12 గంటల పని మీద వెనక్కి తగ్గిన స్టాలిన్.. డ్యామేజ్ కంట్రోల్ మొదలు

Update: 2023-05-02 08:52 GMT
తన నిర్ణయాలతో దేశ ప్రజలందరిలోనూ ఆసక్తికర చర్చకు కారణమవుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్.. ఇటీవల ఆయన ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం షాకింగ్ గా మారింది. తమిళనాడు శాసనసభలో ఇటీవల ఆమోదం పొందిన ఒక బిల్లు పెను దుమారానికి కారణమైంది. వివిధ సంస్థల్లో, పరిశ్రమల్లో ఉద్యోగుల పని వేళల్ని పన్నెండు గంటలకు పెంచటంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.

సొంత పార్టీకి చెందిన నేతలు సైతం ఈ నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. అయినప్పటికీ వాటిని పట్టించుకోని స్టాలిన్ ప్రభుత్వం..అసెంబ్లీలో బిల్లును ప్రవేశ పెట్టటమే కాదు.. ఆమోద ముద్ర వేసిన విషయం తెలిసిందే.

తాజాగా దీనితో జరిగే నష్టాల్ని గుర్తించిన ఆయన.. బిల్లు విషయంలో వెనక్కి తగ్గారు. కార్మికుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకొని ఈ బిల్లును తమకు తామే ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. కార్మిక దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి.. బిల్లు ఉపసంహరణపై కీలక ప్రకటన చేశారు. వెనక్కి తగ్గటాన్ని తాను ఎప్పుడూ అవమానకరంగా భావించనని చెప్పటం ద్వారా.. పోయిన పరువును కాస్తంత నిలబెట్టుకున్నట్లైంది.

ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. "ఒక సమస్యపై భిన్నాభిప్రాయాల్ని అంగీకరించటానికి ధైర్యం అవసరం. వివిధ కార్మిక సంఘాల నుంచి ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ఈ బిల్లును వెనక్కి తీసుకుంటున్నాం. దీనిపై త్వరలోనే ఎమ్మెల్యేలకు సమాచారం అందిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కార్మికుల సంక్షేమంతో రాజీ పడం. పరిశ్రమలు ఎదగటంతో పాటు కార్మికులు కూడా డెవలప్ కావాలి" అంటూ వ్యాఖ్యానించారు.

పరిశ్రమల్లోని కార్మికులు.. ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు వారంలోని పని వేళల్లో మార్పు లేకుండా రోజుకు 12 గంటలు పని చేసేలా ఒక బిల్లు తీసుకురావటం.. వారంలో నాలుగురోజులుపని చేసి మిగిలిన మూడు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చని పేర్కొన్నారు.

ఈ బిల్లుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బిల్లుతో కార్మికుల శ్రమ దోపిడీకి గురి కావటం ఖాయమని విపక్షాలే కాదు.. డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్ సైతం తప్పు పట్టింది. ఈ నేపథ్యంలో ఈ బిల్లును తాత్కాలికంగా వెనక్కి తీసుకొని నిలిపివేస్తున్నట్లుగా ప్రకటించారు.

తప్పు చేసినప్పటికీ టైమ్లీగా సరిదిద్దుకునే విషయంలో స్టాలిన్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. అంతేకానీ.. తిరుగులేని అధికారం చేతిలో ఉన్న వేళలో.. తన నిర్ణయాన్ని సమర్థించుకోవటం కన్నా.. వ్యతిరేకతల్ని పరిగణలోకి తీసుకొని వెనక్కి తగ్గటం కీలక పరిణామంగా చెప్పక తప్పదు.

Similar News