సచివాలయ సిబ్బందికి షాకింగ్ న్యూస్

Update: 2020-11-23 17:35 GMT
ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ ప్రవేశపెట్టిన గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురిసిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి నేపథ్యంలో సచివాలయ ఉద్యోగులు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ పనితీరుపై పొగడ్తల జల్లు కురిసింది. విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా రోగులు, కాంటాక్టులను గుర్తించడంలో వలంటీర్లు చేసిన సర్వే ఎంతగానో ఉపయోగపడింది. ఇక, సచివాలయ సిబ్బందిలో మెజారిటీ ఉద్యోగులకు నెలకు రూ.15వేలు జీతమే అయినా....ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారని పలువురు కితాబిచ్చారు. దీంతోపాటు, కరోనాకు ముందు తర్వాత కూడా సచివాలయ సిబ్బంది, ఉద్యోగుల పనితీరుపై ఎక్కడా ఫిర్యాదులు వచ్చిన దాఖలాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా సచివాలయ సిబ్బందికి సంబంధించి ఉన్నతాధికారులు తీసుకున్న ఓ నిర్ణయం చర్చనీయాంశమైంది. ఇకపై గ్రామ సచివాలయాల్లో పనిచేసే సిబ్బంది అదే గ్రామంలో నివాసం ఉండాలని, వార్డు సచివాలయాల్లోని సిబ్బంది అదే మున్సిపాలిటీ పరిధిలో ఉండాలని ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, అధికారులు ఈ నిర్ణయం ప్రభుత్వానికి చెప్పి తీసుకున్నారా...లేక సొంతగా తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. వాస్తవానికి, చాలామంది సచివాలయ సిబ్బంది తమ స్వగ్రామాలు, సొంత ఊళ్ల నుంచి వచ్చి విధులు నిర్వర్తించి వెళుతుంటారు. రూ.15 వేల జీతంతో కొత్త ఊరిలో ఫ్యామిలీ పెట్టి మెయింటెన్ చేయడం కష్టం కాబట్టి వారు ఇలా చేస్తుంటారు. వారు ఇలా చేయడం వల్ల విధులు సరిగా నిర్వర్తించడం లేదన్న ఫిర్యాదులు అందిన దాఖలాలు కూడా లేవు. ఆఫీసువేళలు ముగిసిన తర్వాత కూడా ఫోన్ లో సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. తరచుగా సచివాలయాలను ఉన్నతాధికారులు తనిఖీ చేస్తుండటంతో సిబ్బంది అలసత్వం ప్రదర్శించడం లేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగం చేసే చోటే నివాసం అన్న నిబంధన ఎంతవరకు సమంజసమన్న చర్చ సిబ్బందిలో జరుగుతోంది. తక్కువ జీతాలతో ఉద్యోగం చేసే చోటే నివాసం ఉండలేమని సచివాలయ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. అయితే, సంక్షేమ పథకాల ఫలాలు పూర్తి స్థాయిలో ప్రజలకు చేరవేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఉన్నతాధికారులు అంటున్నారు. మరి, ఈ వ్యవహారంపై సీఎం జగన్ స్పందన ఎలా ఉంటుదన్నది ఆసక్తికరంగా మారింది.
Tags:    

Similar News