ర‌జ‌నీ మీద ఎంత బుర‌ద చ‌ల్లాడు బాబోయ్‌

Update: 2017-06-24 15:50 GMT
బీజేపీ సీనియర్ నేత, ఫైర్‌బ్రాండ్‌ సుబ్రహ్మణ్య స్వామి నోటికి ప‌దును పెట్టారంటే ఎదుటివారు ఎంత‌టి వారు అనేది చూడ‌కుండా త‌న మ‌న‌సులో ఉన్న‌ది అనేస్తుంటారు. గ‌త కొద్దికాలంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పొలిటిక‌ల్ ఎంట్రీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి ఈ క్ర‌మంలో ప‌లు విమ‌ర్శ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.  తమిళులు బాగా చదువుకున్న వారని, దీంతో రజనీ రాజకీయాలకు అస్సలు పనికి రారని ఇప్పటికే పలు విమర్శలు చేసిన స్వామి తాజాగా మాటల తీవ్రత‌ పెంచారు. రజనీ అవకతవకలకు పాల్పడ్డారని, దీనికి సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు.

తాజాగా సుబ్రహ్మణ్య స్వామి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ  రాజకీయాలకు రావాలన్న ఆకాంక్షను రజనీ మానుకోవాలని హిత‌వు ప‌లికారు. రజనీకాంత్ ఓ ఫ్రాడ్ అని, అసలు ఆయన రాజకీయాల్లోకి పనికి రారని చెప్పి తేల్చిప‌డేశారు. రాజ‌కీయాల్లోకి రావాల‌నే రజనీకాంత్ కోరిక‌కు అడ్డు ఎవ‌రో కాద‌ని, ఆయన పాల్పడిన ఆర్థిక అవకతవకలే అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఒక వేళ ఆ వివరాలు మొత్తం బయటపడితే రజనీ రాజకీయాల్లో కొనసాగలేరని కూడా సుబ్రహ్మణ్య స్వామి అన్నారు. మీడియాలో ర‌జ‌నీ గురించి ఎంతో గొప్పగా చెబుతున్నారని, అయితే ఈ విషయం బయటపడితే ఆయన ఇమేజ్ కాస్త పూర్తిగా కుప్పకూలిపోతుందని చెప్పారు. అందుకే రాజకీయాల్లోకి రావ‌ద్దంటూ రజనీకాంత్ కు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి హితవు పలికారు.

మ‌రోవైపు రజనీ రాజకీయాల్లోకి వస్తున్నారన్న వార్తలు, సంకేతాల నేపథ్యంలో ఆయనపై సుబ్రహ్మణ్య స్వామి మండిపడుతున్నప్ప‌టికీ బీజేపీ నేత‌లు మాత్రం త‌లైవాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి, అందులో బీజేపీలోకి రజనీలాంటి మంచి వ్యక్తులు రావాల్సిన అవసరం చాలా ఉందని ఆయనను స్వాగతించారు. పార్టీలో మోడీ త‌ర్వాత అత్యంత ప‌వ‌ర్ ఫుల్ అయిన అమిత్ షా ఆహ్వానించిన‌ప్ప‌టికీ త‌లైవాపై స్వామి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. స్వామి వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఎలా స్పందిస్తుంద‌నే ఆస‌క్తి మిగ‌తా పార్టీల్లో నెల‌కొన‌డం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News