టెన్ష‌న్ : హోదా తెచ్చిన టెన్షన్ ?

Update: 2022-02-17 10:30 GMT
ఇవాళ ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాల చీఫ్ సెక్ర‌ట‌రీల మీటింగ్ కు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కాల్ ఫ‌ర్ చేసింది.ఆ మేర‌కు కాన్ఫ‌రెన్స్ కు త్రి మెన్ క‌మిటీ నేతృత్వం వ‌హించ‌నుంది.ఈ భేటీ లో ఐదంటే ఐదు కీల‌క అంశాలు ప్ర‌స్తావ‌న‌కు రానున్నాయి అని తేలింది.మొద‌ట ప్ర‌త్యేక హోదా అంశాన్ని చ‌ర్చ‌ల అజెండాలో చేర్చి త‌రువాత ఉమ్మ‌డి భావ సారూప్య‌త లేని కార‌ణంగా ఆ మాట‌ను ఆ వాద‌న‌ను ఆ ప్ర‌తిపాద‌న‌ను తొల‌గించామ‌ని బీజేపీ అంటోంది.ఇందుకు జీవీఎల్ అనే రాజ్య‌స‌భ్యుడే సాక్షి.క‌నుక చ‌ర్చ‌లు ఎలా ఉండ‌నున్నాయి అన్న‌ది ఇప్పుడిక క్లియ‌ర్.

ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ ను విభ‌జించాల‌ని ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు క‌నుక మ‌న అప్పులు మ‌రియు ఆస్తుల విలువ తేలిపోనుంది.ఇందుకు సంబంధించి ప్ర‌తిపాద‌న‌లు కూడా కొన్నింటిని ఇప్ప‌టికే సిద్ధం చేసింది కేంద్రం. చ‌ర్చ‌ల సంద‌ర్భంగా ఇరు రాష్ట్రాలూ కూడా ఆర్థిక సంబంధ విష‌యాల్లో లెక్క‌లు తేల్చుకునేందుకు కూడా త‌మ‌వైన గణాంకాల‌ను సిద్ధం చేసుకున్నాయి. అవే ఇవాళ హ‌స్తిన‌పురి కేంద్రంగా చ‌ర్చ‌కు రానున్నాయి.చ‌ర్చ‌ల్లో ప్ర‌ధాన ప్ర‌స్తావ‌న‌కు నోచుకోనున్నాయి. స్ప‌ష్ట‌త దిశ‌గా ఇరు రాష్ట్ర ప్ర‌భుత్వాలూ ప్ర‌య‌త్నించ‌నున్నాయి.వాస్త‌వానికి ఉమ్మ‌డి  ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయి ఏడేళ్లు అయిపోయినా ఇప్ప‌టికీ చాలావిష‌యాల్లో స్ప‌ష్ట‌త లేదు.ఆస్తుల విభ‌జ‌న‌పై అస్స‌లు నాయ‌కులకు శ్ర‌ద్ధే లేదు అన్న విమ‌ర్శకు ఎన్నో ప‌రిణామాలు తార్కాణంగా నిలిచాయి.

ఈ విష‌యంలో టీడీపీ కానీ వైసీపీ కానీ రెండూ రెండే! ఇందులో ఎవ్వ‌రికీ మిన‌హాయింపు లేదు. ముఖ్యంగా ఉమ్మ‌డి రాజ‌ధాని హైద్రాబాద్ అన్న విష‌యం 2024 వ‌రకూ మ‌నుగ‌డ‌లోనే ఉండ‌నుంది. అంటే అప్ప‌టిదాకా ఆంధ్రా ఆస్తుల లెక్క తేల‌కుండా ఉండిపోనుందా అన్న వాద‌న కూడా వ‌చ్చింది. ఓటుకు నోటు కేసు దృష్ట్యా ఆ రోజు భాగ్య‌న‌గ‌రి స‌చివాల‌యం నుంచి ప‌రుగులు తీసి ,ఇక్క‌డికి వ‌చ్చార‌ని,అంతేకాని విజ‌య‌వాడ‌పై ప్రేమతో కాద‌ని అప్ప‌ట్లో వైసీపీ విమ‌ర్శాస్త్రాలు సంధించేది.అటుపై అమ‌రావ‌తి అనే ఓ క్యాపిట‌ల్ వెంచ‌ర్ కు ప్ర‌భుత్వ త‌ర‌ఫున ప్ర‌య‌త్నాలు జ‌రిగినా అవేవీ ఇప్ప‌టికీ ఓ కొలిక్కి రాలేదు.

కానీ చంద్ర‌బాబు హ‌యాంలో అసెంబ్లీ,స‌చివాల‌యం, సీఎం క్యాంప్ ఆఫీస్ తో స‌హా కొన్ని నిర్మాణాలు (అతి ముఖ్యం అనుకునే కార్యాల‌యాలు)శ‌ర‌వేగంతో పూర్త‌య్యాయి.ఆ విధంగా అ అంటే అమ‌రావ‌తి, ఆ అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ (అవ‌శేషాంధ్ర‌)కు మ‌ణిహారం అయ్యేందుకు ఉన్న అవ‌కాశాలు కొన్నింటిని ఏరి కోరి తెచ్చారు బాబు. అటుపై స‌ర్కారు మారిపోవ‌డం చంద్ర‌బాబు మాదిరిగానే ఆ రోజు హైద్రాబాద్లో ఆస్తుల‌ను ఏ విధంగా వ‌దిలేశారో అదే రీతిన  ఆంధ్రాకు సంబంధించి ఉన్న ఖాళీ కార్యాల‌య భ‌వంతుల‌కు హ‌క్కుల‌న్నీ  తెలంగాణ‌కు ఇచ్చి వ‌చ్చారు జ‌గ‌న్.ఇందుకు ఒప్పందం ఏమీ జ‌ర‌గ‌క‌పోయినా కూడా ఆ రోజు కేసీఆర్ తో ఉన్న ప్రేమ కార‌ణంగానే ఆయ‌న ఆ విధంగా చేసి ఉంటార‌ని ఏపీ స‌చివాల‌య ఉద్యోగ సంఘాల నాయ‌కులు అంటుంటారు.

