కంగారు పుట్టిస్తున్న సోనియ‌మ్మ అనారోగ్యం

Update: 2017-10-28 04:26 GMT
అత్యంత కీల‌క స్థానాల్లో ఉన్న వారి ఆరోగ్య స‌మ‌స్య‌లు హ‌డ‌లెత్తిస్తుంటాయి. ప్ర‌ముఖుల ఆరోగ్యాల‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ ఉంటుంది. దేశానికి ప్ర‌తిప‌క్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చీఫ్ సోనియాగాంధీ మ‌రోసారి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. ఇటీవ‌ల ఆమె త‌ర‌చూ అస్వ‌స్థ‌త‌కు గురి అవుతున్నారు. ఆ మ‌ధ్య‌న యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం సంద‌ర్భంగా కాశీకి వెళ్లిన ఆమె రోడ్ షో చేస్తూ.. ఉన్న‌ట్లుండి తీవ్ర అనారోగ్యానికి గురి కావ‌టం.. ఆమెను హుటాహుటిన సైనిక హెలికాఫ్ట‌ర్ లో ఢిల్లీకి త‌ర‌లించ‌ట‌మే కాదు.. సైనిక హెడ్ క్వార్ట‌ర్ లో ప్ర‌త్యేక చికిత్సకు యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేయ‌టం తెలిసిందే.

ఆ సంద‌ర్భంలో ఆమె కోలుకోవ‌టానికి నెల‌లు ప‌ట్టింద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దు. నిజానికి అంత‌కు ముందు నుంచే సోనియ‌మ్మ ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేద‌ని.. ఏదో బండిని లాగిస్తున్నార‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. 71 ఏళ్ల సోనియాగాంధీ తీవ్ర అరోగ్య స‌మ‌స్య‌ల్ని ఎదుర్కొంటున్నార‌ని.. ఈ కార‌ణంతోనే త‌ర‌చూ ఆసుప‌త్రిలో చేరాల్సి వ‌స్తోంద‌న్న మాట వినిపిస్తోంది.

ఆరోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగానే విదేశాల‌కు వెళ్లి మ‌రీ చికిత్స చేయించుకున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. సోనియ‌మ్మ ఎదుర్కొంటున్న ఆరోగ్య స‌మ‌స్య‌ల ఏమిట‌న్న విష‌యం మీద స్ప‌ష్ట‌త రావ‌టం లేదు. ఇదిలా ఉంటే శుక్ర‌వారం మ‌రోసారి ఆమె అనారోగ్యానికి గుర‌య్యారు.

ఈసారి ఉద‌ర సంబంధ‌మైన స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్న సోనియ‌మ్మ‌ను ఢిల్లీలోని గంగారామ్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. సోనియ‌మ్మ ఆరోగ్య ప‌రిస్థితిని అక్క‌డి వైద్య బృందం ప్ర‌త్యేకంగా ప‌ర్య‌వేక్షిస్తోంద‌ని ఆసుప‌త్రి ఛైర్మ‌న్ డీఎస్ రానా వెల్ల‌డించారు. సోనియ‌మ్మ అనారోగ్య కారణంగానే కాంగ్రెస్ పార్టీ ప‌గ్గాల్ని ఆమె కుమారుడు రాహుల్ గాంధీకి ఇచ్చే దిశ‌గా ముమ్మ‌రంగా ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు చెబుతారు. ఏమైనా.. సోనియ‌మ్మ అనారోగ్యం కాంగ్రెస్ నేత‌లు.. కార్య‌క‌ర్త‌ల‌కు కంగారు పుట్టిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News