సోనియా స‌భ...వేదిక‌పై వారంద‌రికీ చోటు

Update: 2018-11-23 16:19 GMT
తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన అనంత‌రం వ‌స్తున్న ముంద‌స్తు ఎన్నిక‌ల‌ను అన్ని పార్టీలు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అధికారం కోసం శ్ర‌మిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారానికి వస్తున్న యూపీఏ చైర్‌ పర్సన్‌ సోనియాగాంధీ - కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పర్యటనను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మేడ్చల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణ బాధ్యతలను పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డికి అప్పగించారు. సాయంత్రం 4 గంటలకు బేగంపేట విమానాశ్రయం చేరుకోనున్న సోనియా - రాహుల్‌ లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి కుంతియా - ఇతర నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో జరుగుతున్న ప్రచార సరళిపై సమీక్షించారు. ఈ సంద‌ర్భంగానే - స‌భ‌ను బ‌ల ప్ర‌ద‌ర్శ‌న వేదిక‌గా తీసుకుంది.

 ఏఐసీసీ అధ్యక్ష హోదాలో ఉన్న రాహుల్‌తో కలిసి సోనియా తొలిసారి బహిరంగ సభలో పాల్గొంటున్నందున భారీస్థాయిలో ఏర్పాట్లు చేయాలని పీసీసీ నిర్ణయించింది. బేగంపేట విమానాశ్రయంలో సోనియా - రాహుల్‌ కు స్వాగతం పలికేందుకు మహాకూటమి భాగస్వామ్య పక్షాలను కూడా ఆహ్వానించారు. అనంత‌రం మేడ్చల్‌ బహిరంగ సభలో తెలంగాణలో కాంగ్రెస్‌తో పాటు మహాకూటమి తరఫున పోటీ చేస్తున్న 119 మంది అభ్యర్థులను వేదికపై కూర్చోబెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఈ సభలో మహాకూటమి నుంచి ఎన్నికల బరిలో దిగుతున్న 119 నియోజకవర్గాల అభ్యర్థులను వేదికపైన కూర్చోబెట్టి వారందరిని సోనియా - రాహుల్‌ కు పరిచయం చేయించాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇందుకోసం 119 అభ్యర్థుల పేర్లను ఢిల్లీలోని నేషనల్‌ సెక్యూరిటీ గార్డు (ఎన్ ఎస్‌ జీ)కి పంపించగా వారు ఓకే చెప్పారు. అక్కడి నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే ఈ సమాచారాన్ని అభ్యర్థులందరికీ చేరవేశారు. 119 నియోజకవర్గాల అభ్యర్థులను సోనియా - రాహుల్‌ గాంధీ పాల్గొంటున్న వేదికపై కూర్చోబెట్టడం ద్వారా ఆయా నియోజకవర్గాల్లో త్వరలో జరిగే ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని దక్కించుకోవాలన్న యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది. ఒకేసారి 150 మంది ప్రతినిధులు సభావేదికపై కూర్చోబెడుతున్నందున వేదికను కూడా విశాలంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

సోనియా శుక్రవారం సాయంత్రం బేగంపేట విమానాశ్రయం నుంచి 5.30 గంటలకు రోడ్డు మార్గంలో మేడ్చల్‌ సభా ప్రాంగణానికి బయలుదేరి - ఆరు గంటలకు చేరుకుంటారు. రాత్రి 7.30 వరకూ సభలో పాల్గొంటారు. అనంతరం ఎనిమిది గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి వెళ్తారు.
Tags:    

Similar News