ఇది ఒక చిన్నారి పెళ్లికూతురి క‌థ‌.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

Update: 2022-09-09 15:30 GMT
ఏడాది వ‌య‌సున్న బాలిక‌కు ఆమె కుటుంబ స‌భ్యులు చేసిన పెళ్లిని ఓ కోర్టు 20 ఏళ్ల త‌ర్వాత రద్దు చేస్తూ సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది. రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్ లో ఉన్న ఫ్యామిలీ కోర్టు ఈ తీర్పు ఇచ్చి సంచ‌ల‌నం సృష్టించింది.

ఈ కేసు వివ‌రాలు ఇలా ఉన్నాయి... 20 ఏళ్ల క్రితం జోధ్‌పూర్ నగరానికి చెందిన రేఖ అనే బాలిక తాత మరణించడంతో.. ఏడాది వయసులోనే ఆమెను అదే గ్రామానికి చెందిన ఓ బాలుడికి ఇచ్చి బాల్య వివాహం చేశారు. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు రేఖను కాపురానికి రమ్మని అత్తింటివారు ఒత్తిడి చేశారు. కానీ రేఖ ఏఎన్ఎం (న‌ర్సు) కోర్సు చ‌దువుతుంది. దీంతో ఆమె అత్తింటికి వెళ్ల‌డానికి తిర‌స్క‌రించింది.

దీంతో రేఖ‌కు ఏడాది వ‌య‌సు ఉండ‌గానే పెళ్లి అయ్యింది కాబ‌ట్టి కాపురానికి రాకుంటే ఆమె కుటుంబ స‌భ్యులు అత్తింటివారికి రూ.10 లక్ష‌లు చెల్లించాల‌ని కుల‌పెద్ద‌లు తీర్పు చెప్పారు. దీంతో రేఖ స్థానికంగా ఉన్న ఒక స్వ‌చ్చంధ సంస్థ ఎండీ కీర్తి భార‌తికి త‌న గోడు వెల్ల‌బోసుకుంది. దీంతో ఆమె రేఖ‌తో జోధ్‌పూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో పిటిష‌న్ వేయించింది.

తాను న‌ర్సు కావాల‌నే లక్ష్యంతో ఏఎన్ఎం కోర్సు చ‌దువుతున్నాన‌ని.. త‌న‌కు ఏడాది వ‌య‌సులో పెళ్లి జ‌రిగింద‌ని.. ఇప్పుడు అత్తింటివారు త‌న‌ను కాపురానికి రావాల‌ని కోరుతున్నార‌ని త‌న పిటిష‌న్‌లో రేఖ వివ‌రించింది. రాక‌పోతే రూ.10 లక్ష‌లు చెల్లించాల‌ని త‌న‌ను కుల పెద్ద‌ల ద్వారా బెదిరిస్తున్నార‌ని కోర్టు దృష్టికి తెచ్చింది.

దీంతో ఈ కేసును విచారించిన జోధ్‌పూర్ ఫ్యామిలీ కోర్టు  వివాహాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ద‌శాబ్దాల క్రిత‌మే బాల్య వివాహాల‌ను దేశంలో ర‌ద్దు చేశార‌ని.. బాల్య‌వివాహాలు చేస్తే క‌ఠినంగా శిక్షిస్తున్నా ఇంకా ఈ దురాచారాలు కొన‌సాగ‌డం దారుణ‌మ‌ని కోర్టు పేర్కొంది. రేఖ‌కు ఏడాది వ‌య‌సులో జ‌రిగిన పెళ్లి చెల్లుబాటు కాద‌ని న్యాయ‌స్థానం విస్ప‌ష్ట ఆదేశాలు ఇచ్చింది.

దీంతో రేఖ ఆనందం వ్యక్తం చేశారు. ఏఎన్ఎం కావాలనే తన కలను నిజం చేసుకుంటాన‌ని తెలిపింది. సెప్టెంబ‌ర్ 9న త‌న పుట్టిన రోజు అని.. ఇదే రోజు నా పెళ్లిని ర‌ద్దు చేస్తూ కోర్టు త‌న‌కు మంచి బ‌హుమ‌తి ఇచ్చింద‌ని రేఖ వ్యాఖ్యానించింది. రూ.10 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని తీర్పు ఇచ్చిన కుల పెద్ద‌ల‌పై కేసు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News