జార్జ్ సోరస్ ఎవరో మూడు ముక్కల్లో తేల్చేసిన కేంద్ర మంత్రి..!

Update: 2023-02-18 18:13 GMT
అమెరికా పెట్టుబడిదారుడు జార్జ్ సోరస్ ఇటీవల జరిగిన జర్మనీలోని మ్యూనిస్ భద్రతా సదస్సులో ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూప్ షేర్లు పతనమయ్యాయి. ఈ క్రమంలోనే గౌతమ్ అదానీకి చెందిన వేల కోట్ల సంపద ఆవిరైంది. ఈ విషయంపై జార్జ్ సోరస్ స్పందిస్తూ అదానీ.. మోదీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు. అదానీ గ్రూప్ పతనంతో భారత్ లో మోదీ సైతం బలహీన పడతారని కామెంట్ చేశారు.

ఈ ప్రక్రియ భారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ దోహద పడుతుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జార్జ్ సోరస్ వ్యాఖ్యలపై నిన్న కేంద్ర మంత్రి స్మతి ఇరానీ గట్టి కౌంటర్ ఇచ్చారు. మోదీపై జార్జ్ సోరెస్ విద్వేష పూరిత వ్యాఖ్యలు ప్రధానిపైనే కాకుండా భారత ప్రజాస్వామ్య వ్యవస్థ దాడి అని మండిపడ్డారు.

బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ను దోచుకున్న జార్జ్ సోరస్ ను ఆ దేశం ఆర్థిక నేరగాడికి ఎప్పుడో ప్రకటించిందని ఆమె వెల్లడించారు. ఇలాంటి వ్యక్తులు ఇతర దేశాల్లోని ప్రభుత్వాలను కూలగొట్టి తమకు నచ్చిన వారిని ప్రభుత్వంలోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తారన్నారు. మన అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవాలని గతంలోనూ పలువురు ఇలానే వ్యవహరించారని వారిని మనమంతా ఓడించామని ఆమె గుర్తు చేశారు.

కాగా జార్జ్ సోరస్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సైతం మండిపడింది. అదానీ వ్యవహారం భారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు దారితీస్తుందా? లేదా అనేది కాంగ్రెస్.. ప్రతిపక్ష పార్టీలు.. తమ ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుందన్నారు. ఈ విషయంలో జార్జ్ సోరస్ లాంటి వ్యక్తులు ఎంత మాత్రం సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ సైతం జార్జ్ సోరస్ వ్యాఖ్యలపై మండిపడ్డారు.

''జార్జ్ సోరస్ కు వయసు మళ్లింది.. మూర్ఖమైన అభిప్రాయాలు కలిగిన ఈ బిలియనీర్.. ప్రపంచం మొత్తం ఎలా పని చేయాలో తన అభిప్రాయాలే నిర్ణయించాలని ఆలోచిస్తున్నాడు.. ఇలాంటి వారు తమకు అనుకూల కథనాలు రూపొందించడంలో పెట్టుబడులు పెడుతుంటారు.. వారికి అనుకూలమైన వ్యక్తి అధికారంలోకి వస్తే.. ఎన్నికలు సక్రమంగా జరిగాయంటారు.. లేకపోతే అవకతవకలు జరిగాయంటారు.. స్వేచ్ఛ సమాజం అనే సాకుతో ఈ కొత్త వాదనలు తెరపైకి తీసుకొస్తుంటారని'' జైశంకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

జార్జ్ సోరస్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రులు విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు సైతం స్పందిస్తున్నారు. తమ దేశ ఎన్నికల ఫలితాలను జార్జ్ సోరెస్ లాంటి వ్యక్తులు నిర్ణయించలేరని నిన్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైరాం రమేష్ ట్వీటర్లో స్పష్టం చేశారు. తాజాగా ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం స్పందించారు.

జార్జ్ సోరస్ గతంలోనూ.. ప్రస్తుతం మాట్లాడిన చాలా అంశాలతో తాను ఏకీభవించబోనని ఆయన స్పష్టం చేశారు. అయితే ఆయన వ్యాఖ్యలను 'ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం' అని బీజేపీ ఆపాదించడం చాలా సిల్లిగా అనిపిస్తుందంటూ చిదంబరం వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా అదానీ.. మోదీ.. జార్జ్ సోరస్ మూడు ముక్కలాట అసలు అంశాలను పక్కదారి పట్టిస్తున్నాయనే కామెంట్స్ విన్పిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News