పోలీసుల‌పై రాళ్లు విసిరిన ఆ అమ్మాయి ఇప్పుడు..

Update: 2017-12-06 07:36 GMT
కొన్ని నెల‌ల కింద జాతీయ‌.. అంత‌ర్జాతీయ మీడియాల‌లోనే కాదు.. రాష్ట్ర స్థాయి మీడియాల‌లోనూ ఒక అమ్మాయి ఫోటోను ప్ర‌ముఖంగా వేశారు. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి న‌లుగుతున్న క‌శ్మీర్ ఆందోళ‌న‌లో కొత్త ట్రెండ్ అన్న‌ట్లుగా ఆ ఫోటో ఉంది. ఇప్ప‌టివ‌ర‌కూ కశ్మీర్ లోయ‌లో పోలీసుల మీద రాళ్లు విసిరే వారికి తోడుగా కశ్మీరీ అమ్మాయిలు కూడా తోడ‌య్యారా? అన్న సందేహం క‌లిగేలా ఆవేశంతో ఒక అమ్మాయి రాయి విసిరే ఫోటోను ప్ర‌చురించారు.

క్ష‌ణాల్లో ఆ ఫోటో వైర‌ల్ గా మార‌ట‌మే కాదు.. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. నీలం రంగు చుడిదార్ తో ముఖానికి ముసుగు వేసుకున్న ఆ క‌శ్మీరీ అమ్మాయి పోలీసుల‌పైకి ఎందుకు రాళ్లు విసిరింది? అన్న‌ది పెద్ద చ‌ర్చ‌గా మారింది. క‌శ్మీర్ లోయ‌లో ఇలా రాళ్లు ఎగుర‌వేయ‌టం మామూలే అయినా.. ఒక అమ్మాయి అంత‌టి నిర్ణ‌యాన్ని ఎందుకు తీసుకుంద‌న్న ప్ర‌శ్న‌తో పాటు.. అస‌లు ఆ అమ్మాయి ఎవ‌ర‌న్న‌ది ఆరాగా మారింది.

చివ‌ర‌కు రాళ్లు విసిరిన అమ్మాయి అఫ్షాన్‌ ఆషిఖ్ గా గుర్తించారు.  అయితే.. ఆ అమ్మాయి అంత ఆవేశంగా రాళ్లు విస‌ర‌టానికి కార‌ణం.. త‌న స్నేహితురాళ్ల‌తో  క‌లిసి వెళ్లేట‌ప్పుడు దారిలో ఒక ఆందోళ‌న జ‌రుగుతోంది. దీన్ని కంట్రోల్ చేసేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. వీరికి సంబంధం లేకున్నా.. పోలీసులు వీరిపై కూడా భాష్ప‌వాయువును ప్ర‌యోగించ‌టంతో ఆగ్రహం చెందిన ఆమె ముఖానికి చున్నీతో ముసుగు క‌ట్టుకొని పోలీసుల‌పై రాళ్లు విసిరింది. ఈ ఆందోళ‌న‌ను క‌వ‌ర్ చేస్తున్న మీడియా ప్ర‌తినిధి ఫోటో తీయ‌టంతో ఈ వ్య‌వ‌హారం సంచ‌లనంగా మారింది.

ఈ ఇష్యూను క‌ట్ చేస్తే.. ఇప్పుడా అమ్మాయి ఎక్క‌డ ఉంది? ఏం చేస్తుంద‌న్న‌ది చూస్తే ఆశ్చ‌ర్య‌పోవాల్సిందే. ఎందుకంటే.. ఇప్పుడా అమ్మాయి క‌శ్మీర్ రాష్ట్ర పుట్ బాల్ జ‌ట్టుకు కెప్టెన్ గా ఎంపికైంది. దేశం గ‌ర్వ‌ప‌డే స్థాయికి చేర‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

తాజాగా కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ క‌శ్మీర్‌ లో ప‌ర్య‌టించిన సంద‌ర్భంగా రాష్ట్ర పుట్ బాల్ మ‌హిళా జ‌ట్టును క‌లిశారు. ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న 21 ఏళ్ల అఫ్షాన్‌ ఆషిఖ్ ను అభినందించారు. క‌శ్మీర్ రాష్ట్రంలో ప్ర‌తిభ ఉన్న ఎంతోమంది యువ‌తీ యువ‌కులు ఉన్నార‌ని.. వారంద‌రికి ఒక వేదిక కావాల‌ని.. అలాంటి వారికి ప్ర‌భుత్వం అవ‌కాశాలు క‌ల్పిస్తే ఎంతో ఉన్న‌త స్థితికి చేరుకుంటార‌ని చెబుతోంది. మ‌రో విష‌యం ఏమిటంటే.. అఫ్షాన్‌ ఆషిఖ్ జీవిత క‌థను ఒక ప్ర‌ముఖ బాలీవుడ్ ద‌ర్శ‌కుడు సినిమా తీయాల‌న్న ప్లాన్ లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News