'చై..నా..' విడాకులు తీసేసుకున్నారు!

Update: 2018-05-05 06:44 GMT
మీ ఇంట్లో ఇంట‌ర్ చ‌దువుతున్న వాళ్లు లేరా?  అయితే.. మీకిప్పుడు చెప్పే విష‌యం మీకు ఆశ్చ‌ర్యమ‌నిపించ‌క మాన‌దు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్ చద‌వాలంటే ఉన్న ఆప్ష‌న్ల‌లో నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్యతో పాటు.. ఫిడ్జి.. భాష్యం.. శ్రీ‌గాయ‌త్రి లాంటి మ‌రికొన్ని ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి.

పోటాపోటీగా ఉండే శ్రీ‌చైత‌న్య‌.. నారాయ‌ణ విద్యాసంస్థ‌ల్లో ఇంట‌ర్ సీటు కోసం వెళ్లిన వారికి.. సూప‌ర్ మార్కెట్లో మాదిరి చాలానే ప్రొడ‌క్ట్ లు క‌నిపిస్తాయి. అందులో ఒక‌టి చైనా కోర్సు. ఇంట‌ర్లో చైనా కోర్సు ఏమిటి?  అంటే.. చైనాలో చ‌దువు చెప్పిస్తారా?  లేక‌.. చైనా ఫ్యాకల్టీతో పాఠాలు చెబుతారా?  లాంటి సందేహాలు రావొచ్చు. అలాంటి ఆలోచ‌న‌లు ఉంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. చైనా.. అంటే చైత‌న్య‌.. నారాయ‌ణ సంస్థ‌ల ఉమ్మ‌డి కోర్సు అన్న మాట‌.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్ విద్య‌కు సంబంధించి తిరుగులేని అధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించే ఈ రెండు ప్రైవేటు విద్యాసంస్థ‌లు త‌మ పోటీ సంస్థ‌ల‌కు చుక్క‌లు చూపించేందుకు.. మ‌రింత ఎక్కువ‌మంది విద్యార్థుల్ని ఆక‌ర్షించేందుకు వీలుగా కొన్ని సంవ‌త్స‌రాల కింద‌ట క‌లిసిపోయాయి. రెండు సంస్థ‌ల‌కు చెందిన ముఖ్య‌మైన ఫ్యాక‌ల్టీతో చైనా పేరుతో ఇంట‌ర్ కోర్సును షురూ చేశారు. ఇది..మిగిలిన ఇంట‌ర్ కోర్సుల కంటే ఖ‌రీదైన వ్య‌వ‌హారంగా చెబుతారు.

దాదాపు ఆరేళ్ల కింద‌ట మొద‌లైన ఈ ఉమ్మ‌డి కోర్సుతో రెండు పెద్ద సంస్థ‌లు ఒక‌టైన ప‌రిస్థితి. పైకి పోటీ ఉన్నా.. నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య‌లు రెండు క‌లిసి కూడా కోర్సుల్ని అందిస్తాయ‌న్న మాట‌. ఏదైనా కంపెనీ త‌న ఉత్పుతుల్లో ఎలా అయితే ప్రీమియం.. పాపుల‌ర్ పేరుతో వేర్వేరు బ్రాండ్ల‌ను క్రియేట్ చేసి మ‌రింత మార్కెట్‌ ను చేజిక్కించుకుంటారో ఇంచుమించే అదే వ్యూహంగా చైనా ఇంట‌ర్ బ్యాచ్ ను చెప్పాలి.

అయితే.. ఈ రెండు విద్యా సంస్థ‌ల మ‌ధ్య ఇటీవ‌ల చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో లెక్క‌లు తేడా వ‌చ్చేశాయి. జేజేఈ రిజ‌ల్ట్ విష‌యంలో త‌మ విద్యార్థిని నారాయ‌ణ క్లైయిం చేసుకుంద‌ని శ్రీ‌చైత‌న్య‌.. కాదు.. కాదు.. మా విద్యార్థినే శ్రీ‌చైత‌న్య క్లైయిం చేసుకుంద‌ని నారాయ‌ణ సంస్థ‌లు పోటాపోటీగా ఆరోప‌ణ‌లు చేసుకుంటున్న ప‌రిస్థితి.

