కరోనాతో మన పోరు... ఈ శాస్త్రవేత్త లెక్క చూస్తే అవాక్కే

Update: 2020-05-06 02:30 GMT
యావత్తు ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న ప్రాణాంతక వైరస్ కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు భారత్ సహా దాదాపుగా అన్ని దేశాలు కూడా లాక్ డౌన్ బాట పట్టాయి కదా. మొన్న మన దేశంలో లాక్ డౌన్ నెల రోజులు దాటిన సమయంలో కరోనాను కట్టడి చేసేందుకు మనం చాలానే చేశామన్న భావన మనలో చాలా మందిలో కనిపించింది. అయితే కంటికి కూడా కనిపించనంతగా ఉండే కరోనా వైరస్ పై మనం ఇప్పటిదాకా చేసిన పోరు ఇసుకలో రేణువంత కూడా లేదంటున్నారు ఓ శాస్త్రవేత్త. రచయితగా ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న సుబ్రహ్మణ్యన్ నారాయణన్ అనే శాస్త్రవేత్త.. కరోనాపై మనం సాగించిన పోరును కరోనా బరువుతో, ఆ వైరస్ వల్ల ఓ వ్యక్తి కోల్పోయే బరువు, ప్రస్తుతం విశ్వవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య, వారిలో చేరిన మొత్తం వైరస్ కణాల సంఖ్యను లెక్కేసి మరీ ఓ ఆసక్తికర విశ్లేషణ చేశారు. ఈ విశ్లేషణ నిజంగానే ఆసక్తికరంగా ఉందని చెప్పక తప్పదు.

సుబ్రహ్మణ్యన్ నారాయణన్ లెక్క ప్రకారం ఒక్కో కరోనా వైరస్ బరువు 0.85 ఆట్టో గ్రామ్. అంటే... ఓ ట్రిలియన్ గ్రాముల్లో మిలియన్ వంతు అన్న మాట. ఇంత చిన్న బరువు ఉన్న కరోనా వైరస్ కణాలు 70 బిలియన్ల దాకా దాడి చేస్తేనే ఆ వ్యక్తి వైరస్ బారిన పడ్డట్టు. ఈ లెక్కన ఓ వ్యక్తిని తన స్వాధీనంలోకి తీసుకునేందుకు 70 బిలియన్ల కరోనా వైరస్ లు కావాలి. వీటి మొత్తం బరువు 0.0000005 గ్రామ్ బరువు మాత్రమే. ఈ లెక్కన ప్రస్తుతం ప్రపంచంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 20 లక్షలు అనుకుంటే... వారందరినీ కకావికలం చేసిన కరోనా వైరస్ ల బరువు కేవలం ఒక్కటంటే ఒక్క గ్రామే. అంటే ఒక్క గ్రామ్ కరోనా వైరస్ ల కారణంగానే భూమీ మీద ఉన్న మానవాళి మోకరిల్లిందన్న మాట.

ఒక్క గ్రామ్ వైరస్ లు సోకితేనే మనం ఇంతలా గింజుకుంటూ ఉంటే... కరోనా వైరస్ మరింత పెద్ద మొత్తంలో మనపై దాడి చేస్తే పరిస్థితి ఏమిటి? అదే సమయంలో సుబ్రహ్మణ్యన్.. కరోనాపై మనం చేసిన, చేస్తున్న పోరును మరింత లోతుగా విశ్లేషించారు. మనం ఇప్పటిదాకా సాగించిన పోరు మొత్తం కేవలం సింగిల్ గ్రామ్ కరోనా వైరస్ మీదే. సైన్స్ లో ఒక గ్రామ్ బరువు కలిగిన జీవిని అసలు మనం జీవించి ఉన్న దానిగానే గురించం కదా. మరి అలాంటప్పుడు కేవలం గ్రామ్ బరువు ఉన్న కరోనా వైరస్ కే మనం ఇంతలా అల్లాడిపోతున్నామంటే.. మున్ముందు మనం చాలా పోరాటం చేయాల్సి ఉందని నారాయణన్ తనదైన శైలిలో చెప్పేశారు. మొత్తంగా ఇప్పుడప్పుడే కరోనా ముగియదని, దీనిపై మనం మరింతగా పోరాటం చేయాల్సిందేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News