ఆ టెర్ర‌రిస్టులు ముందు జిల్లా ఎస్పీని క‌లిశారు

Update: 2016-01-05 07:55 GMT
పంజాబ్‌ లోని ప‌ఠాన్‌ కోట్‌ లో జ‌రిగిన పాకిస్తాన్ టెర్ర‌రిస్టుల దాడి వెన‌క ఘ‌ట‌న‌లు ఒక్కొక్క‌టిగా వెలుగుచూస్తున్నాయి. ఈ ముష్క‌రులు ప‌ఠాన్‌ కోట్‌ కు వెళ్లేందుకు భార‌త‌దేశానికి చెందిన ఎస్పీని వాడుకున్నార‌ట‌. అయితే ఆయ‌న ఎస్పీ అని స‌ద‌రు ముష్కరుల‌కు తెలియ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ప‌ఠాన్‌ కోట్ ఉగ్ర‌దాడికి ముందు ఆ ఉగ్ర‌వాదుల‌ను చూసిన ఏకైక వ్య‌క్తి కూడా ఈ ఎస్పీయే కావ‌డం ఆస‌క్తిక‌రం. పంజాబ్‌లోని గురుదాస్‌ పూర్ జిల్లా ఎస్పీ స‌ల్వీంద‌ర్ సింగ్ త‌న వ‌ల్ల ఆ ప‌ని ఏ విధంగా జ‌రిగిందో తాజాగా మీడియాకు వివ‌రించాడు.
 
దాడి జ‌ర‌గ‌డానికి ముందురోజు స‌ల్వీంద‌ర్ త‌న వాహ‌నంలో ప్ర‌యాణం చేస్తుండ‌గా మిల‌టరీ జాకెట్ వేసుకున్న ఐదుగురు వ్య‌క్తులు వ‌చ్చి కారు ఆపాలంటూ ఒక్క‌సారిగా అడ్డువ‌చ్చారు. కారు ఆపడంతో ముందు సీటులోకి ఎక్కిన ఆ ముష్క‌రులు సింగ్‌ ను వెన‌క్కి తోసేశారు. దీంతో వారు ఉగ్ర‌వాదులు అని సింగ్‌కు అర్థ‌మైంది. ఎందుకు కారును అడ్డగించార‌ని ప్ర‌శ్నించ‌గా త‌ల‌లు కిందికి వంచి పెడుతూ...పైకి చూసినా, ఏమైనా మాట్లాడిన కాల్చేస్తామ‌ని హెచ్చ‌రించారు. సింగ్ మొబైల్ ఫోన్ లాక్కొని క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టేశారు.ఈ క్ర‌మంలో వాళ్లు ఉర్దూ - హింది - పంజాబీ భాష‌ల్లో మాట్లాడింది సింగ్‌ కు లీల‌గా వినిపించింద‌ట.

స‌లాం - ఆలేకుం స‌లాం అంటూ వారు మాట్లాడార‌ని సింగ్ గుర్తుచేసుకున్నాడు. వాళ్ల చేతుల్లో ఏకే 47 తుపాకులు ఉన్నాయ‌ని సింగ్ తెలిపారు. త‌న వాహ‌నాన్ని ఆపిన‌పుడు దొంగ‌లుగా భావించాన‌ని అయితే వారి ఎక్కిన త‌ర్వాత తీవ్ర‌వాదులుగా అర్థం అయింద‌ని చెప్పారు. వాహ‌నం కోసం త‌మ‌ను ఆపిన ఉగ్ర‌వాదులు ప‌ఠాన్‌ కోట్‌ కు ఎలా వెళ్లాలో త‌న‌ను దారి అడ‌గ‌లేద‌ని వారివ‌ద్ద జీపీఎస్ ప‌రికరాలు ఉండ‌టం ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పారు.
Tags:    

Similar News