ఈ వాదులాట ఇలా సాగుతూనే.. పేప‌ర్ల‌లో పెద్ద ఎత్తున ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చుకున్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డా లేని విధంగా టాప్ ఫైవ్ ర్యాంకుల్లో కొన్ని ర్యాంకులు ఒకే విద్యార్థిని నారాయ‌ణ‌.. శ్రీ‌చైత‌న్య‌లు త‌మ విద్యార్థిగా క్లైయిం చేసుకోవ‌టంపై సోష‌ల్ మీడియాలో జోకుల మీద జోకులు పేలాయి. ఈ వ్య‌వ‌హారం రెండు విద్యాసంస్థ‌ల మ‌ధ్య వివాదాన్ని మ‌రింత పెంచ‌ట‌మే కాదు.. తామిద్ద‌రం క‌లిసి ఉమ్మ‌డిగా అందించే చైనా బ్యాచ్ ను ఇక‌పై కొన‌సాగించే అవ‌కాశం లేద‌ని.. ర‌ద్దు చేస్తున్న‌ట్లు రెండు సంస్థ‌లు ప్రెస్ నోట్ రిలీజ్ చేసి మ‌రీ తేల్చేశాయి.

ఈ సంద‌ర్భంగా ఒక‌రి మీద ఒక‌రు ఆరోప‌ణ‌లు.. విమ‌ర్శ‌లు చేసుకున్నాయి. ఇవ‌న్నీ రెండు రాజ‌కీయ పార్టీల నేత‌లు ఏ రీతిలో అయితే పోటాపోటీగా తిట్టేసుకుంటాయో.. దాదాపు అదే రీతిలో ఉండ‌టం గ‌మ‌నార్హం. ఒక‌రి మీద ఒక‌రు ఆరోప‌ణ‌లు చేసుకోవ‌టం.. వాటిని ఇరువురు త‌మ‌దైన వాద‌న‌లు వినిపిస్తూ ఖండించుకోవ‌టం జ‌రిగింది. అంతేకాదు.. లీగ‌ల్ ఫైట్‌కి సైతం సిద్ధ‌మ‌ని చెప్ప‌టం చూసిన‌ప్పుడు ఈ రెండు విద్యాసంస్థ‌ల లొల్లి ఎక్క‌డి వ‌ర‌కూ వెళుతుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదంతా చెప్పిన త‌ర్వాత మ‌రో విష‌యం చెప్ప‌క‌పోతే అస్స‌లు బాగోదు.

శ్రీ‌చైత‌న్య‌.. నారాయ‌ణ రెండు విద్యాసంస్థ‌లు పోటాపోటీగా ఉన్న‌ప్పుడు మీడియా సంస్థ‌ల‌కు పోటీలు ప‌డి మ‌రీ యాడ్స్ ఇచ్చేవారు. దీంతో.. వారికి భారీగానే ఆదాయం వ‌చ్చేది. ఎప్పుడైతే రెండు సంస్థ‌లు క‌లిసి ఉమ్మ‌డిగా కోర్సు కూడా న‌డిపిన నేప‌థ్యంలో అన‌వ‌స‌రంగా యాడ్స్ మీద ఖ‌ర్చు ఎందుకంటూ కంట్రోల్ గా ఉన్నాయి. దీంతో.. మీడియా సంస్థ‌ల‌కు భారీగానే యాడ్ రెవెన్యూ లాస్ అయిన‌ట్లు చెబుతారు. తాజాగా వీరిద్ద‌రి మ‌ధ్య నెల‌కొన్న వివాదం నేప‌థ్యంలో మీడియా సంస్థ‌ల‌కు యాడ్ రెవెన్యూ పెర‌గ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ కొంద‌రికి ఆదాయం తెచ్చి పెడుతుందంటే ఇదేనేమో!


Tags:    

Similar News