ప్రత్యేక హోదా జగన్ చేతిలోనే ఉంది...?

Update: 2022-02-13 08:48 GMT
అదేంటి ప్రత్యేక హోదా కేంద్రం ఇవ్వాలి కదా ఎవరికైనా డౌట్లు రావచ్చు. కేంద్రంలో ఎంతటి బలమైన ప్రభుత్వం ఉన్నా రాష్ట్రాలు తాము అనుకున్నది పోరాడో, బతిమాలో,వ్యూహాత్మకంగానో సాధించిన సందర్భాలు ఈ దేశాన  చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఏపీ పరిస్థితి ఎలా తయారైంది అంటే కేంద్రాన్ని గట్టిగా ఎవరూ నిలదీయలేని రాజకీయం ఇక్కడ సాగుతోంది. ఇదిలా ఉంటే ప్రత్యేక హోదా ముగిసిన అంశమని కేంద్రం అంటోంది. కానీ అది రాజకీయ హామీ.

రాజకీయాల్లో ఇలాంటి హామీలు ఎక్కడా ముగిసిపోవు. అయితే గియితే కోల్డ్ స్టోరేజ్ లో కొన్నాళ్ళు అలా  పడి ఉంటాయి. వాటిని తీసే పరిస్థితులు కల్పిస్తే అవి అలా నడచుకుంటూ చకచకా కావాల్సిన చోటుకు  వస్తాయి. ఇపుడు ఇన్ని కబుర్లు చెబుతున్నా బీజేపీ పెద్దలు నిజానికి రాజకీయ అవసరాలు ఉంటే ఏపీకీ పక్కాగా  హోదా ఇస్తారు. ఏపీకి భారీ ఎత్తున కన్నం పడిన రెవిన్యూ లోటు కూడా తీర్చేస్తారు. కానీ ఆ రాజకీయ అనివార్యత క్రియేట్ చేయాల్సింది మాత్రం ఏపీ రాజకీయాలే.

అలా చెప్పుకుంటే జగన్ దే ఈ విషయంలో ఎక్కువ బాధ్యత ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. కేంద్రం మెడలు వంచి హోదాను తీసుకువస్తామని జగన్ చెప్పుకున్నారు. పాదయాత్ర  సందర్భంగా ఆయన ప్రసంగాలలో హోదా అంశం కచ్చితంగా ఉండేది. మరి జగన్ తొందరలో మూడేళ్ల పాలన పూర్తి చేసుకోబోతున్నారు. అయినా ఆయన హోదా విషయంలో జనాలు ఆశిస్తున్నంతగా పోరాడడం లేదు అన్న చర్చ అయితే ఉంది.

జగన్ లాంటి బలమైన నాయకుడు కేంద్రం కోర్టులో బంతి వేసి కూర్చునే సీన్ అయితే కాదని కామన్ మ్యాన్ కూడా భావిస్తాడు. మరి మోడీ విషయానికి వస్తే  ఒకసారి తాను ఏదైనా  అనుకుంటే అలాగే చేస్తారు. ముందుకు వెళ్తారు. ఆయన వెనక్కి తగ్గడం అంటూ జరిగింది ఒకే ఒక్క విషయంలో. అదే వ్యవసాయ చట్టాల విషయంలో. అది కూడా అంత తేలిగ్గా ఆయన తగ్గలేదు. ఏడాది పాటు దాని మీద‌ ఉద్యమాలు జరిగాయి. దానితో పాటు ఆ వ్యతిరేకత పడి బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో చేదు ఫలితాలు మూటకట్టుకుంది.

ఇక ఇపుడు ఉత్తరాది ఎన్నికలు  ఉన్నాయి. అందుకే మోడీ తెలివిగా ఒక అడుగు వెనక్కి వేశారు. అంటే ఇక్కడ అర్ధమవుతోంది ఏంటి అంటే మోడీ లాంటి వారు కూడా వెనక్కి తగ్గడానికి రాజకీయ పరిణామాలూ, పోరాటాలు దోహదం చేస్తాయని. ఇది నంబర్ గేమ్. ఎవరైనా రాజు కావాలీ అంటే ఎంపీల సంఖ్యా బలం మీదనే ఆధారపడాలి.

ఆ విధంగా వైసీపీ ఎంపీల మద్దతు బీజేపీకి రాజ్యసభలో ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ అవసరం పడవచ్చు. అయిదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల మీద బీజేపీకి పెద్దగా హోప్స్ లేవని అంటున్నారు. దాంతో పెద్దల సభలో బీజేపీకి మద్దతు దారుణంగా తగ్గిపోతుంది. అంతే కాదు ఈ ఏడాది జూన్ లో జరగనున్న రాష్ట్రపతి, ఆగస్టులో జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ తన మనుషులను గెలిపించుకోవాలి.

అది చాలా అవసరం. 2024లో బీజేపీకి కచ్చితంగా పూర్తి మెజారిటీ రాదు, అపుడు తాము ఎంచుకున్న రాష్ట్రపతి కనుక ఉంటే బీజేపీకి సీట్లు తగ్గినా అధికారం దక్కడానికి వీలు అవుతుంది. ఇక 2024 ఎన్నికల్లో బీజేపీ మద్దతు కోసం అర్రులు చాస్తోంది. దాన్ని కూడా జాగ్రత్తగా గ్రహించి ఏపీలోని వైసీపీ పరిస్థితులను, పరిణామాలను అనుకూలంగా మార్చుకోవాలి.

కేంద్రానికి మన అవసరం ఉంటే కచ్చితంగా హోదా ఇస్తుంది అని వైసీపీ నేతలు గతంలో పలు మార్లు చెబుతూ వచ్చారు. ఇపుడు అలాంటి అవసరం అయితే కేంద్రానికి రాబోతోంది. మరి జగన్ జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఏపీకి హోదా రావడం తధ్యం. మోడీ, అమిత్ షాల బలం కంటే బలహీనతలు  మార్చి ఎన్నికల ఫలితాల తరువాత కచ్చితంగా కనిపిస్తాయని అంతా అంటున్నారు. ఒక విషయం మాత్రం స్పష్టం. బీజేపీ ఎంత బలహీనపడినా కూడా ఏపీలో వైసీపీ గట్టిగా నిలదీయకపోతే మాత్రం హోదా అన్నది రాదు. సో జగన్ చేతిలోనే హోదా అంశం. ఉంది. రానున్న రెండు మూడు నెలలూ ఏపీకి చాలా కీలకం అని కూడా చెప్పాలి.
Tags:    

Similar News