అమెరికాలో కాదు మన ఇండోర్ లో అలా జరిగింది

Update: 2016-06-12 08:16 GMT
అమెరికాలో తుపాకీ కల్చర్ ఎంత ఎక్కువన్నది అందరికి తెలిసిందే. రక్షణ కోసం తుపాకీలు వినియోగించే వారు కొందరైతే.. మోజుతో ఉంచుకునే వారు మరికొందరు. పప్పు బెల్లలా మాదిరే తమకు నచ్చిన తుపాకీలను కొనుగోలు చేసే అవకాశం అమెరికాలో ఎక్కువ. ఇలాంటి తీరుపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావటంతో పాటు.. అమెరికాలోనే ఈ వ్యవహారాన్ని ఖండిస్తూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

గన్స్ కల్చర్ ఎక్కువగా ఉండే అమెరికాలో ఎన్ని దరిద్రాలు చోటుచేసుకుంటున్నాయో తెలిసిందే. గన్ కల్చర్ మీద ఓపక్క విమర్శలు వినిపిస్తుంటే.. దీన్ని సమర్థించే వారు లేకపోలేదు.  ఏది ఏమైనా ఎక్కువ ఆంక్షలు లేకుండానే గన్స్ వినియోగం మీద నియంత్రణ ఉండాలన్న మాట పలువురి నోటి నుంచి వస్తున్నదే. ఇదిలా ఉంటే.. అందుకు భిన్నమైన వాతావరణం ఉండే ఇండియాలో అనూహ్య  పరిణామాలు చోటు చేసుకోవటం ఇప్పుడు షాకింగ్ గా మారింది.

మధ్యప్రదేశ్ లోని ఒక కాలేజ్ ఫంక్షన్ లో అక్కడి విద్యార్థులు ఏకంగా ఏకే 47 తుపాకీలతో హడావుడి  చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. కాలేజీ 125వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డ్యాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ డ్యాన్స్ లో పాల్గొన్న విద్యార్థులు ఏకే 47 తుపాకీలు పట్టుకొని ఊగిపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎంత కాలేజీ ఫంక్షన్ అయితే మాత్రం ఆ విధంగా ఏకే 47ను ఉపయోగించిన అంశం పై  పోలీసులకు ఫిర్యాదు చేయటం..ఈ ఘటనకు దర్యాప్తు చేసేందుకు వీలుగా విద్యార్థుల్ని అదుపులోకి తీసుకోవాలని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు.. విద్యార్దులతో పాటు కళాశాల ప్రిన్సిపల్ ను కూడా అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజీకి వెళ్లటంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లుగా చెబుతున్నారు. ఈ డ్యాన్స్ కార్యక్రమాన్ని వీడియో తీసిన వారి నుంచి క్లిప్పింగ్ ను సేకరించిన పోలీసులు.. సదరు వీడియో సాయంతో నిందితుల్ని గుర్తించాలని భావిస్తున్నారు. ఏమైనా.. కాలేజీ ఫంక్షన్ కు ఏకే 47 తీసుకావటం వరకూ వ్యవహారం వెళ్లిందంటే.. పోలీసులు మరింత శ్రద్ధతో ఈ వ్యవహారాన్ని చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.
Full View


Tags:    

Similar News