిలిచే యువ నేత‌ల‌ను ఆమె ద‌గ్గ‌ర‌కి తీస్తున్నారా? భ‌విష్య‌త్‌లో రాహుల్‌కు సొంత పార్టీ నుంచి ఎలాంటి ఇబ్బందులు తలెత్త‌కుండా ఉండేందుకు అవ‌స‌ర‌మైన మార్పులు చేస్తున్నారా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో జ‌రుగుతున్న ప‌రిణామాలు అందుకు నిద‌ర్శ‌న‌మ‌ని రాజ‌కీయ నిపుణులు భావిస్తున్నారు. ఏడాది క్రితం నుంచే అసంతృప్త సీనియ‌ర్ నేత‌ల‌కు సోనియా ప్రాధాన్య‌త ఇవ్వ‌డం త‌గ్గించింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కాంగ్రెస్‌లో 70 మందికిపైగా సీనియ‌ర్ నేత‌ల‌ను  ప‌క్క‌కుపెట్టి రాహుల్‌కు విధేయులుగా ఉన్న వాళ్ల‌ను తెర‌పైకి తీసుకు రావ‌డం సోనియా న‌డుం బిగించార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ఏడాది క్రిత‌మే ఆమె ఈ కార్య‌చ‌ర‌ణ మొద‌లెట్టిన‌ట్లు స‌మాచారం. ముఖ్యంగా గ‌తేడాది ఆగ‌స్టులో పార్టీలోని 23 మంది సీనియ‌ర్ నేత‌లు క‌లిసి కాంగ్రెస్‌లో అంత‌ర్గ‌త ప్ర‌జాస్వామ్యాన్ని పున‌రుద్ధ‌రించాల‌ని నెహ్రూ కుటుంబం పార్టీలో అంత‌ర్భాగంగా ఉండాలే త‌ప్ప అన్నీ తామై వ్య‌వ‌హ‌రించ‌కూడ‌ద‌ని సోనియాకు లేఖ రాశారు. అస‌మ్మ‌తి నేత‌లు ఇలా లేఖ రాయ‌డాన్ని త‌న నాయ‌క‌త్వానికి స‌వాలుగా తీసుక‌న్న సోనియా..  అప్ప‌టి నుంచే ఈ 23 మంది సీనియ‌ర్ నేత‌ల బృందాన్ని విభ‌జించి పాలించు అనే వ్యూహంతో చెక్ పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకున్నార‌ని స‌మాచారం.

వివిధ అంశాల‌పై పార్టీ ఏర్పాటు చేసిన కీల‌క క‌మిటీల్లో ఈ అస‌మ్మ‌తి నేత‌ల బృందంలోని కొంత‌మందికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్ట‌డం ద్వారా వాళ్ల‌ను త‌న‌వైపుగా తిప్పుకున్న సోనియా.. మ‌రికొంద‌రు సీనియ‌ర్ల‌ను ప‌ద‌వుల నుంచి త‌ప్పించారు. వారి స్థానంలో రాహుల్ విధేయుల‌ను నియ‌మించ‌సాగారు. దీంతో ఈ ఏడాది ఆగ‌స్టు క‌ల్లా రాహుల్ విధేయుల‌తో నిండిపోయిన కాంగ్రెస్ అనుబంధ సంస్థ‌లు ఆయ‌న్ని తిరిగి పార్టీ అధ్య‌క్షుడిగా నియ‌మించాల‌ని ఏక‌గ్రీవ తీర్మానాలు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్టులో కాంగ్రెస్ అధ్య‌క్షురాలిగా రెండేళ్లు పూర్తి చేసుకున్న సోనియా.. ఈ ఏడాది చివ‌రిక‌ల్లా ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. రాహుల్‌కు ఆ బాధ్య‌త‌ను తిరిగి అప్ప‌గించేలోపే రాహుల్‌ను వ్య‌తిరేకించే నాయ‌కుల్లో కొంద‌రిని త‌న‌వైపు తిప్పుకున్నారు. మ‌రికొంద‌రు సీనియ‌ర్ల ప‌ట్ల క‌ఠిన వైఖ‌రి అవ‌లంబిస్తున్నారు.

పంజాబ్‌లో వ‌చ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని తెలిసినా అమ‌రీంద‌ర్‌ను ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని సోనియా ఆదేశించారు. ఆ స్థానంలో రాహుల్‌కు మ‌ద్ద‌తుగా నిలిచే చ‌రణ్‌జీత్ సింగ్‌ను నియ‌మించారు. ఇక రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి అశోక్ గెహ్లోత్ ఛ‌త్తీస్‌గ‌ఢ్ ముఖ్య‌మంత్రి భూపేశ్ బాఘెల్ మీదా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌నే సంకేతాలు పంపారు. నిజానికి అమ‌రీంద‌ర్ అశోక్ భూపేశ్ సోనియాకు విధేయులే కానీ రాహుల్ గాంధీకి ఇష్టులైన న‌వ్‌జ్యోత్ స‌చిన్ పైల‌ట్ సింగ్‌దేవ్‌ల‌ను వాళ్లు ఎద‌గ‌కుండా అణ‌గ‌దొక్కుతున్నార‌నేది అధిష్ఠానానికి ఆగ్ర‌హం తెప్పించింద‌ని తెలుస్తోంది. మ‌రోవైపు పార్టీలోకి ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ను చేర్చుకునే అంశంపై సీనియ‌ర్లు వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ రాహుల్ గాంధీకి మేలు జ‌రుగుతుంద‌నే ఉద్దేశంతో పీకేకు సోనియా అండ‌గా నిలుస్తున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాహుల్ కోసం సోనియా చేస్తున్న ఈ ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు స‌ఫ‌లం అవుతాయో చూడాలి.
Tags:    

Similar News