జ‌గ‌న్‌.. బాబు తీర్మానం.. లేచి నిల‌బ‌డిన సోనియా!

Update: 2018-03-17 03:42 GMT
మాట ఇవ్వ‌టం.. దాని మీద నిల‌బ‌డ‌కుండా ఉండటం ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు మామూలే. తాజాగా అలాంటి ప‌నే చేసిన ఆయ‌న‌.. మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కారు. ఏపీకి ప్ర‌త్యేక హోదాతో పాటు.. విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో మోడీ స‌ర్కారు చేస్తున్న మోసంపై ఎలుగెత్తిన ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టింది.

దీనికి తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన ఏపీ సీఎం చంద్ర‌బాబు శుక్ర‌వారం ఉద‌యానికి ప్లేట్ మార్చేశారు. జ‌గ‌న్ పార్టీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌టం కాదు.. తామే స్వ‌యంగా అవిశ్వాస తీర్మానాన్ని పెడ‌తామ‌ని చెబుతూ.. ఎన్డీయే నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు. ఉన్న‌ట్లుండి మాట మార్చేస్తే బాగోదు కాబ‌ట్టి.. ఎప్ప‌టి మాదిరే జ‌గ‌న్ పార్టీపై ఒక బండ వేసి.. త‌న దారిన తాను పోయారు. త‌ద్వారా త‌న‌కు మాట మీద నిల‌బ‌డే గుణం లేద‌న్న విష‌యాన్ని మ‌రోసారి స్ప‌ష్టం చేశార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు  ప్ర‌వేశ పెట్టిన అవిశ్వాస తీర్మానాలు జాతీయ రాజ‌కీయాల్లో క‌ల‌క‌లాన్ని రేపింది. వైఎస్సార్ కాంగ్రెస్‌.. టీడీపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని లోక్ స‌భ‌లో చ‌దివి వినిపించారు స్పీక‌ర్‌. కేంద్ర మంత్రి మండ‌లిపై త‌మ‌కు విశ్వాసం లేద‌ని నోటీసులు అందాయ‌ని.. ఆ విష‌యం స‌భ‌కు తెలియ‌జేయ‌డం త‌మ బాధ్య‌త‌గా సుమిత్ర వెల్ల‌డించారు. స‌భ ఆర్డ‌ర్ గా ఉండే.. వారి స్థానాల్లో నిల‌బ‌డ్డ ఎంపీల‌ను లెక్కిస్తామ‌ని ప్ర‌క‌టించారు. స్పీక‌ర్ నోటి నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చినంత‌నే కాంగ్రెస్ తో స‌హా ప‌లు రాజ‌కీయ ప‌క్షాలు అవిశ్వాసానికి మ‌ద్ద‌తుగా చేతులు ఎత్తారు.

ఇక‌.. యూపీఏ ఛైర్ ప‌ర్స‌న్ సోనియాగాంధీ అయితే లేచి నిల‌బ‌డ్డారు. అవిశ్వాసానికి అనుకూలంగా వంద‌కు పైగా నేత‌లు మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం స్ప‌ష్టంగా క‌నిపించింది.అంటే.. నిబంధ‌న‌ల ప్ర‌కారం అవిశ్వాసానాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని స‌భ‌లో చ‌ర్చించాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో స్పీక‌ర్ అలెర్ట్ అయిన‌ట్లుగా క‌నిపించింది. ఇదే స‌మ‌యంలో వేర్వేరు కార‌ణాల‌పై టీఆర్ ఎస్‌..  అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు వెల్ ద‌గ్గ‌ర నిల‌బ‌డి ఆందోళ‌న చేస్తున్నారు. స‌భ ఆర్డ‌ర్ లోకి వ‌స్తే నిర్వ‌హిస్తాన‌ని చెప్పిన స్పీక‌ర్.. నిమిషాల వ్య‌వ‌ధిలో స‌భ‌ను సోమ‌వారానికి వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించి వెళ్లిపోయారు.

టీఆర్ ఎస్‌.. అన్నాడీఎంకే స‌భ్యుల పేరుతో స‌భ‌ను వాయిదా వేయ‌టం స‌రికాదంటూ నేత‌లు చెబుతున్నా.. స్పీక‌ర్ మాత్రం ఆ విష‌యాల్ని ప‌ట్టించుకోకుండా స‌భ‌ను వాయిదా వేసేయ‌టంపై ప‌లు రాజ‌కీయ ప‌క్ష నేత‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. స్పీక‌ర్ వాయిదా వేసిన నేప‌థ్యంలో అవిశ్వాసానికి సంబంధించి టీడీపీ మ‌రోసారి నోటీసులు ఇచ్చింది. దీని ప్ర‌కారం సోమ‌వారం స‌భ‌లో ఈ అంశం చ‌ర్చ‌కు రావాల్సి ఉంది.
Tags:    

Similar News