సుబ్రహ్మణ్య స్వామి బాబునూ టార్గెట్ చేస్తున్నారా?

Update: 2016-06-25 08:09 GMT
 సోనియా గాంధీ కుటుంబాన్ని - ఆర్బీఐ గవర్నరు రఘురామ్ రాజన్ ను టార్గెట్ చేసి ముప్పతిప్పలు పెట్టిన బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి అంటే దేశంలోని రాజకీయ నేతలు భయపడుతున్నారు. ఆయన

ఎవరిక పేరెత్తితే వారు ఉలిక్కి పడుతున్నారు. న్యాయ పోరాటాల్లో ఆరితేరిపోయిన ఆయన తన ప్రత్యర్థులకు సాధ్యం కాని రీతిలో ఎత్తుగడలు వేస్తూ వారిని ముప్పతిప్పలు పెట్టడంలో సిద్ధహస్తుడు. అందుకే సుబ్రహ్మణ్యం కన్ను తమపై పడకూడదని దేశంలోని నేతలంతా దేవుడిని వేడుకుంటున్నారట.  ఇంతకాలం ఢిల్లీ రాజకీయాలపైనే దృష్టి పెట్టిన ఆయన ఇప్పుడు ఏపీపైనా ఫోకస్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ కామెంట్లు చేశారు. దీంతో టీడీపీ ఒక్కసారిగా కలవరపడినట్లుగా కనిపిస్తోంది. ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రంపై టీడీపీ ప్రభుత్వం గుత్తాధిపత్యం కొనసాగిస్తోందని సుబ్రహ్మణ్య స్వామి ఆరోపించడంతో ఒక్కసారిగా టీడీపీ అప్రమత్తమైంది. ఆలయ భూములపై టీడీపీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో టీడీపీ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోని పక్షంలో తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. స్వామితో కోర్టులో ఢీకొట్టడం కష్టం కావడంతో ఆయన్ను రాజకీయంగా ఎదుర్కొనాలని టీడీపీ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

కాగా సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం వెనుక ఆయన వ్యక్తిగత కారణాలేమీ కనిపించడం లేదు. విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ప్రోద్బలంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని ఢీకొట్టేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. స్వరూపానందేంద్ర రీసెంటుగా స్వామితో భేటీ అయ్యారు. గోహత్య, రామజన్మభూమి - దేవాలయ భూముల పరిరక్షణ - గంగా ప్రక్షాళన అంశాలపై వారు చర్చించారు. కాగా, ఏపీలో దేవాలయ భూములు - సత్రం భూములు కబ్జాకు గురవుతున్నాయని, ఆ భూములను అమ్మేస్తూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని... సుబ్రహ్మణ్య స్వామి జోక్యం చేసుకుంటేనే అలాంటి విషయాల్లో ప్రభుత్వానికి అడ్డుకట్ట పడుతుందని స్వరూపానందేంద్ర కోరడంతో ఆయన అంగీకరించినట్లుగా తెలుస్తోంది.  సదావర్తి సత్రం భూముల వ్యవహారం నేపథ్యంలో ఈ రగడ రేగినట్లు తెలుస్తోంది.

కాగా విశాఖ శారదాపీఠం స్వరూపానందకు చంద్రబాబుకు మధ్య చాలాకాలంగా విభేదాలున్నాయి. చంద్రబాబు విధానాలపై స్వరూపానంద చాలాకాలంగా విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. అయితే, సుబ్రహ్మణ్య స్వామి మాత్రం చంద్రబాబును ముందెన్నడూ టార్గెట్ చేయలేదు. దీంతో స్వరూపానంద పెట్టిన ఫిటింగుల వల్లే సుబ్రహ్మణ్య స్వామి చంద్రబాబుపై దండెత్తినట్లు అనుమానిస్తున్నారు. అయితే.. బీజేపీ - టీడీపీలు మిత్రపక్షాలు కావడంతో బీజేపీ పెద్దలతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉండడంతో సుబ్రహ్మణ్య స్వామిని కంట్రోలు చేయడం పెద్ద విషయమేమీ కాదని టీడీపీ వర్గాలు అంటున్నాయి.
Tags:    

Similar News