ఇదే  స‌మ‌యంలో ఉమ్మ‌డి రాజ‌ధాని కొన‌సాగింపున‌కు అవ‌కాశాలు ఉన్నా వ‌దిలేసి వ‌చ్చిన చంద్ర‌బాబు కానీ ఆస్తుల పై ప‌ట్టు పెంచుకోకుండా వ‌దిలేసి వ‌చ్చి జ‌గ‌న్ కానీ ఇద్ద‌రూ కూడా చాలా పెద్ద త‌ప్పిదాలే చేశార‌ని రాష్ట్ర హ‌క్కుల‌ను పూర్తిగా గాలికి వ‌దిలేశార‌ని ఆరోప‌ణ‌లు ఇప్ప‌టికీ వివిధ ఉద్యోగ సంఘాల నుంచి స‌మైక్యాంధ్ర ఉద్యమ కార్యాచ‌ర‌ణ‌కు పూనుకున్న ఉద్య‌మ సంస్థ‌ల నుంచి ఉన్నాయి. కానీ ఇవేవీ ప‌ట్టించుకునే స్థితిలో ఆ రోజు టీడీపీ లేదు ఇవాళ వైసీపీ లేదు అన్న‌ది సుస్ప‌ష్టం.

*ఇక తెలంగాణ ప్ర‌భుత్వం ఆంధ్రాకు చెల్లించాల్సిన బ‌కాయిలు గురించి మాట్లాడుకుందాం

* విద్యుత్ బ‌కాయిలు 6284 కోట్ల రూపాయ‌లు చెల్లించాల్సి ఉంది

*ధాన్యం సేక‌ర‌ణ నిమిత్తం ఏపీ నుంచి తీసుకున్న మొత్తం నాలుగు వంద‌ల కోట్లు

*ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌ధానిగా ఉన్న హైద్రాబాద్ లో ఏపీకి చెందిన కొన్ని కంపెనీలు

రిజిస్ట్రేష‌న్ రూపేణ ప‌న్నులు చెల్లించాయి.ఆ మొత్తం విలువ 3,800కోట్ల రూపాయ‌లు

ఈ మొత్తాన్నీ తిరిగి ఏపీకి తెలంగాణ చెల్లించాలి..అని ప్ర‌ధాన మీడియా  చెబుతోంది.

ఇక ఐదు అంశాలు ప్ర‌స్తావ‌న‌లోకి రానున్నాయి ఇవాళ అవేంటో చూద్దాం..

- ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ విభ‌జ‌న

- ఏపీ జెన్ కో కు తెలంగాణ డిస్క‌మ్ లు చెల్లించాల్సిన బ‌కాయిలు

- ప‌న్ను అంశాల‌పై త‌లెత్తిన లోపాల ప‌రిష్కారం

- బ్యాంకులోని న‌గ‌దు,డిపాజిట్ల పంపిణీ

- ఆంధ్ర‌ప్ర‌దేశ్ పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ (A P State Civil Supplies Corporation Limited) కు,తెలంగాణ పౌర స‌ర‌ఫ‌రాల కార్పొరేష‌న్ లిమిటెడ్ (The Telangana State Civil Supplies Corporation Limited (TSCSCL))కు సంబంధించి ఉన్న న‌గ‌దు అంశం.

- విభ‌జ‌న స‌మ‌యంలో ఇరు తెలుగు రాష్ట్రాల‌కూ ఒకే పౌర‌స‌ర‌ఫ‌రాల అధికారి ప‌నిచేశారు అని,ఆ రోజు తెలంగాణ‌లో ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌లు వెచ్చించార‌ని ఇందుకు త‌మ రాష్ట్ర నిధులు ఖ‌ర్చుచేశార‌ని, వాటిని వెన‌క్కు ఇప్పించాల‌ని కోరుతున్నారు ఆంధ్ర ప్ర‌దేశ్ కు చెందిన అధికారులు.

- వీటితో పాటు ఇరు రాష్ట్రాల‌కు చెందిన ఇంకొన్ని విష‌యాలు చ‌ర్చ‌కు రానున్నాయి.ముఖ్యంగా ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ విభ‌జ‌న అంశంపై ఏ నిర్ణ‌యం వెలువ‌డ‌నుందో అన్న ఆస‌క్తి ఒక‌టి ఇరు వ‌ర్గాల్లోనూ నెల‌కొని ఉంది.వీటితో పాటు హైద్రాబాద్ లో ఉన్న ఏపీ ఆస్తుల‌పై ఆర్థిక లెక్కలు,హ‌క్కులు, ఇంకా ఉమ్మ‌డి ఆస్తుల్లో వాటాలు అన్నీ తేలాల్సి ఉన్నాయి.
Tags:    

Similar News