స్టార్ పొడ్యూసర్ సురేష్ బాబుకు జగన్ ఓకేనా...టీడీపీ గగ్గోలు దేనికి...?

Update: 2023-04-15 12:26 GMT
విశాఖ సాగర తీరం అందమైనది, ప్రకృతి రమణీయతను కలిగి ఉన్నది. ఇక్కడ దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ఒక స్టూడియోను దివంగత టాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు కట్టారు. అప్పట్లో విశాఖకు సినీ పరిశ్రమ విశాఖలో కూడా విస్తరిస్తుందని ఆశపడ్డారు. కానీ అలా ఏమీ జరగలేదు విభజన తరువాత కూడా ఏపీకి సినీ పరిశ్రమ ఏమీ తరలిరాలేదు. మొత్తానికి చూస్తే విశాఖ బీచ్ రోడ్డులో కట్టిన డాక్టర్ డి రామనాయుడు స్టూడియో అలాగే ఉంది.

దాని నిర్వహణ వ్యయం కూడా రావడం లేదని అంటారు. ఈ నేపధ్యంలో గతంలో ఒక వార్త వినిపించింది. ఈ స్టూడియోను విక్రయిస్తున్నారని, అయితే అది నిజం కాదు సగం మాత్రమే నిజం అని ఇన్నాళ్ళకి తెలుగుదేశం వారి పుణ్యమాని ఒక వార్త బయటకు వచ్చింది. లేటెస్ట్ గా విశాఖకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబుకు చెందిన భూమిలో నిబంధలనకు విరుద్ధంగా లే అవుట్లకు వైసీపీ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, గుట్టు చప్పుడు కాకుండా ఆ పని చేసి పెట్టిన జీవీఎంసీ కమిషనర్ రాజబాబుకు ప్రభుత్వం కలెక్టర్ పదవిని బహుమతిగా ఇచ్చిందని ఆరోపించారు.

ఇందులో ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందని అలాగే అధికారులు కూడా రూల్స్ ని పక్కన పెట్టారని ఆయన విమర్శించారు. పవర్ ఆఫ్ అటర్నీని ని జీవీఎంసీ కమిషనర్ రాజబాబుకు ఇవ్వడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. అసలు రాజబాబుకు ఆ స్టూడియో భూమిలో పదిహేడు ఎకరాలు మార్ట్ గేజ్ కింద ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ఇక మధురవాడ సబ్ రిజిష్టార్ ని నిర్మాత సురేష్ బాబు లే అవుట్ కి సంబంధించిన పత్రాలను ఇచ్చారని ఇలా ఎలా చేస్తారని బండారు ప్రశ్నించారు.

విశాఖలో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉండగా ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబు 54 ఎకరాలను రామానాయుడుకు ఇచ్చారని, అందులో స్టూడియో కట్టి సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాలని ఉందని అన్నారు. ఎకరం పాతిక లక్షల వంతున నాటి టీడీపీ ప్రభుత్వం ఇస్తే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కూడా దీన్ని అడ్డుకోవడానికి చూసారని గుర్తు చేశారు.

ఇక జగన్ సీఎం అయ్యాక విశాఖ భూముల మీద కన్ను వేశారని, అధికారాన్ని అడ్డు పెట్టుకుని భూములు తీసుకునే పనిని వైసీపీ నేతలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు సురేష్ బాబుకు చెందిన రామానాయుడు స్టూడియోలో చాలా భాగాన్ని లే అవుట్ వేయాలనుకోవడం పట్ల న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఒక ఉద్దేశ్యం కోసం స్థలాన్ని ప్రభుత్వం నుంచి తీసుకుని వేరే విధంగా కమర్షియల్ అవసరాల కోసం మార్చుకోవచ్చా అంటే లేదనే అంటారు.

కానీ ప్రభుత్వ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం పలుకుబడితో చాలా మంది అలాగే చేస్తున్నారు. ఇక హైదరాబాద్ లో అప్పట్లో పద్మాలయా స్టూడియో నిర్మాణానికి ప్రభుత్వం భూములు ఇచ్చింది ఆ తరువాత దాన్ని లే అవుట్లుగా వేసుకుంటామంటే నాటి వైఎస్సార్ ప్రభుత్వం స్పెషల్ పర్మిషన్ ఇచ్చిందని అంటున్నారు. ఇపుడు జగన్ సర్కార్ సైతం ఆ విధంగా వెసులుబాటు కల్పించి ఉండొచ్చని అంటున్నారు.

విశాఖలో సినీ పరిశ్రమ రాలేదు, రెండున్నర దశాబ్దాలుగా ఆ భూమిలో స్టూడియో కట్టి అక్కడ ఉన్న సినీ ఎక్విప్మెంట్ కూడా పూర్తిగా వేస్ట్ అవుతున్న వేళ మొత్తం స్టూడియో కాకుండా కొంత భాగాన్ని లే అవుట్ వేసుకోవడానికి సురేష్ బాబు అభ్యర్ధన మేరకు ప్రభుత్వం ఓకే చెప్పి ఉండొచ్చు అంటున్నారు.

మరి ఇందులో న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ అంటోంది. అంతే కాదు సురేష్ బాబు కానీ నాటి కమిషనర్ రాజబాబు కానీ తప్పు ఎవరు చేసినా అరెస్ట్ చేయాలని బండారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలకు ఉన్న ప్రత్యేక అధికారాలను ఎవరూ కాదనలేరు అని అంటున్నారు. అయితే సినీ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సహా అంతా టీడీపీకే ఒకనాడు మద్దతుగా ఉండేవారు. ఇపుడు కూడా వారు టీడీపీకి దూరం కాలేదు. ప్రభుత్వం వైసీపీది ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం తో మాట్లాడుకునే లే అవుట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

మరి జగన్ అంటే మండిపడే టీడీపీ ఇపుడు ఆయన మీద విమర్శలు చేస్తూ మధ్యలో సురేష్ బాబుని కూడా ఇరికించేస్తోంది. ఆయన్ని అరెస్ట్ చేయాలని అంటోంది. మరి ఈ వ్యవహారం ఎంత వరకూ వెళ్తుందో చూడాలి. ఇక మరోటి చెప్పాలీ అంటే చంద్రబాబు సీఎం గా ఉన్నా ఈ స్పెషల్ పర్మిషన్ ఇచ్చి ఉండేవారు కదా అని అంటున్నారు. ఏది ఏమైనా విశాఖ అంటే రామానాయుడు స్టూడియో అన్నది చాలా కాలంగా వినిపిస్తోంది. ఇపుడు లే అవుట్ దాకా కధ వచ్చింది. ఇందులో వైసీపీ పెద్దల ఇంటరెస్ట్ ఏమి ఉంది అన్నది తొందరలోనే విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు.

Similar News