అప్పు కోసం మళ్లీ తిప్పలు మొదలు.. ఈసారి టార్గెట్ ఎంతంటే?

Update: 2022-02-12 04:37 GMT
విభజనతో మొదలైన అప్పుల వేట అంతకంతకూ పెరుగుతుందే కానీ తగ్గని పరిస్థితి. పరిమితులు ఎన్ని పెడుతున్నా.. కొత్త అప్పు కోసం ఆరాటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇప్పటికే అందినకాడికి అప్పులు చేసిన ఏపీ సర్కారు.. తాజాగా మరింత అప్పు కోసం ప్రయత్నిస్తోంది. అప్పుల కోసం కేంద్రంలోని పెద్దలతో అదే పనిగా మంతనాలు జరుపుతున్నారు. జనవరిలో చేసిన అప్పులు ఇప్పటికే పప్పు బెల్లాల మాదిరి పంచేసిన వేళ.. తాజా అవసరాల్ని తీర్చుకోవటం కోసం కొత్త అప్పుల్ని చేయటం మినహా మరింకేమీ చేయలేని పరిస్థితి.

జనవరిలో రూ.5వేల కోట్లకు పైగా బహిరంగ మార్కెట్ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రూ.2500 కోట్లు మాత్రమే రాష్ట్రం సమీకరించగలిగింది. ఫిబ్రవరి 8న తీసుకున్న రూ2వేల కోట్ల మొత్తం ఇప్పటికే ఖర్చు అయిపోవటం.. రానున్న మంగళవారానికి మరో రూ.2వేల కోట్ల కోసం సెక్యురిటీలను వేలం వేయటానికి సిద్ధమైంది. ప్రభుత్వం ఇప్పటివరకు బహిరంగ మార్కెట్ లో రూ.40,500 కోట్ల రుణాల్ని తీసుకుంది.  తాజాగా రాష్ట్రం అడుగుతున్న అప్పు భారీగానే ఉంది.   

బహిరంగ మార్కెట్ రుణం కింద జీఎస్ డీపీలో 4 శాతాన్ని కోత లేకుండా ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. ఇందులో చివరి త్రైమాసికంలో రావాల్సిన రూ.6900 కోట్లు.. మూలధన అనుసంధాన నిధులు రూ.2655 కోట్లతో పాటు గతంలో కోత పెట్టిన రూ.17వేల కోట్లకుపైనే కలిపి మొత్తం రూ.27,325 కోట్ల రుణ అనుమతికి డిసెంబరులోనే కేంద్రాన్ని రాష్ట్ర సర్కారు అడిగింది.

అయితే.. ఆ స్థాయిలో రుణాలకు కేంద్రం సానుకూలంగా స్పందించలేదని చెబుతారు. వేలాది కోట్లు అప్పులుగా తీసుకుంటున్నప్పటికి చేసిన పనులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా సొంత పన్నులతో వచ్చే ఆదాయం.. కేంద్రం ఇచ్చే నిధులతో పాటు మరో రూ.5వేల కోట్లకు పైనే అప్పులు తీసుకుంటున్నా.. అవసరాలు తీరని పరిస్థితి.   ఆ మాటకు వస్తే ఉద్యోగులకు నెల వారీగా ఇవ్వాల్సిన వాటినే ఇవ్వలేని పరిస్థితి. ఏ నెలకు ఆ నెల జీతాలు.. పెన్షన్లను సకాలంలో ఇవ్వలేని పరిస్థితి.

నిధుల చెల్లింపు లేక ఇప్పటికే అనేకచోట్ల పనులు ఆగిపోయాయి. రాష్ట్రానికి అవసరమైన నిధులను తీసుకురావటం కోసం వివిధ కార్పొరేషన్ల ద్వారా అదనపు రుణాల్ని పొందేందుకు ప్రభుత్వం గ్యారెంటీల పరిమితిని రెట్టింపు చేసింది.  అయితే.. ఈ తరహా రుణాలకు రిజర్వు బ్యాంకు నో చెబుతున్నట్లుగా సమాచారం. దీనికి కారణం.. ఏడాది రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 90 శాతానికి మించకుండా మొత్తం కార్పొరేషన్ల గ్యారంటీలు ఉండాలన్న నిబంధనను రెట్టింపు చేస్తూ చట్ట సవరణ చేయటమే. కొన్ని కార్పొరేషన్లకు అదనపు గ్యారంటీలను ఇవ్వటంతో కార్పొరేషన్ల రుణ వ్యవహారంపై కేంద్ర ఆర్థిక శాఖ.. రిజర్వు బ్యాంకు.. కాగ్ లకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయి.

నిబంధనలకు విరుద్దంగా ఏపీఎస్ డీసీ అప్పులు తీసుకుంటోందన్న ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లుగా కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం ఇప్పటికే తేల్చిన నేపథ్యంలో.. కార్పొరేషన్లకు రుణాలు కోరినా రిజర్వు బ్యాంకు ప్రతినిధులు సహకరించటం లేదని రాష్ట్ర ప్రభుత్వ అంతర్గత చర్చల్లో అధికారులు చెబుతున్నారు. ఇదంతా చూస్తుంటే.. ఏపీ అప్పుల దాహం ఎంతకూ తీరనిదిగా మారిందని చెప్పాలి. మరి.. తాజాగా అడుగుతున్న అప్పునకు కేంద్రం ఓకే చెబుతుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News